
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ‘కరోనా కాటు’ పడింది. దీంతో యాజమాన్యాలతోపాటు వాటిలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అల్లాడిపోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా జబ్బులొస్తున్నా వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అత్యవసర కేసులు మినహా అన్ని చికిత్సలకూ బ్రేక్ పడింది. దీంతో ఆదాయం లేక ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు నిలదొక్కుకునే పరిస్థితి లేకుండా పోయింది. కార్పొరేట్ ఆసుపత్రులు ఎలాగో నెట్టకొచ్చినా, ఇప్పుడు వాటి పరిస్థితీ దిగజారింది. లాక్‌డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులు తీవ్ర నష్టాల్లోకి వెళ్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తన నివేదికలో వెల్లడించింది.
రూ. 22 వేల కోట్ల వరకు నష్టం
లాక్‌డౌన్‌తో ప్రైవేటు ఆసుపత్రుల్లో గత నెల చివరి నాటికే ఏకంగా 40 శాతం రోగుల సంఖ్య తగ్గిందని ఫిక్కి పేర్కొంది. అదే కారణంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏకంగా రూ.13,400 కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల మేరకు నష్టాన్ని ప్రైవేటు ఆసుపత్రులు మూటగట్టుకుంటాయని అంచనా వేసింది. ప్రధాన పట్టణాలు, నగరాల్లోని ఆసుప్రతులు అధికంగా నష్టపోనున్నట్టు పేర్కొంది. ఓపీలు అంతంత మాత్రంగానే ఉండటం, సర్జరీలు వాయిదా వేసుకోవడంతో నిర్వహణ నిలిచిపోయింది. వివిధ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల పనితీరుపై అధ్యయనం చేసిన ఫిక్కీ ఈ నష్టాన్ని అంచనా వేసింది.
పడిపోయిన అంతర్జాతీయ ఆదాయం
దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల ఏడాది ఆదాయం రూ. 2.4 లక్షల కోట్లు ఉంటుందని ఫిక్కి అంచనా వేసింది. ఒక్క హైదరాబాద్‌లో ఉండే సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రులకే నెలకు అంతర్జాతీయ రోగుల ద్వారా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల మేర ఆదాయం సమకూరుతుంది. లాక్‌డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రాణాపాయమైన అత్యవసర సర్జరీలు మినహా మిగతా వైద్యసేవలను నిలిపివేశాయి. అలాగే రోజుకు సగటున 500 మంది వరకు రోగులు ఓపీ కోసం వచ్చే కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రస్తుతం 10మంది కూడా రావడం లేదని ఫిక్కీ తెలిపింది. అలాగే డయాగ్నొస్టిక్ సెంటర్లలోనూ 80శాతం వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య తగ్గింది. ఇప్పటికే కొన్ని రంగాలకు ఆర్థిక ఉపశమనాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం హెల్త్‌కేర్‌రంగానికి కూడా ప్రకటించాలని ఫిక్కీ తన నివేదికలో సూచనలు చేసింది. ఇక దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులకు సీజీహెచ్‌ఎస్, ఈసీహెచ్‌ఎస్ పథకాల కింద ఉన్న రూ.1,700 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల మేర ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించింది. పరోక్ష పన్ను ఉపశమనాలు, మినహాయింపులు ఇవ్వడంతో పాటు కరోనా రోగుల చికిత్స కోసం అవసరమైన మందులు, వినియోగ వస్తువులు, పరికరాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపునివ్వాలని పేర్కొంది.
6 నెలలు కోలుకునే పరిస్థితి లేదు
లాక్‌డౌన్‌తో అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నష్టాల్లోకి వెళ్లాయి. ఆసుపత్రులు నెలలో పూర్తిస్థాయిలో పనిచేస్తే, అందులో 25 రోజులు వచ్చే సొమ్ము శాలరీలు, నిర్వహణ ఖర్చులకే పోతుంది. మిగిలిన ఐదు రోజులు వచ్చేదే ఆదాయం. 30 రోజులు మూతపడడంతో ఆసుపత్రుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ స్కీముల కింద చేసిన చికిత్సల సొమ్ము కేవలం మా ఆసుపత్రికే రూ.80కోట్ల మేర రావాలి. లాక్‌డౌన్ ఎత్తేశాక కూడా ఆరు నెలలపాటు కోలుకునే పరిస్థితి ఉండదనిపిస్తోంది. కాబట్టి ఫిక్కీ నివేదిక చెబుతున్నట్లు బకాయిలు తీర్చాలి. కొన్ని మినహాయింపులనివ్వాలి.
– డాక్టర్ ఎ.వి.గురువారెడ్డి, ఎండీ, సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment