
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పెట్టుబడులే ఆర్థికాభివృద్ధికి చోదకాలని, ఆర్థికాభివృద్ధి లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించ లేమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి చర్యలతో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే దిశగా కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు వెల్ల డించారు. కేంద్ర బడ్జెట్ 2022–23పై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు.
ఆవిష్కరణలు, పెట్టుబడులు, సమ్మిళిత అభివృద్ధి, రవాణా వనరుల అనుసంధానం బడ్జెట్‌కు 4 మూల స్తంభాలన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు బడ్జెట్‌లో భారీగా రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించామన్నారు. ప్రజలపై భారం మోపేలా ఎలాంటి పన్నులను పెంచలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో ఆహార పదార్థాల ధరలు, ద్రవ్యోల్బణం దిగి వస్తోందన్నారు. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని జారీ అవకాశాలపై ఇప్పుడు మాట్లాడడం తొందరపాటు అవుతుందని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రగతిశీల బడ్జెట్‌ను కేంద్రం తీసుకొచ్చిందని ఆస్కీ చైర్మన్ కె.పద్మనాభయ్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment