న్యూఢిల్లీ: ‘టీమ్ ఇండియా’ (భారత జట్టు)లో చేరి, భారత ప్రభుత్వ మూలధన వ్యయ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెంచాలని ప్రైవేటు రంగానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. రానున్న సంవత్సరాల్లోనూ భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా గుర్తింపు నిలబెట్టుకునేందుకు సాయంగా నిలవాలని కోరారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం 35 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లను చేరుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు.. ప్రైవేటు రంగం నుంచి సైతం ఇతోధిక పెట్టుబడులకు మార్గం చూపుతుందన్నారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులకు ఇది అవకాశాల తరుణం.
మీ సామర్థ్యాలను విస్తరించుకోండి. కరోనా మహమ్మారి రావడానికి ముందుతో పోలిస్తే కార్పొరేట్ పన్ను తగ్గించాం. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని కోరుతున్నాను’’ అంటూ పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–8.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసిన విషయం గమనార్హం. ‘‘ముందుకు రండి. వీలైనంత మెరుగ్గా కృషి చేయండి. టీమ్ ఇండియాలో భాగస్వాములై ఈ ఏడాది, వచ్చే ఏడాది, తర్వాతి సంవత్సరాల్లోనూ భారత్ మెరుగైన వృద్ధి నమోదు చేసేందుకు మద్దతుగా నిలవండి’’ అని మంత్రి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment