
ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
♦ సీతారాం ఏచూరి డిమాండ్
♦ హామీల అమలుకు పట్టుబడితే సీఎం కేసీఆర్‌కు కోపమొస్తుంది
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. 16 నెలలైనా ఎందుకు అమలు చేయలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే ఆయనకు కోపమొస్తుందని, ఈ మధ్యకాలంలో వామపక్షాలపై చిర్రుబుర్రులాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల సాధన కోసం హైకోర్టు న్యాయవాది ఉస్మాన్ షాహీద్ అధ్యక్షతన సోమవారమిక్కడ సదస్సులో ఏచూరి ముఖ్యఅథితిగా హాజరై ప్రసంగించారు.
టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్‌ల సిఫార్సులను అమలుచేయాలని ఎన్డీఏ ప్రభుత్వానికి చెప్పినా వినిపిం చుకునే పరిస్థితి లేదన్నారు. కనుక ముస్లింలు రిజర్వేషన్ల సాధనకు పోరాటం చేయాలని, తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ఎస్సీ, ఎస్టీల కంటే దారుణమైన స్థితిలో ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. జనాభాలో 12 శాతం ఉన్న ముస్లింలకు లక్ష కోట్ల బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు దక్కాలని సూచించారు. వీటి కోసం సీఎం కేసీఆర్‌కు దరఖాస్తులో, అర్జీలో పెట్టుకోవడం కాకుండా గల్లాపట్టి తీసుకోవాలన్నారు.
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి
భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం సమాన హక్కులు, అవకాశాలు అణగారిన వర్గాల ప్రజలకు దక్కాలంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ఇందుకోసం పార్లమెంట్‌లో చట్టం చేయాల్సిన అవసరం ఉందని ీసీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం హాల్లో బషీర్‌బాగ్ పీజీ లా కళాశాల, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘రైట్ టు రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టార్ యాజ్ ఏ హ్యూమన్ రైట్’ అనే అంశంపై ఒక రోజు జాతీయస్థాయి వర్క్‌షాప్ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరై సీతారాం ఏచూరి మాట్లాడారు.