
న్యూఢిల్లీ: భాషాపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ మన విద్యార్థులు ఇతర చిన్నచిన్న దేశాలకు సైతం వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోకడను నివారించేందుకు ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యకు అవసరమైన భూ కేటాయింపులకు రాష్ట్రాలు సులభమైన విధానాలను తీసుకురావాలన్నారు.
దేశంతోపాటు ప్రపంచ దేశాలకు కూడా అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని మన వద్దనే తయారు చేసుకోవచ్చని చెప్పారు. శనివారం ప్రధాని కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి కేటాయింపులపై ఒక వెబినార్‌లో ప్రసంగించారు. దేశంలోనే వైద్య విద్యకు విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయన్నారు.
విదేశాల్లో పనిచేస్తున్న మన వైద్యులు తమ నైపుణ్యంతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు పనులు సాగుతున్నట్లు వివరించారు.