అణుశక్తి రంగంలో ‘ప్రైవేటు’
ప్రధాని మోడీ సంకేతాలు
అదనపు పెట్టుబడి వనరులను
సమకూర్చుకోవాలని సూచన
ముంబై: అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేసే దిశగా ప్రధాని నరేంద్రమోడీ సంకేతాలు ఇచ్చారు. ప్రతిష్టాత్మక అణుశక్తి కార్యక్రమం విస్తరణ కోసం అదనపు పెట్టుబడి వనరులను రాబట్టాల్సి ఉందన్నారు. సోమవారం ముంబైలోని భాభా అణు పరిశోధన కేంద్రాని(బార్క్)కి తొలిసారిగా విచ్చేసిన ప్రధాని మోడీ, అణు ఇంధన శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అణు ఇంధన కార్యక్రమానికి పరికరాలు, వ్యవస్థను సరఫరా చేయడంలో ప్రైవేటు రంగం పాత్ర పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి తగినట్లుగా తగిన ప్రోత్సాహక విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. అణు శాస్త్ర రంగంలో భారత శక్తి సామర్థ్యాలకు సంబంధించి మానవీయ కోణాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలని సూచించారు.
అలాగే, ఆరోగ్యం, వ్యర్థాల నిర్వహణ, నీటి శుద్ధి, వ్యవసాయం, ఆహార సంరక్షణ తదితర రంగాల్లో అణు విజ్ఞాన అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని అణు ఇంధన విభాగాన్ని కోరారు. ఈ సందర్భంగా భారత అణుశక్తి కార్యక్రమంపై ప్రధానికి ఆ శాఖ కార్యదర్శి ఆర్కే సిన్హా, బార్క్ ఉన్నతాధికారులు తెలియజేశారు. వైద్య రంగంలో ముఖ్యం గా కేన్సర్ చికిత్సతో పాటు ఆహార భద్రత, వ్యర్థా ల నిర్వహణ, నీటి శుద్ధి విషయంలో అణుఇంధన శాఖ కృషిని వివరించారు. అణు శక్తి కార్యక్రమానికి తనవైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ప్రధాని అధికారులకు భరోసా ఇచ్చారు. అణు విద్యుత్ ఉత్పాతకతను 2023-24 నాటికి మూడు రెట్లకు పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.