Medical / Dental College
-
కాకతీయ మెడికల్ కాలేజీలో రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు
ఎంజీఎం: వరంగల్ నగరంలోని కాకతీయ ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ) మరో మైలురాయిని అధిగమించింది. 15 రోజుల క్రితం రీజినల్ శిక్షణ కేంద్రం ప్రారంభానికి అనుమతులు రాగా, వారంరోజుల క్రితం సూపర్ స్పెషాలిటీ సీట్లు సాధించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా రీసెర్చ్ యూనిట్ ప్రారంభానికి కేంద్రంనుంచి అనుమతులు వచ్చా యి. పదిహేను రోజుల వ్యవధిలో మూడు ప్రత్యేకతలను సాధించుకోవడంతో కేఎంసీ అధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి 2007లో రీసెర్చ్ యూ నిట్ మంజూరు చేయాలని అప్పటి ప్రిన్సిపల్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆ తరువాత విషయం మరుగునపడింది. ఏడాదిన్నర కాలం నుంచి కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ రీసెర్చ్ యూనిట్ మంజూరు కోసం చేసిన విన్నపం ఎట్టకేలకు ఫలించింది. కేంద్రప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధులు మంజూరు చేసి రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడానికి అనుమతినిస్తూ గురువారం కాలేజీకి ఉత్తర్వులు అందజేసింది. ఢిల్లీలోని ఐసీఎంఆర్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఈ రీసెర్చ్ యూనిట్లను దేశవ్యాప్తంగా ఐదు మంజూరు చేయగా అందులో ఒకటి సిద్దిపేట మెడికల్ కళాశాలకు, మరోటి వరంగల్ కేఎంసీకి దక్కింది. 15 రోజుల వ్యవధిలో రెండు ప్రత్యేక అనుమతులు కాకతీయ మెడికల్ కళాశాలలో నెల్స్ (నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్టు) పథకంలో భాగంగా నెలరోజుల్లో రీజినల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి పూర్తిస్థాయి అనుమతులు లభించి 15 రోజులు గడవకముందే రీసెర్చ్ సెంటర్ మంజూరుపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్స్ శిక్షణ కేంద్రం ప్రస్తుతం ఒక్క ఉస్మానియా మెడికల్ కళాశాలలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి శిక్షణ కేంద్రాన్ని వరంగల్‌లోనే ప్రారంభించాలని సంకల్పించి రూ.1.50 కోట్ల పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి కేఎంసీకి చేర్చింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై వైద్యసిబ్బంది, వైద్యులకు అందించే ఈ శిక్షణ కార్యక్రమాలపై 16మంది ప్రొఫెసర్ స్థాయి వైద్యులకు తర్ఫీదు ఇచ్చారు. ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే అకస్మికంగా కుప్పకూలే వారిని కాపాడేందుకు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వైద్యులు జరిపే పరిశోధలకు పూర్తిస్థాయిలో సహకరించే విధంగా రీసెర్చ్ కేంద్రాన్ని సైతం కేఎంసీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి వైద్యవిద్యార్థుల విద్యబోధనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కాగా, వారం రోజులక్రితం ఐదు సూపర్‌స్పెషాలిటీ సీట్లు, ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు సాధించకోవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఏడాదిన్నర కృషి ఫలితం ఎట్టకేలకు కేఎంసీకి రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. ఇక్కడ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుకు 2007లో ఐసీఎంఆర్‌కు అప్పటి ప్రిన్సిపాల్ దరఖాస్తు చేశారు. కొన్ని కారణాల వల్ల దానిని తిరస్కరించారు. 2021 జూన్ నెలలో కేఎంసీ బోధన సిబ్బందితో సైంటిఫిక్ కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అడిగిన అన్ని రకాల నివేదికలను సమర్పించాం. వాటిని పరిశీలించిన కేంద్రం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.కోటితో రీసెర్చ్ యూనిట్ సంబంధించిన పరికరాలు, రూ.25 లక్షలతో సివి ల్ పనులు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుతో కేఎంసీ, ఎంజీఎంలోని వైద్యులు, వైద్యసిబ్బందికి వివిధ కోర్సుల్లో పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌దాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ -
వైద్యవిద్యా రంగంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించండి..ప్రైవేట్ సంస్థలకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: భాషాపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ మన విద్యార్థులు ఇతర చిన్నచిన్న దేశాలకు సైతం వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోకడను నివారించేందుకు ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యకు అవసరమైన భూ కేటాయింపులకు రాష్ట్రాలు సులభమైన విధానాలను తీసుకురావాలన్నారు. దేశంతోపాటు ప్రపంచ దేశాలకు కూడా అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని మన వద్దనే తయారు చేసుకోవచ్చని చెప్పారు. శనివారం ప్రధాని కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యరంగానికి కేటాయింపులపై ఒక వెబినార్‌లో ప్రసంగించారు. దేశంలోనే వైద్య విద్యకు విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న మన వైద్యులు తమ నైపుణ్యంతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు పనులు సాగుతున్నట్లు వివరించారు. -
అసోంలో ప్రధాని మోదీ పర్యటన
అసోం: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలైన బెంగాల్, అసోం రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా సోనిత్పూర్ జిల్లా థెకియాజులిలోని ‘అసోం మాలా’ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అసోం మాలా కింద రూ.7,700 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు. దాంతోపాటు బిశ్వనాథ్, చరైడియోలోని రెండు వైద్య కళాశాలలకు ప్రధాని శంకుస్థాపన స్థాపన చేశారు. మెడికల్ కాలేజీలకు పునాదిరాయి వేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. త్వరలో గువాహటిలో ఎయిమ్స్ వైద్య కళాశాల నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి వైద్య కళాశాలల్లో విద్యార్థులకు అస్సామీలో బోధిస్తారని చెప్పారు. "ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక వైద్య కళాశాల, ఒక సాంకేతిక కళాశాలలో మాతృభాషలో బోధించేలా చూడటం నా కల. ఎన్నికల తర్వాత మేము అధికారంలోకి వచ్చాక స్థానిక భాషల్లో బోధించడానికి వైద్య, సాంకేతిక కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు అసోం ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను" అని ఆయన అన్నారు. అలాగే, టీ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్ 2021లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అసోం పర్యటన అనంతరం బెంగాల్ హల్దియాలో నేటి సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన బయల్దేరి వెళ్లారు. (చదవండి: ఆకస్మిక వరద: 150 మంది గల్లంతు!) -
రేపటి నుంచి ఏపీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్/డెంటల్ కళాశాలల్లోని ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు బుధవారం నుంచి తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 5 నుంచి 7 వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. 8 నుంచి 11వ తేదీ వరకూ రిజర్వేషన్(బీసీ/ఎస్సీ/ఎస్టీ) కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, ఇందుకోసం మొదటి నుంచి 35వేల ర్యాంకుల వరకూ సాధించిన బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులను పిలిచారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1,375, ఎస్వీయూ పరిధిలో 1,050, స్టేట్‌వైడ్ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 450, ఎస్వీయూ పరిధిలో 225, ఇతర దంతవైద్య కళాశాలల్లో 40 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో 341, బీడీఎస్‌లో 102 అన్రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి కాక తిరుపతి పద్మావతి మెడికల్ క ళాశాల(స్విమ్స్)లో 127 సీట్లకు యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఏపీలో మొత్తం 11 ప్రభుత్వ, 11 ప్రైవేటు మెడికల్ కళాశాలలు, 2 ప్రభుత్వ, 12 ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్ కేంద్రాలు: విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్కూల్ బిల్డింగ్‌కు ఎదురుగా, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్, కూకట్పల్లి హైదరాబాద్ జేఎన్టీయూ ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సీట్లు, కళాశాలల వివరాలతో కూడిన సీట్ మ్యాట్రిక్స్ ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టారు. మరిన్ని వివరాలను హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో పొందవచ్చు.