కాకతీయ మెడికల్ కాలేజీలో రీసెర్చ్‌ యూనిట్‌ ఏర్పాటు | New research unit at Kakatiya Medical College | Sakshi
Sakshi News home page

కాకతీయ మెడికల్ కాలేజీలో రీసెర్చ్‌ యూనిట్‌ ఏర్పాటు

Published Fri, Apr 7 2023 1:42 AM | Last Updated on Fri, Apr 7 2023 1:36 PM

- - Sakshi

ఎంజీఎం: వరంగల్‌ నగరంలోని కాకతీయ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల (కేఎంసీ) మరో మైలురాయిని అధిగమించింది. 15 రోజుల క్రితం రీజినల్‌ శిక్షణ కేంద్రం ప్రారంభానికి అనుమతులు రాగా, వారంరోజుల క్రితం సూపర్‌ స్పెషాలిటీ సీట్లు సాధించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా రీసెర్చ్‌ యూనిట్‌ ప్రారంభానికి కేంద్రంనుంచి అనుమతులు వచ్చా యి. పదిహేను రోజుల వ్యవధిలో మూడు ప్రత్యేకతలను సాధించుకోవడంతో కేఎంసీ అధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

కాకతీయ మెడికల్‌ కాలేజీకి 2007లో రీసెర్చ్‌ యూ నిట్‌ మంజూరు చేయాలని అప్పటి ప్రిన్సిపల్‌ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆ తరువాత విషయం మరుగునపడింది. ఏడాదిన్నర కాలం నుంచి కేఎంసీ ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ రీసెర్చ్‌ యూనిట్‌ మంజూరు కోసం చేసిన విన్నపం ఎట్టకేలకు ఫలించింది. కేంద్రప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధులు మంజూరు చేసి రీసెర్చ్‌ సెంటర్‌ నెలకొల్పడానికి అనుమతినిస్తూ గురువారం కాలేజీకి ఉత్తర్వులు అందజేసింది. ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఈ రీసెర్చ్‌ యూనిట్‌లను దేశవ్యాప్తంగా ఐదు మంజూరు చేయగా అందులో ఒకటి సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు, మరోటి వరంగల్‌ కేఎంసీకి దక్కింది.

15 రోజుల వ్యవధిలో రెండు ప్రత్యేక అనుమతులు

కాకతీయ మెడికల్‌ కళాశాలలో నెల్స్‌ (నేషనల్‌ ఎమర్జెన్సీ లైఫ్‌ సపోర్టు) పథకంలో భాగంగా నెలరోజుల్లో రీజినల్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి పూర్తిస్థాయి అనుమతులు లభించి 15 రోజులు గడవకముందే రీసెర్చ్‌ సెంటర్‌ మంజూరుపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్స్‌ శిక్షణ కేంద్రం ప్రస్తుతం ఒక్క ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి శిక్షణ కేంద్రాన్ని వరంగల్‌లోనే ప్రారంభించాలని సంకల్పించి రూ.1.50 కోట్ల పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి కేఎంసీకి చేర్చింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై వైద్యసిబ్బంది, వైద్యులకు అందించే ఈ శిక్షణ కార్యక్రమాలపై 16మంది ప్రొఫెసర్‌ స్థాయి వైద్యులకు తర్ఫీదు ఇచ్చారు. ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే అకస్మికంగా కుప్పకూలే వారిని కాపాడేందుకు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వైద్యులు జరిపే పరిశోధలకు పూర్తిస్థాయిలో సహకరించే విధంగా రీసెర్చ్‌ కేంద్రాన్ని సైతం కేఎంసీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి వైద్యవిద్యార్థుల విద్యబోధనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కాగా, వారం రోజులక్రితం ఐదు సూపర్‌స్పెషాలిటీ సీట్లు, ఐదు ఎమర్జెన్సీ మెడిసిన్‌ సీట్లు సాధించకోవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఏడాదిన్నర కృషి ఫలితం

ఎట్టకేలకు కేఎంసీకి రీసెర్చ్‌ సెంటర్‌ మంజూరైంది. ఇక్కడ రీసెర్చ్‌ యూనిట్‌ ఏర్పాటుకు 2007లో ఐసీఎంఆర్‌కు అప్పటి ప్రిన్సిపాల్‌ దరఖాస్తు చేశారు. కొన్ని కారణాల వల్ల దానిని తిరస్కరించారు. 2021 జూన్‌ నెలలో కేఎంసీ బోధన సిబ్బందితో సైంటిఫిక్‌ కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అడిగిన అన్ని రకాల నివేదికలను సమర్పించాం. వాటిని పరిశీలించిన కేంద్రం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.కోటితో రీసెర్చ్‌ యూనిట్‌ సంబంధించిన పరికరాలు, రూ.25 లక్షలతో సివి ల్‌ పనులు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ రీసెర్చ్‌ యూనిట్‌ ఏర్పాటుతో కేఎంసీ, ఎంజీఎంలోని వైద్యులు, వైద్యసిబ్బందికి వివిధ కోర్సుల్లో పరిశోధనలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌దాస్‌, కేఎంసీ ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement