న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ నికర లాభంపై కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ భారం ప్రభావం చూపించింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలకు ఈ బ్యాంక్ పూర్తిగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. ఈ కేటాయింపులు లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగి ఉండేది. కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఏ మాత్రం రుణాలిచ్చిందనేది ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పుణ్యమాని ఈ బ్యాంక్ మొండి బకాయిలు భారీగా పెరిగాయి.
54 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం....
గత క్యూ3లో రూ. 1,336 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 41 శాతం వృద్ధితో రూ.1,884 కోట్లకు ఎగసిందని బ్యాంక్ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. రుణాలు 46 శాతం వృద్ధి చెంది రూ.35,599 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రుణ వృద్ధి జోరుగా ఉండటం, మార్జిన్లు పటిష్టంగా(10.5 శాతం) ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 54 శాతం ఎగసి రూ.1,124 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇతర ఆదాయం 48 శాతం పెరిగి రూ.234 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.574 కోట్ల నుంచి 57 శాతం పెరిగి రూ.900 కోట్లకు చేరిందని తెలిపారు. గత క్యూ3లో 9.9 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 10.3 శాతానికి పెరిగిందని వివరించారు.
తగ్గిన రుణనాణ్యత...
ఇన్ని సానుకూలాంశాలున్నా ఈ బ్యాంక్ రుణ నాణ్యత తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 1.29 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిల నిష్పత్తి ఈ క్యూ3లో 2.41 శాతానికి పెరిగింది. అలాగే నికర మొండి బకాయిలు 0.69 శాతం నుంచి 0.70 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో రూ.124 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.474 కోట్లకు పెరిగాయని ఘోష్ పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి ఇచ్చిన రుణాల కోసం రూ.385 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేటాయింపులు లేకపోతే మొత్తం కేటాయింపులు రూ.90 కోట్లుగానే ఉండేవని వివరించారు.
హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన గృహ్ ఫైనాన్స్ కంపెనీని కొనుగోలు చేయడానికి ఈ బ్యాంక్ ఇటీవలనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగిస్తుందన్న ధీమాను బ్యాంక్ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్ర శేఖర్ ఘోష్ వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బంధన్ బ్యాంక్ షేర్ పెరిగింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నా, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లు పతనమైనా, బంధన్ బ్యాంక్ షేర్ 4 శాతం ఎగసి రూ.472 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment