
ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభం 25% అప్
క్యూ1లో రూ. 525 కోట్లు...
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో రూ.525 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.421 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం వృద్ధి చెందింది. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 2,874 కోట్ల నుంచి రూ.3,448 కోట్లకు పెరిగింది. 20 శాతం ఎగసింది. ఇక క్యూ1లో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) కూడా 22 శాతం ఎగబాకి రూ.724 కోట్ల నుంచి రూ.981 కోట్లకు చేరింది.
ఇతర ఆదాయం 26 శాతం పెరిగి రూ.724 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఫీజులు, బీమా, మ్యూచువల్ ఫండ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఆదాయంలో 43 శాతం పెరుగుదల(రూ.107 కోట్లు) కారణంగా ఇతర ఆదాయాలు భారీగా పుంజుకున్నాయని బ్యాంక్ ఎండీ, సీఈఓ, రమేశ్ సోబ్తి పేర్కొన్నారు. ఇక క్యూ1లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) 0.79 శాతానికి తగ్గాయి. గతేడాది క్యూ4(మార్చి క్వార్టర్)లో ఇవి 0.81 శాతంగా ఉన్నాయని సోబ్తి తెలిపారు. నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) కూడా స్థిరంగా 3.68 శాతం(రూ.453 కోట్లు)గా నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఈ నెల ఆరంభంలో సంస్థాగతంగా షేర్ల కేటాయింపుల ద్వారా రూ.4,327 కోట్లను సమీకరించామని.. త్వరలో ప్రమోటర్లకు ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూపంలో మరో రూ.750 కోట్లను సమీకరించనున్నట్లు సోబ్తి వివరించారు. ఫలితాల నేపథ్యంలో సోమవారం ఇండస్‌ఇండ్ షేరు ధర బీఎస్‌ఈలో 3.27 శాతం ఎగబాకి రూ.924 వద్ద ముగిసింది.