న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1,642 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,244 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,685 కోట్ల నుంచి రూ. 8,063 కోట్లకు పుంజుకుంది. అయితే నికర వడ్డీ ఆదాయం రూ. 6,912 కోట్ల నుంచి రూ. 6,480 కోట్లకు నీరసించింది. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 2.7 శాతం నుంచి 3.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.87% నుంచి 1.28 శాతానికి పెరిగాయి. కాగా.. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 962 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ. 935 కోట్లకు పరిమితమయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్‌ఎస్‌ఈలో 1% లాభంతో రూ. 1,740 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment