
యాక్సిస్ బ్యాంక్ బేస్‌రేటు తగ్గింపు
ముంబై : ప్రైవేటు రంగంలో మూడవ అతిపెద్ద యాక్సిస్ బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్‌రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.85 శాతానికి తగ్గింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). పైవేటు రంగంలో అగ్రస్థాయిలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ రేటు తగ్గింపు మరుసటిరోజే యాక్సిస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యాక్సిస్ బ్యాంక్ నిర్ణయం జూన్ 30 నుంచీ అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో-ప్రస్తుతం 7.25 శాతం) 75 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే- ఈ ప్రయోజనంలో 0.30 శాతాన్ని యాక్సిస్ కస్టమర్లకు బదలాయించినట్లయ్యింది. అయితే ఇప్పటికీ యాక్సిస్ బ్యాంక్ బేస్ రేటు.. ఐసీఐసీఐ బ్యాంక్ బేస్ రేటు (9.7 శాతం) కన్నా అధికం కావడం గమనార్హం