సాక్షి, అమరావతి: వైట్ కాలర్ జాబ్స్ (నైపుణ్య ఉద్యోగాలు) అంటే ఎంతో క్రేజ్. కానీ.. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్ తదనంతర పరిణామాలు దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాలకే ఎక్కువగా కోత పెట్టాయి. దేశంలో ఏకంగా 66.60 లక్షల ఉద్యోగాల్లో కోత పడ్డాయని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. కోత పడిన ఉద్యోగుల్లో పారిశ్రామిక రంగంలోని కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.
నివేదికలోని ప్రధానాంశాలివీ
► దేశంలో మే నుంచి ఆగస్టు వరకు 66.60 లక్షల మంది వైట్ కాలర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
► 2019 మే– ఆగస్టు మధ్య దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో 1.88 కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగులుండేవారు. కాగా 2020 మే–ఆగస్టు మధ్య 1.22 కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగులు మాత్రమే మిగిలారు.
► ఈ రంగంలో 2020 మే–ఆగస్టులో దాదాపు 66.60 లక్షల ఉద్యోగాలకు కోత పడింది.
► దేశంలో జాబ్స్ కోల్పోయిన వైట్ కాలర్ ఉద్యోగుల్లో ఇంజనీర్లు, ఫిజీషియన్లు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, అనలిస్టులు మొదలైనవారు ఎక్కువగా ఉన్నారు.
► ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య పారిశ్రామిక రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ రంగం 26 శాతం ఉద్యోగాల కోతతో రెండో స్థానంలో నిలిచింది.
► కార్పొరేట్ సంస్థల కంటే చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల్లోనే ఎక్కువ ఉద్యోగాలు కోతపడ్డాయి.
► పారిశ్రామిక రంగంలో క్లరికల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండటం గమనార్హం. ఇతరులతో పోలిస్తే బీపీవోలు, కియోస్క్‌లలో ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి వారికి ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంది. వారికి ‘వర్క్ ఫ్రం హోమ్’కు అవకాశం ఉండటమే దీనికి కారణం.
అన్‌లాక్‌తో ఊరట
► దేశంలో దశల వారీగా లాక్‌డౌన్ తొలగించటంతో ప్రస్తుత పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని సీఎంఐఈ నివేదిక పేర్కొంది.
► దేశంలో 1.21 కోట్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు కోత పడొచ్చని ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎంఐఈ అంచనా వేసింది.
► కానీ.. దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆగస్టు నుంచి ఆర్థిక రథచక్రం తిరిగి జోరందుకుంది.
► దాంతో ఉద్యోగాల కోతకు తెరపడిందని సీఎంఐఈ వెల్లడించింది.
వైట్‌కాలర్ ఉద్యోగాలు హుష్
Published Sat, Sep 19 2020 4:33 AM | Last Updated on Sat, Sep 19 2020 4:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment