
తొలి జీతం నుంచే అడుగులు..
తొలిసారిగా ఉద్యోగం సంపాదించడంతోనే ఆర్థిక బాధ్యతలు కూడా మొదలవుతాయి. తొలి జీతం అందుకున్నప్పటి నుంచే ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెంచుకుంటే ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలం.
తొలిసారిగా ఉద్యోగం సంపాదించడంతోనే ఆర్థిక బాధ్యతలు కూడా మొదలవుతాయి. తొలి జీతం అందుకున్నప్పటి నుంచే ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెంచుకుంటే ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలం. అందుకే ఆర్థిక ప్రణాళికకు సంబంధించి పాటించాల్సిన కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
వ్యయాలు-స్వయం నియంత్రణ
ఆర్థిక ప్రణాళిక నిర్వహణ బాగుండాలంటే మొదట చేయాల్సింది... వ్యయాలపై స్వయం నియంత్రణ. ఏ వస్తువు కొనే ముందైనా ఒకటికి రెండు సార్లు ఆ వస్తువు అవసరం తనకు ఎంతుందో ఆలోచించాలి. సంబంధిత వస్తువు కొనుగోలు తన ఆర్థిక పరిస్థితిపై ఎట్టి పరిస్థితిలోనూ భారాన్ని పెంచకూడదు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ విషయాన్ని ప్రస్తావించుకోవాలి. దీని వినియోగం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ ఆఫర్లను బట్టి కొనుగోళ్లు ఉండకూడదు. తన వాస్తవ అవసరాలు ఏమిటన్నవే ఇక్కడ ముఖ్యం కావాలి.
లక్ష్యాలు అవసరం
ద్రవ్య సంపాదన, వ్యయాల లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం చాలా అవసరం. దీనివల్ల ఆర్థిక ప్రణాళిక, నిర్వహణలో దాదాపు సగం విజయం సాధించినట్లే. ఇక లక్ష్యాలను ‘స్వల్ప-మధ్య-దీర్ఘ’ కాలికంగా విభజించుకోవాలి. అటు తర్వాత అమలుకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళితే ప్రయోజనాలు అపరిమితం. నెలవారీగా కొద్ది వందల రూపాయల మొదలుకొని దీర్ఘకాలంలో వివాహం, పిల్లలు, ఆయా ఆర్థిక అవసరాలు, కారు, ఇళ్లు వంటివి కొనుగోలు వరకూ ప్రణాళికలు అవసరం. దీనితో కాలానుగుణంగా పొదుపులు- వ్యయాల పట్ల అనుభవం పెరుగుతూ ఉంటుంది.
బడ్జెట్ రూపకల్పన
సంపాదన, వ్యయ నిర్వహణ విషయంలో ‘బడ్జెట్’ చాలా ముఖ్యం. లక్ష్యాలను సాధించడంలో ప్రతిపైసా వ్యయం బడ్జెట్‌కు అనుగుణంగా సాగాలి. ఇలాంటి అభ్యాసం వల్ల మీరు కాలక్రమేణా ఆర్థిక పటిష్టత సాధించగలుగుతూ, లక్ష్యం వైపు విజయవంతమైన అడుగులు వేయగలుగుతారు. అనవసర వ్యయాలను విజయవంతంగా కట్టడి చేయగలుగుతారు. పొదుపులను, వ్యయాలను సైతం స్వల్పకాలిక-మధ్యకాలిక-దీర్ఘకాలిక విభాగాలుగా విభజించుకుని ప్రణాళికలు రూపొందించుకోవడం ప్రయోజనకరం.
అత్యవసర పరిస్థితులు
ప్రైవేటు రంగం వేళ్లూనుకుంటున్న కొలదీ ‘ఉద్యోగ భద్రత’ అనే పదానికి తావులేకుండా పోయింది. పైగా కెరియర్ దృష్టిలో పెట్టుకొని కొన్ని రంగాల్లోని యువత తరచూ ఉద్యోగాలు మారుతుండడం కూడా సహజమయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర వినియోగం కోసం కొంత మొత్తాలను సైతం ప్రత్యేకంగా పొదుపుచేయడం మంచిది. దీనివల్ల ఆర్థిక సమస్యలను విజయవంతంగా అధిగమించడమే కాకుండా, నిద్రలేని రాత్రులను దూరం చేసుకోగలుగుతారు. స్వల్పకాలిక అత్యవసర నిధి ఏర్పాటు ప్రయోజనం అపారం.
రిటైర్మెంట్ యోచన
కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. యువతగా ఉన్నప్పుడే పదవీ విరమణ తరువాత జీవనం సాగే మార్గాలను అన్వేషించడం అత్యుత్తమం. పొదుపు, ద్రవ్యోల్బణం అన్ని అంశాలకూ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు, ఉద్యోగం చేస్తున్న యాజమాన్యం కల్పిస్తున్న ప్రయోజనాలతో పాటు మీకు మీరుగా సైతం ఆయా అంశాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. రిటైర్‌మెంట్‌కు వార్షికంగా స్వల్ప మొత్తం పొదుపు చేసుకుంటూ పోయినా, చక్రగతిన 10 శాతం వడ్డీతో అది పదేళ్ల తరువాత రెట్టింపు అవుతుంది.
పన్నుల గురించి
ఆర్థిక ప్రణాళికలో పన్నులు ఒక అంతర్గత భాగం. పన్నుల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా మన పొదుపులను, ఆర్థిక ప్రణాళికను పరిపుష్టం చేయ గలిగే రీతిలో ఈ అంశంపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇల్లు కొనుగోలు... వివిధ ఆర్థిక పథకాల్లో మదుపులు ఆయా అంశాల ద్వారా పన్నుల ప్రయోజనాలు వంటి అంశాలపై చైతన్యం అవసరం. ఈ విషయంలో ఒకరి స్వవిషయాలను మరొకరికి జతకలపలేం. అయితే పన్నులు, బీమా అవసరాలు వంటి వాటిని ఒకే గాటన కట్టి చూడడం మంచిదికాదు.
బీమా ధీమా...
ప్రతి వ్యక్తి ఆర్థిక గమనంలో కీలకమైనది బీమా. ఒక పక్క వ్యక్తి పరంగానూ, మరోపక్క కుటుంబపరంగానూ బీమా ధీమాను కల్పిస్తుంది. ప్రతి వ్యక్తీ తన అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా సాధారణ, జీవిత బీమాను కలిగి ఉండడం జీవన క్రమంలో ధీమాను కల్పిస్తుంది. జీవన గమనంలో దురదృష్టవశాత్తు ఎదురయ్యే ప్రతి సమస్యనూ ఎదుర్కొనేలా బీమా ప్రణాళికలు ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఉన్నా.. పాలసీలు గడువుకు ముందే మురిగిపోకుండా ప్రీమియంలు సకాలంలో చెల్లించేటట్లు చూసుకోవాలి.
ఒకే చోట మదుపు వద్దు
మీరు మదుపు చేసే డబ్బు ఒకేచోట పెట్టడం మంచిదికాదు. కొంతమొత్తం బంగారం, కొంతమొత్తం రియల్టీ, మరికొంత ప్రభుత్వ పథకాలు, డిపాజిట్లు. ఇలా విభిన్న పోర్బ్‌ఫోలియోల్లో మీ డబ్బును మదుపు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. ఆయా మార్కెట్లలో తలెత్తే ఇబ్బందులు, సమస్యల నుంచి మీరు మదుపుచేసే మొత్తాలకు దీనివల్ల తగిన భద్రత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే- కాలక్షేపం చిరు, చెత్త తిండ్లు మానే యడం... ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ పేర్లతో కొన్ని వెరైటీల దుస్తులు, పరికరాలు, వస్తువులపై వ్యయాలన్నింటికీ వీలైతే చెక్ చెప్పడం మంచిది. తలచుకుంటే మీరు ఇవన్నీ చేయగలరు.