మీరేంటో చెప్పే మీ బడ్జెట్.. | Your budget is what you have to say .. | Sakshi
Sakshi News home page

మీరేంటో చెప్పే మీ బడ్జెట్..

Published Fri, Jul 25 2014 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

మీరేంటో చెప్పే మీ బడ్జెట్..

మీరేంటో చెప్పే మీ బడ్జెట్..

ఇంటిని చూసి ఇల్లాలి గురించి, మన ఫ్రెండ్స్‌ను చూసి మన గురించి చెప్పేయొచ్చంటారు. అలాగే, డబ్బుకు సంబంధించి మన వైఖరి గురించి చెప్పేది కూడా ఒకటుంది. అదే .. బడ్జెట్‌పై మన అవగాహన. బడ్జెట్ విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క స్టయిల్ ఉంటుంది. కొందరు నిక్కచ్చిగా పాటించేవారు.. కొందరు అసలు బడ్జెటింగ్ అన్నదే పాటించనివారు.. ఇలా వివిధ రకాలుగా ఉంటారు. ఇలా రకరకాల బడ్జెట్ వైఖరుల గురించి వివరించేదే ఈ కథనం.
 
 పైసా పైసా లెక్క పెడతారు..

ఈ కోవకు చెందిన వారు ప్రతిరోజూ బడ్జెట్‌ను చూసుకుంటూ ఉంటారు. పరిమితులు విధించుకోవడంలోనూ.. ఒక్కో దానిపై ఎంతెంత ఖర్చు చేస్తున్నాం, ఎంత ఆదా చేస్తున్నాం లాంటి విషయాల్లోనూ పక్కాగా వ్యవహరిస్తుంటారు. అనుకోకుండా ఏవైనా ఖర్చులు ఒక్కసారిగా మీద పడినా.. తగిన విధంగా సర్దుబాట్లు చేసుకోగలరు. నెలవారీ బడ్జెట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ మించకుండా చూసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు బడ్జెట్ సూపర్‌స్టార్లు. నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించే సత్తా ఉన్నవారు.  ఈ తరహా బడ్జెట్ వైఖరి ఉన్న వాడి జీవితంలో మిగతా అంశాల్లో కూడా క్రమశిక్షణతో ఉంటారన్నది తెలియజేస్తుంది. అయితే, బడ్జెట్‌పై మరీ ఎక్కువగా ఆలోచించి .. ఆలోచించి బుర్ర పాడుచేసుకోకుండా కాస్త పట్టు విడుపులు ఉండాలన్నది వీరు గ్రహించాలి. అప్పుడు.. ఆడుతూ, పాడుతూ లక్ష్యాలను సాధించవచ్చు.
 
 బడ్జెట్టా? అంటే ఏంటి?

 ఈ కేటగిరీకి చెందిన వారైతే .. బడ్జెట్ గురించి లెక్కలేసుకోవడం గురించి కనీసం ఆలోచన కూడా చేయరని అర్థం. ఏ నెలకానెల వచ్చిన జీతాన్ని... బిల్లులు, బకాయిలు కట్టేయడం. మళ్లీ అవసరం పడితే అప్పో సప్పో చేయడం.. క్రెడిట్ కార్డు పరిమితి కూడా దాటేసి .. చివరికి మళ్లీ జీతం వచ్చే దాకా ఎదురుచూడటం.. ఇలా ఈ రోజు గడిచింది చాల్లే అనుకునే టైపు వారు. కెరియర్‌పరంగా గానీ మరో విషయంలో గానీ పెద్దగా ప్రణాళికలు వీరికి ఉండకపోవచ్చు. జీవితం ఎటు తీసుకెడితే అటు వెళ్ళడానికి ప్రాధాన్యమిస్తారు. పోనీ ఏకాగ్రత ఉన్నా.. అది ఏదో ఒకదానిపైనే (మంచో, చెడో) ఉండటం వల్ల మిగతావాటిని కోల్పోతుంటారు. ఏదైతేనేం.. ఇలా డబ్బు విషయంలో క్రమశిక్షణ లేకపోతే.. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం ఏమాత్రం సాధ్యపడదు. కాబట్టి .. పైన పేర్కొన్న కారణాలన్నీ చూసిన తర్వాతైనా.. ఈ కోవకి చెందినవారు  తక్షణమే ఒక బడ్జెట్ అంటూ రూపొందించుకుంటే.. బోలెడన్ని ఆర్థిక సమస్యలను క్రమక్రమంగానైనా తగ్గించుకోవచ్చు. తద్వారా క్రెడిట్ కార్డులపై ఆధారపడకుండా ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవచ్చు.
 
 ఏదో రకంగా చేసేయొచ్చు ..

 డబ్బు గురించి మరీ గీచి గీచి చూసుకుంటే.. పనులు జరగవని, చివరికి రూపాయి పెట్టాల్సిన చోట రెండు రూపాయలు పెట్టాల్సి రావొచ్చన్నది ఇలాంటి వారి ఆలోచన విధానంగా ఉంటుంది.  అయితే, ప్రత్యేకంగా ఒక బడ్జెట్ అంటూ రూపొందించుకోకపోయినా.. ఇలాంటివారు ఖర్చులను ఎంతో కొంత పరిమితం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించినన్ని రోజులు ఏదో రకంగా మేనేజ్ చేసేయొచ్చని భావిస్తారు. ఏదో ఒక దాని ఖర్చులు తగ్గుతాయి.. అలా మిగిలే డబ్బును దాచడం మొదలుపెడితే లక్ష్యాలను తొందరగా సాధించేయొచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ, ఇదే ఫార్ములా పాటిస్తే.. లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్లడం కష్టమే.  ఎందుకంటే, ఈ తరహా ఆలోచనా విధానం ఉన్న వాళ్లకు స్పష్టమైన ప్లాన్ అంటూ ఉండదు. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు కానీ.. దానికంటూ పక్కా ప్రణాళిక ఉండదు. కనుక ఈ కోవకి చెందినవారు లక్ష్యాలు పెట్టుకోవడంతో పాటు వాటికంటూ ప్లానింగ్ కూడా వేసుకోవాలి. కచ్చితంగా పాటించాలి.
 
 రాసుకుంటాను..కానీ ..

 ఇలాంటి వారు మంచి ఉద్దేశంతోనే శ్రీకారం చుడతారు. ప్రతి నెలా బడ్జెట్ రాసుకుంటారు. ఖర్చులను ఎంతకు పరిమితం చేసుకోవాలి.. ఎంత పొదుపు చేయాలి వగైరాలన్నీ కూడా లెక్కలేసుకుంటారు. కానీ.. వాటిని అమల్లో పెట్టాల్సి వచ్చేసరికి మాత్రం కట్టుతప్పుతుంటారు. కంటికి నదురుగా కనిపించినవి ఎడాపెడా కొనేస్తారు.  ఎంత ఖర్చు చే ద్దామనుకున్నాం.. ఎంత చేస్తున్నాం అన్నది లెక్కేసుకోలేక కష్టపడుతుంటారు. మధ్యమధ్యలో బడ్జెట్ గుర్తొచ్చి తెగ బాధపడిపోతుంటారు. ఈ తరహాకి చెందినవారు.. లక్ష్యాలను నిర్దేశించుకోవడాన్ని, వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవడాన్ని ఇష్టపడతారు. ఇదంతా బాగానే ఉన్నా, బడ్జెట్ వేసుకోగానే దానిపై ఉత్సాహం పోతుంది. మళ్లీ పాత పద్ధతులకే మళ్లుతుంటారు. అయితే, అసలు బడ్జెట్ ఆలోచనే లేకపోవడం కన్నా ఏదో ఒకటి ప్లాన్ ఉండటం మంచిదే. ఒక ప్రక్రియంటూ ప్రారంభించడమూ హర్షించతగినదే. అయితే, పాటించడంలో కష్టాలను అధిగమించాలంటే.. వేసుకున్న ప్రణాళికను పక్కాగా అమలు చేయగలిగే మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నించాలి.
 
 బడ్జెట్ రాద్దామనుకుంటాను.. కానీ..

 మీరు ఈ కోవకి చెందినవారైతే .. బడ్జెట్ ప్రాధాన్యం గురించి మీకు తెలుసు. అది మీ లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతుందన్నదీ తెలుసు. కానీ, అమలు చేసేందుకు కావాల్సిన ఉత్సాహం కొరవడి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టినా.. మళ్లీ మధ్యలో వదిలేస్తుంటారు. బడ్జెటింగ్ అంటే ఒక బ్రహ్మపదార్థంలా, గందరగోళపర్చేదిగా, ఏం చేసినా వర్కవుట్ కానిదిగా అనిపిస్తుంటుంది. మీరు ఈ కేటగిరీకి చెందిన వారైతే.. లక్ష్యాలను సాధించలేకపోవడానికి ఏదో ఒక సాకును వెతుక్కుంటున్నారన్న మాట. ఇది గుర్తించగలిగితే.. తక్షణం దిద్దుబాటు చర్యలు ప్రారంభించండి. అవసరమైతే స్నేహితుల సహాయమో లేదా ఆర్థిక నిపుణుల సలహాలో తీసుకోండి. భయాలను విడిచిపెట్టి, భవిష్యత్తుపై పట్టు సాధించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement