బడ్జెట్‌కి కట్టుబడి ఉండేదిలా..
ప్రతి నెలా బడ్జెట్ వేసుకుని దాన్ని దాటకుండా జాగ్రత్తపడటమనేది చాలా కష్టమైన పనే. కొత్తగా బడ్జెటింగ్ మొదలుపెట్టిన వారికి ఇది మరింత కష్టం. అయితే, దీన్ని అలవర్చుకునేందుకు, సమస్యలు అధిగమించేందుకు కూడా కొన్ని టిప్స్ సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ట్రై చేసి చూడండి..
క్రెడిట్ కార్డుపై రాసుకోండి..
షాపింగ్‌కి వెళ్లిన ప్రతిసారీ టకటకా అవసరమైనవి, అనవసరమైనవి కొనేయకుండా ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ఇది అవసరమా అని చిన్న చీటీని రాసి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుపై అతికించి ఉంచండి. ఏదైనా కొని బిల్లు కట్టేం దుకు లైన్లో నుంచున్నప్పుడు ఒక్కసారి కార్డుపై అతికించిన నోట్‌ను చూస్తే.. ఒక్క నిమిషం పాటైనా ఆలోచించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త కారు, విదేశీ టూరు లాంటి లక్ష్యాలేమైనా ఉంటే వాటి ఫొటోలను కూడా అతికిస్తే ఉపయోగపడొచ్చు. అనవసర వ్యయాలు చేసేటప్పుడు మన లక్ష్యాలు గుర్తొచ్చి కాస్త వెనక్కి తగ్గేందుకు సాధ్యపడుతుంది. ఏదైనా సరే.. రూపాయి ఖర్చు చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నదే థియరీ.
పర్సులో పెళపెళలాడే నోట్లు..
డబ్బు పొదుపు చేయాలంటే.. పర్సులో ఫెళఫెళలాడే నోట్లు ఉండేలా చూసుకోవడం కూడా ఒక సూత్రం. నోటు విలువ ఎంత ఎక్కువైతే అంత మంచిది. దీని వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. సాధారణంగా ముడతలు పడి, నలిగిపోయిన నోట్లను సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవాలనిపిస్తుంది. అదే నోటు కొత్తగా ఉంటే దాన్ని అంత త్వరగా ఖర్చు చేయడానికి మనసు అంగీకరించదు. అలాగే, పది, ఇరవై నోట్లను ఖర్చు చేసినంతగా అయిదొందలు, వెయ్యి రూపాయలను ఖర్చు చేయబుద్ధి కాదు. కొనుగోలుదారులపై ఒక సంస్థ చేసిన సర్వేలో ఇలాంటి విషయాలు వెల్లడయ్యాయి.
పర్సులో కార్డులను తగ్గించండి..
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు పొలోమంటూ ఉన్నాయి కదాని.. పర్సు నిండుగా ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లిపోకూడదు. అలాగని, అస్సలు ఒక్క కార్డూ లేకుండా వెళ్లకూడదని కూడా కాదు. జేబులో కార్డు ఉంది కదాని కనిపించినదల్లా కొనేయడం కాకుండా.. ఏదైనా కొనాలనుకున్నప్పుడు కొంత ముందు నుంచి ప్రణాళిక వేసుకోవడం, బడ్జెట్‌కి కట్టుబడి ఉండటం వంటి అలవాట్లు దీని వల్ల అలవర్చుకోవచ్చన్నది ఈ సూచన అంతరార్థం.
చిల్లరను దాచండి..
ఏదైనా కొన్నప్పుడు రూపాయో, అయిదు రూపాయలో, పది రూపాయలో ఎంతో కొంత చిల్లర వస్తూనే ఉంటుంది. ఏదో ఒక డినామినేషన్‌ని ఎంచుకుని ఇలా వచ్చిన చేంజ్‌ని పక్కన పెట్టి ఉంచండి. పిల్లల పిగ్గీ బ్యాంక్ తరహా ప్రయోగమే అయినా నెల తిరిగేసరికల్లా మనకు తెలియకుం డానే బోలెడంత పోగుపడుతుంది. ఇలా వచ్చిన మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్లో జమ చేయండి.
యాప్స్..
ఎంత ఆదాయం వస్తోంది.. ఎంత ఖర్చు చేస్తున్నాం అన్నది లెక్కలు వేసుకోకపోతే ఆర్థిక పరిస్థితులు తల్లకిందులవుతాయి. నెలనెలా బిల్లులు, రసీదులు వగైరా లాంటి వాటితో గందరగోళం తలెత్తకుండా.. స్మార్ట్‌ఫోన్లలో యాప్స్ (అప్లికేషన్స్) వచ్చాయి. బిల్లులు, రసీదులను స్కాన్ చేసి పెట్టుకోవడం నుంచి ఎంతెంత ఖర్చు చేస్తున్నాం దాకా అన్ని వివరాలు ఇందులో ఫీడ్ చేసి పెట్టుకోవచ్చు. ఏ నెలకానెల రిపోర్టులు కూడా తీసుకోవచ్చు.