అధిక వృద్ధే లక్ష్యంగా బడ్జెట్..
కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి జీఎస్ సంధూ
ముంబై: ఎకానమీని మళ్లీ అధిక వృద్ధి బాట పట్టించడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి జీఎస్ సంధూ తెలిపారు. జూలై 10న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అధిక వృద్ధే ప్రధానాంశంగా ఉండగలదని ఆయన శనివారం జరిగిన ఒక బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు చెప్పారు. ప్రస్తుతం ఏం చర్యలు తీసుకోవచ్చు, తదుపరి ఏం చర్యలు చేపట్టవచ్చు అన్నదానిపై అవగాహన కోసం వివిధ రంగాల వారితో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
వృద్ధికి దోహదపడేలా ఉద్దీపన చర్యలేమైనా ప్రకటించే అవకాశం ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. కొంత మేర సడలింపులతో పాటు కొంత కఠిన చర్యలు కూడా ఉండవచ్చని తెలిపారు. విధానపరమైన జడత్వం, అటవీ శాఖ అనుమతులివ్వకపోవడం తదితర సమస్యల కారణంగా అనేక భారీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కేవలం కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు లభించినా, ముందుకు సాగలేదు.
వజ్రాభరణాల ఎగుమతులకు బీమా కల్పించాలి: జీజేఈపీసీ
ఎగుమతి రుణ హామీ సంస్థ (ఈసీజీసీ) వద్ద నిధులు అరకొరగా ఉన్నందున రత్నాలు, ఆభరణాలకు ప్రత్యామ్నాయ బీమా కవరేజీ కల్పించాలని జెమ్స్, జువెలరీ ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈసీజీసీ మూలధనాన్ని పెంచడం గానీ, దేశీయ బీమా కంపెనీలు ఈ రంగాన్ని కవర్ చేసేవిధంగా గానీ చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా శనివారం తెలిపారు.
ఎస్‌ఎల్‌ఆర్‌గా పసిడి డిపాజిట్లు
ముంబై: నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) కింద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల పరిధిలోకి బంగారం డిపాజిట్లను కూడా చేర్చాలని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. తాము పసిడి డిపాజిట్లను స్వీకరిస్తున్నప్పటికీ.. తమకు రాబడులు అందించే సాధనాల్లో వాటిని పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం సాధ్యపడటం లేదని వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమకు పెద్దగా ఉపయోగం లేని సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్ నిబంధనలు పాటించడం కోసం పూర్తిగా నగదుకు బదులుగా కొంత మేర పసిడి డిపాజిట్లనూ ఉపయోగించే అవకాశం కల్పించాలని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎండీ ఎస్‌ఎస్ ముంద్రా అభిప్రాయపడ్డారు.
వజ్రాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వారు ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులు తప్పనిసరిగా తమ డిపాజిట్లలో 4% నిధులను ఆర్‌బీఐ వద్ద ఉంచడంతో పాటు (సీఆర్‌ఆర్) మరో 22.5% పైగా నిధులను ప్రభుత్వ బాండ్లు మొదలైన వాటిలో (ఎస్‌ఎల్‌ఆర్ కింద) ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోంది. అయితే, వీటిపై బ్యాంకులకు పెద్దగా రాబడులు ఉండటం లేదు. సేకరించిన నిధుల్లో దాదాపు మూడో వంతు ఇలా నిరర్ధకంగా ఉండటం వల్ల అధిక రాబడులు అందుకునే అవకాశం కోల్పోతున్నామన్నది బ్యాంకుల వాదన.