Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా! | Follow These During The Festival Will Save Money | Sakshi
Sakshi News home page

Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!

Published Sat, Nov 4 2023 11:43 AM | Last Updated on Sat, Nov 4 2023 12:35 PM

Follow These During The Festival Will Save Money - Sakshi

పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రిటైల్‌ షాపింగ్‌ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్‌ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. 

ఎమోషన్స్‌..
సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి.

బడ్జెట్‌..
చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్‌ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్‌ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్‌లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. 

క్రెడిట్‌ కార్డులు
పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్‌ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్‌ సీజన్‌లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్‌ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్‌ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్‌ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. 

ఇదీ చదవండి: ఆ ఫోన్‌ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్‌

ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. 

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement