ఎయిర్ ఇండియా తిరిగి టాటా చేతికే వచ్చేసింది. స్వాతంత్రానికి పూర్వం ప్రయివేటు రంగంలో మొదలై, తర్వాత ప్రభుత్వ పరమై... భారత దేశ కీర్తి పతాకాన్ని దశాబ్దాల పాటు విశ్వ గగన వీధుల్లో రెపరెపలాడించిన ఓ విమానయాన సంస్థ తిరిగి అదే సంస్థ చేతికి రావడం భావోద్వేగాలు రేపే ఘట్టం! ‘చరిత్ర పునరావృతమౌతుంది’ అని తరచూ వాడే నానుడి ఇక్కడ నిజమైంది. ‘భూమి గుండ్రంగా ఉండును...’ అనేది సాపేక్షంగా రుజువవుతుందన్నట్టు... కొన్ని పరిణామాలు మొదలైన చోటికే మళ్లీ చేరడాన్ని జనం వింతగా చూస్తారు. కొందరు ఆశ్చర్యపోతారు. మరికొందరు లోతైన భావోద్వేగాలకు లోనవుతారు. భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త, దేశంలో లైసెన్స్ పొందిన తొలి కమర్షియల్ పైలెట్ జహంగీర్ రతన్‌జీ దాదాబాయ్ (జే.ఆర్.డి) టాటా 1932లో స్థాపించిన సంస్థ, 1953లో చట్టం ద్వారా ప్రభుత్వ నిర్వహణలోకి వెళ్లి, 68 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంస్థ చేతుల్లోకి వచ్చింది. ఎయిర్ ఇండియా నూటికి నూరు శాతం కొనుగోలుకై వచ్చిన తాజా బిడ్లలో టాటాయే అర్హమైనట్టు, చివరకు అదే ఎంపికయినట్టు కేంద్రంలోని ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం)’ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే శుక్రవారం అధికారికంగా ప్రకటించడంతో దేశమంతా ఓ ఆహ్లాదపు వార్త విన్న అనుభూతి పొందింది. ఎందుకంటే, టాటా గ్రూప్‌కు, దాని యాజమాన్యానికి ఉన్న పేరు అటువంటిది. జాతీయతా భావాలు కలిగిన నిబద్ద కార్పొరేట్ సంస్థగా వారికున్న పేరు దేశంలో మరే సంస్థకూ లేదంటే అతిశయోక్తి కాదు! ‘టాటా గ్రూప్‌కు ఇస్తే మంచిది. ఎయిర్ ఇండియాను స్వీకరించి, సమర్థంగా నిర్వహించడానికి అంతకు మించిన కార్పొరేట్ ఏదీ ఇవాళ దేశంలో లేదు’ అని ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అçహ్లువాలియా రెండు రోజుల కింద చేసిన ట్వీట్ సగటు భారతీయుల భావాల ప్రతీక! చివరకు అదే జరిగింది. ‘...జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే విమానయాన సంస్థను పొంది, నిర్వహించే అవకాశం, గ్రూప్‌కు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తాం. ఓ ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్ది ప్రతి భారతీయుడూ గర్వించేలా చేస్తాం....’ అన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తక్షణ స్పందన గ్రూప్ సంస్థల సంకల్పాన్ని ప్రతిబింబించేదే!
ఎయిర్ ఇండియాను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చేసిన తొలి యత్నం కాదిది. 2000– 01లోనే అప్పటి బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వం, నిధుల సమీకరణ కోసం ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సన్నద్దమైంది. అప్పుడూ టాటా గ్రూప్‌తో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రయత్నం చేశాయి. కానీ, ఎందుకో వ్యవహారం కుదరలేదు. 2005 తర్వాత ప్రయివేటు రంగం పోటీని, ప్రభుత్వ రంగంలోని అలసత్వాన్ని ఎయిర్ ఇండియా తట్టుకోలేకపోయింది. తీవ్ర నష్టాలు, తీరని రుణభారంతో అల్లాడుతూ వచ్చింది. ముఖ్యంగా, 2007లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వపు యూపీఏ ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ని విలీనం చేసి, యాౖభై వేలకోట్ల రూపాయల రుణం ఇప్పించడం ద్వారా కొత్త విమానాల్ని కొనుగోలు చేయించింది. మెరుగవక పోగా, పరిస్థితి దిగజారింది. ఒక దశలో ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి వచ్చినపుడు, ఈక్విటీ ఫండ్ రూపంలో కేంద్రం ముఫ్ఫై వేల కోట్ల రూపాయలు ఇప్పించినా కోలుకోలేకపోయింది. ఎయిర్ ఇండియా వాటాలు 76 శాతం, ఎయిర్ ఇండియా–సింగపూర్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ సర్వీసెస్ వాటాలు 50 శాతం విక్రయించాలని 2018లో చేసిన మరో ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక నూరుశాతం విక్రయమే మార్గమని, 2019లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకిలా పరిణమించింది. 63 వేల కోట్ల రూపాయల రుణభారంతో ఉన్న ఎయిర్ ఇండియాను కొనడానికి వచ్చిన బిడ్లలో స్పైస్‌జెట్, టాటా చివరి వరకూ మిగిలి, టాటా సన్స్ అంతిమ విజేత అయింది.
టాటాలకు ఇంతటి శక్తి, కీర్తి ఒక రోజులో వచ్చినవి కాదు. నూరేళ్లకు పైబడ్డ సంకల్ప ఫలం. నిబద్ధత, దేశభక్తి, అంకితభావం కలగలిసిన కృషి ఫలితం. చిన్న గుండుసూది తయారీ నుంచి పెద్ద విమానాలు నడుపడం వరకు దేశాభివృద్ధిలో టాటాల భాగస్వామ్యం అగణితమని చెప్పాలి. నడమంత్రపు సిరితో తూగుతున్న నయా కార్పొరేట్లతో పోలిస్తే టాటాలది ఈ దేశపు మట్టితో, గాలితో, పౌరుల బతుకుతో ముడివడ్డ ప్రగతి! 1991 మార్చి 23న, జేఆర్డీ టాటా, బాంబేహౌజ్‌లోని తన కార్యాలయంలో కూర్చొని ‘నేను రిటైర్ అవాలని, ఆ స్థానంలో నిన్ను ప్రకటించాలని నిర్ణయించాను’ అని వెల్లడించడానికి దశాబ్దం ముందు నుంచే రతన్ టాటా మది నిండా ఆలోచనలున్నాయి. టాటా విస్తరణ బ్లూప్రింట్ అప్పటికే తయారైంది. ఒకవైపు దేశ ఆర్థికస్థితి, మరోవైపు ప్రభుత్వ విధానాల్ని గమనంలోకి తీసుకొని ఆయనీ బ్లూ ప్రింట్ రూపొందించారు. లైసెన్స్‌రాజ్‌లో ఎదురైన చేదు అను భవాలు ఆయనకు తెలుసు. టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి సంస్థల్ని అగ్రస్థానంలో నిలప డానికి ఎన్నెన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు! ఉత్పత్తి, ధరలు, విక్రయాలు, మార్కెటింగ్, ఎగుమతి–దిగుమతులు, విదేశీ మారకం.... ఇలా, అప్పట్లో ప్రతిదీ నియంత్రణే! అన్నీ అధిగమించి, దేశ ప్రయోజనాల విషయంలో అణుమాత్రం రాజీపడకుండా సంప్రదాయ–నెమ్మది పంథా నుంచి టాటా గ్రూప్‌ను ప్రపంచ పోటీ తట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. టాటా అంటే, ఇవాళ విశ్వస నీయత కలిగిన బ్రాండ్! దేశ ప్రగతి సౌధంలో ఒక్కో ఇటుకై నిలిచిన పెద్ద గోడ! ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ అనివార్యమైతే... అందుకు టాటాయే యోగ్యం! దేశానికి అదే ప్రయోజనకరం.
Comments
Please login to add a commentAdd a comment