రాజాపేట : వాతావరణ ఆధారిత పంటల బీమా ఏడాది గడిచినా రైతులకు అందలేదు. మండలంలో 816 మంది రైతులు 1,475 ఎకరాల పత్తిపంటతోపాటు బత్తాయిపై బీమా ప్రీమియం చెల్లించారు. ఇందుకుగాను రూ.9. 75లక్షలను బ్యాంక్ డీడీ రూపంలో యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించారు. వాతావరణ ఆధారిత బీమా కిందఎకరానికి రూ.510 ప్రీమియం చెల్లిస్తే ఇందుకుగాను పంట పూర్తిగా నష్టం వాటిల్లితే ఎకరాకు రూ.10,400 బీమా పరిహారం చెల్లిస్తారు. బత్తాయి పంటకు ఎకరాకు రూ.792 చెల్లిస్తే నష్టపరిహారం కింద రూ.16వేలు చెల్లిస్తారు. గత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు పూర్తిగా పంటనష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటనష్టాన్ని అంచనావేసి నివేదక సమర్పించారు. నేటివరకు బీమా వర్తించలేదు.
ఖరీఫ్ సాగుకు అక్కరొస్తాయనుకుంటే..
బీమా డబ్బులు వస్తే తాము ఈఏడు ఖరీఫ్ సీజన్‌లోనైనా పెట్టుబడి పెట్టుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అధికారులకు బీమా విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం బీమా డబ్బులు చెల్లింపుపై వాయిదాలుచెపుతు దాట వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన పంటల బీమా డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
బీమా డబ్బులు త్వరలో చెల్లిస్తాం : ఏఓ
వాతావరణ ఆధారిత బీమా డబ్బులు రైతులకు త్వరలోనే చెల్లిస్తామని ఏఓ ఏ.స్వాతి తెలిపారు. బీమా చెల్లించేందుకు రాజాపేట మండలాన్ని ప్రకటించారు. పంటల ప్రీమియం చెల్లించిన ప్రతీ రైతుకు బీమాకు సంబంధించిన బాండ్లతోపాటు పరిహారం కూడా అందజేస్తామని పేర్కొన్నారు.
పంటల బీమా అందేనా..?
Published Mon, Jul 6 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement