తెలివిగా వాడితే క్రెడిట్ మీదే..
ఆర్థిక లావాదేవీలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారానే కానిచ్చేస్తున్నారు. సినిమా టికెట్ దగ్గర నుంచి విమానం టికెట్ల వరకు, టెలీఫోన్ బిల్లు దగ్గర నుంచి బీమా ప్రీమియం వరకు, పెన్‌డ్రైవ్ దగ్గర నుంచి ఖరీదైన ఎల్‌ఈడీ టీవీ వరకు ఇలా అన్నీ ఆన్‌లైన్‌లో కొనేస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు, జీరో వడ్డీరేటుకే ఈఎంఐ వంటి ఆఫర్లను ఇబ్బడిముబ్బడిగా ప్రకటిస్తున్నాయి. అందులో ఇది పండుగల సీజన్ కావడంతో ఈ ఆఫర్లు మరింత జోరందుకున్నాయి. ఈ ఆఫర్ల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకోకుండా వినియోగించుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
కార్డు తీసుకునేటప్పుడు
ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వార్షిక ఫీజులు, వడ్డీరేట్లు, గ్రేస్ పిరియడ్, చెల్లింపులు ఆలస్యం అయితే విధించే అపరాధ రుసుము వంటి విషయాలపై పూర్తి స్పష్టత తీసుకోండి. అవసరమైతే ఈ విషయంలో క్రెడిట్ కార్డు సంస్థ నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా వార్షిక ఫీజులు ఎక్కువ ఉన్న కార్డులు దూరంగా ఉండండి. ఇక లావాదేవీల విషయానికి వస్తే సకాలంలో చెల్లించ గలిగితే అన్ని లావాదేవీలకు క్రెడిట్ కార్డును వినియోగించుకోవచ్చు.
దీని వల్ల రివార్డు పాయింట్లతో పాటు ఇటు క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు అన్ని కార్డులు యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై 5-10 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నాయి. ఉదాహరణకు మీరు రూ. 1,000 కరెంట్ బిల్లు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే దానిపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటే రూ. 50 తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఈ విలువకు సమానమైన రివార్డు పాయింట్లు పొందుతారు.
చాలా క్రెడిట్ కార్డులు పూర్తిగా వాడిన మొత్తం కాకుండా మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తాయి. తప్పని పరిస్థితుల్లో తప్ప ఈ అవకాశాన్ని వినియోగించుకోవద్దు. దీనివల్ల వచ్చే నెల చెల్లించే మొత్తం పెరగడమే కాకుండా వడ్డీ భారం పెరుగుతుంది. అంతే కాదు క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది కనిపించిన కార్డుకల్లా దరఖాస్తు చేస్తుంటారు. అనేక కార్డులు కలిగి ఉండటం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువ క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఇన్ని కార్డుల నిర్వహణ అనేది కూడా కష్టమవుతుంది.
చివరగా చెప్పేది ఏమిటంటే అప్పు లభిస్తోంది కదా అని వాడకుండా తిరిగి కట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే క్రెడిట్ కార్డును వినియోగించండి. అప్పుడే పూర్తి ప్రయోజనాలను పొందుతారు.
రివార్డు పాయింట్లు
అన్ని కార్డులు, లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఒకే విధంగా ఉండవు. సాధారణంగా వినియోగించిన ప్రతీ రూ. 100 - 150లకు ఒక రివార్డు పాయింటును ఇస్తుంటాయి. ఇలా కూడబెట్టుకున్న రివార్డు పాయింట్లను ఉపయోగించుకొని కంపెనీ అందించే వివిధ వస్తువులు లేదా సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. 5,000 రివార్డు పాయింట్లు ఉంటే ఆ విలువకు సమానమైన వస్తువు కొనుగోలు చేయలేరు.
రివార్డు పాయింట్ల మొత్తంలో 20 నుంచి 30 శాతానికి విలువైన వస్తువులను కొనగలరు. ఇప్పుడు అన్ని క్రెడిట్‌కార్డు సంస్థలు ఆన్‌లైన్ ద్వారానే ఈ రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీ అందిస్తున్న వస్తువులు సేవల్లో రిడీమ్ పాయింట్లకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. రిడీమ్ పాయింట్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. సాధారణంగా ఈ ఎక్స్‌పైరీ డేట్ ఒకటి నుంచి మూడేళ్లుగా ఉంటుంది. అలాగే ఈ పాయింట్లను రీడీమ్ చేసుకున్నప్పుడు చాలా కంపెనీలు సర్వీస్ చార్జీలను కూడా వసూలు చేస్తున్నాయి.