రుణానికి ముందే ప్రీమియం చెల్లింపు
♦ ఆ విధంగా రైతుల తరఫున బ్యాంకులకు అనుమతివ్వాలి
♦ కేంద్రానికి లేఖ రాయాలని వ్యవసాయ శాఖ నిర్ణయం
♦ రుణానికి, ప్రీమియం చెల్లింపునకు మధ్య గందరగోళం
సాక్షి, హైదరాబాద్: రుణాలు ఇవ్వడానికి ముందే పంటల ప్రీమియాన్ని రైతుల తర ఫున బ్యాంకులు బీమా కంపెనీలకు చెల్లిం చాలని, ఈ విషయమై బ్యాంకులను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. పంట సాగు కాలం, వాటి బీమా ప్రీమియం చెల్లింపు గడువు, బ్యాంకు రుణాల పంపిణీ మధ్య అగాధం నెలకొనడంతో వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, మిర్చి పంటలకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు గడువు తేదీలు లేవని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పత్తికి బీమా ప్రీమియం చెల్లించేందుకు జూన్ 15, మిర్చికి జూలై 9వ తేదీ వరకే గడువుంది. పత్తికి జూలై 31 వరకూ పొడిగించారు.
40 శాతానికి మించని చెల్లింపు..
రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి పంట అత్యధికంగా సాగవుతోంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు సాగైన అన్ని పంటల్లో ఒక్క పత్తే 55.78 శాతం కావడం గమనార్హం. పత్తికి ఆదరణ ఉన్నా, రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు వస్తున్నా గడువు తేదీలు అనుకూలంగా లేకపోవడంతో 101 శాతం పత్తి సాగైనా 40 శాతానికి మించి బీమా ప్రీమియం చెల్లించలేదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు.
దీంతో పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదముందంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయాధికారులు లేవనెత్తారు. ముందే ఏ పంట సాగు చేస్తారో, దానికి బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లింపునకు రైతుల నుంచి లిఖితపూర్వక అంగీకారం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని బ్యాంకు వర్గాలు వ్యవసాయ శాఖకు చెప్పాయి. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటే అమలు చేస్తామని స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాస్తామని పార్థసారథి వివరించారు.
నష్టపోతున్న రైతులు..
ఆయా పంటలకు వాతావరణ పంటల బీమా పథకం కింద రైతులు బీమా ప్రీమియం చెల్లించాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా ప్రీమియం చెల్లింపు గడువు నాటికి పత్తి, మిర్చి పంటల సాగు పూర్తికాదు. పైగా బ్యాంకులు కూడా జూన్, జూలై నెలల్లో పంట రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులంతా ఆగస్టు, సెప్టెంబర్‌లోనే రుణాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అప్పటికే వాతావరణ పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించే గడువు తేదీలు ముగిసిపోతున్నాయి. దీంతో బ్యాంకు రుణం ద్వారా బీమా ప్రీమియం చెల్లించాల్సిన రైతులంతా నష్టపోతున్నారని, ఈ అంశాన్ని లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. బ్యాంకు వర్గాలు కూడా ఇదే విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చాయన్నారు.