- రుణ మాఫీపై ప్రభుత్వం ఎటూ తేల్చని దుస్థితి!
- రుణాల రీషెడ్యూలుపై కూడా సర్కారుది దాటవేతే
- కొత్త రుణాల పంపిణీకి బీమా ప్రీమియంకు లింకు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఖరీఫ్‌లో రైతుకు బీమాపై ధీమా సన్నగిల్లుతోంది. కొత్త రుణాలు పంపిణీ చేస్తే.. అందులోనే బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుంటారన్న రైతన్న ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రుణ మాఫీపై స్పష్టత ఇచ్చేదాకా కొత్త రుణాల పంపిణీ చేసే ప్రసక్తే లేదని బ్యాంకర్లు స్పష్టీకరిస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లాలో ఖరీఫ్‌లో వర్షాధారంగా 1.85 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగుచేస్తారు. వరి, కంది, మిరప వంటి పంటలు మరో 1.50 లక్షల హెక్టార్ల వరకూ సాగుచేస్తారు. వేరుశనగకు వాతావరణ బీమా.. వరి, కంది పంటలకు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. వీటికి ప్రీమియం చెల్లింపు గడువును ఈనెల 31గా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది.
ఈ ఏడాది రూ.2,793 కోట్లను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయించారు. కానీ.. ఇప్పటిదాకా ఒక్క రూపాయిని కూడా కొత్తగా పంట రుణాల రూపంలో ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబు ప్రభుత్వ వైఖరే. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రుణ మాఫీ చేయడం బదులు.. విధి విధానాలను రూపొందించడానికి కమిటీని నియమించారు.
ఆ కమిటీ ఏమైందన్నది చంద్రబాబుకే ఎరుక. ఈలోగా రుణాల రీషెడ్యూలును తెరపైకి తెచ్చారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మాత్రం కరవు ప్రభావిత మండలాల్లో పంట రుణాలను రీషెడ్యూలు చేసేందుకు అంగీకరించింది. 2013-14లో కరవు ప్రభావిత 33 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులు రూ.1,438 కోట్లను పంట రుణాలుగా పొందారు.
అంటే.. ఆర్‌బీఐ జారీచేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం 1.69 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,438 కోట్ల పంట రుణాలు మాత్రమే రీషెడ్యూలు చేస్తారన్న మాట. అదీ కూడా రీషెడ్యూలు చేసిన రుణాలను మూడేళ్లలోగా చెల్లిస్తామన్న షరతుకు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరిస్తేనే..! ఆర్‌బీఐ నిబంధనలకు ప్రభుత్వం అంగీకరిస్తే.. తక్కిన 7.50 లక్షల మంది రైతులు పంట రుణాల రూపంలో తీసుకున్న రూ.9,642.25 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ధన రూపంలో అందిస్తే ఆ రుణాలను మాఫీ చేస్తామని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు.
అటు ఆర్‌బీఐ విధించిన షరతుకుగానీ.. ఇటు బ్యాంకర్ల డిమాండ్‌కుగానీ చంద్రబాబు సర్కారు అంగీకరించడం లేదు. పంట రుణాల మాఫీపై రోజుకో మాట మాట్లాడుతోంది. రుణల మాఫీపై స్పష్టత వస్తేనే కొత్తగా పంట రుణాలు పంపిణీ చేస్తామని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. పంట రుణాలు పంపిణీ చేసే సమయంలోనే వాతావరణ, పంటల బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుని సంబంధిత రైతుల పేర్లపై జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు చెల్లిస్తారు.
కానీ.. ఇప్పుడు కొత్తగా పంట రుణాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు నగదు రూపంలో బీమా ప్రీమియం చెల్లించే పరిస్థితి లేదు. ఇప్పటికే కరవు మేఘం ఉరుముతోంది. అరకొర పదునులో సాగుచేసిన పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పంట నష్టపోతే పరిహారం వస్తుందన్న ధీమా కూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.