మెగాసిటీ కోసం..మరో అడుగు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగరం చుట్టూ పది కి.మీ.ల పరిధిలోని అటవీ భూములను డీ-నోటిఫై చేసి.. సేకరించాలని నిర్ణయిం చింది. అటవీ భూములను గుర్తించి.. డీ-నోటిఫై చేసేందుకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఓ కమిటీని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ప్రైవేటు భూములను సేకరించడం ఆర్థికంగా సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చింది. ఈ నేపథ్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అటవీ భూములను డీ-నోటిఫై చేసి.. వాటిని సేకరించాలని ప్రభుత్వం భావించింది.
ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో అటవీ, రెవెన్యూ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సెప్టెంబర్ 29న సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తిరుపతి చుట్టూ పది కి.మీ.ల పరిధిలోని అటవీ భూములు గుర్తించి.. కనీసం పది వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు.
ఇందుకు జాయింట్ కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా అధ్యక్షులుగా తూర్పు విభాగం డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి మెంబర్ కన్వీనర్‌గా, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డి.సాంబశివరావు, వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటుచేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ తిరుపతి చుట్టూ పది కమీల పరిధిలోని అటవీ భూములను పరిశీలిస్తుంది.
శేషాచలం అడవులను బయోస్పియర్(జీవావరణం)గా కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. బయోస్పియర్ పరిధిలోని భూములను డీ-నోటిఫై చేయడానికి కేంద్ర పర్యావరణశాఖ అనుమతించదు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఇతర అటవీ భూములను డీ-నోటిఫై చేయడానికి మార్గం ఉంటుంది.
కానీ.. డీ-నోటిఫై చేసిన భూమి మేరకు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించాలి. డీ-నోటిఫై చేసిన భూమి పరిధిలో ఉన్న వృక్ష సంపదకు పరిహారాన్ని చెల్లించడంతోపాటు.. అటవీ శాఖకు అప్పగించిన భూమిలో అడవుల పెంపకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది.