సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ మండలం మైలవరం గ్రామం సమీపంలోని అటవీ భూములను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి న్యాయవాది వి.గంగా ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ‘మైలవరం గ్రామంలో సర్వే నంబర్లు 54, 55, 204/1, 205/1లో కొండలతో కూడిన దాదాపు 250 ఎకరాల అటవీ భూమి ఉంది.
జిల్లా కోర్టుల భవన సముదాయంతో పాటు ఇతర నిర్మాణాలకు ఈ భూమిని కేటాయించారు. 25 ఎకరాలను జిల్లా కోర్టుల భవన సముదాయాల నిర్మాణానికి, 20 ఎకరాలను పీజీ కళాశాల భవనాలకు, ఐదెకరాలు టూరిజం కార్పొరేషన్‌కు, 2.30 ఎకరాలు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కేటాయించింది. నిరుపయోగమైన, నీటి సౌకర్యం లేని భూములను మాత్రమే నిర్మాణాలకు కేటాయించాలని 2012లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోకు విరుద్ధంగా వృక్షాలున్న ఈ భూమిని నిర్మాణాలకు కేటాయించారు. ఈ భూ కేటాయింపులను చట్టవిరుద్ధంగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలివ్వండి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment