భూ దాహం
రాష్ట్ర ప్రభుత్వ భూ దాహానికి అంతేలేకుండాపోతోంది. ఎక్కడ భూమి కనిపించినా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది. సీఆర్‌డీఏ ఏర్పాటయ్యాక ఈ ప్రక్రియ వేగవంతమైంది. తాజాగా మైలవరం అటవీ రేంజ్ పరిధిలోని పంజిడి చెరువు ప్రాంతంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములపై కన్నేసింది.
- అటవీ భూములపై ప్రభుత్వ కన్ను
- మైలవరం రేంజ్‌లో పేదల నుంచి స్వాధీనానికి యత్నాలు
- రోడ్డున పడనున్న రెండువేల గిరిజన రైతు కుటుంబాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో మైలవరం అటవీ రేంజ్ పరిధిలోని పంజిడి చెరువు ప్రాంత అడవుల్లో గిరిజనులు, ఎస్సీ, బీసీలు సుమారు రెండు వేలమంది భూములు బాగుచేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. సుమారు 17వేల ఎకరాల భూమి గిరిజనులు, పేదల ఆధీనంలో ఉంది. గతంలో కొందరికి అటవీ అధికారులే భూములను లీజుకు ఇచ్చారు. ఈ లీజు గడువు 2009లో ముగిసింది. ఆ తరువాత లీజును రెన్యువల్ చేయించుకునేందుకు రైతులు ముందుకు రాలేదు.
ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్నందున తమ భూముల్లోకి ఎవరూరారనే ధైర్యంతో ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత గిరిజన కుటుంబాల్లో అలజడి మొదలైంది. వారు సాగుచేసుకుంటున్న అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుండటమే దీనికి కారణం. 15 రోజుల క్రితం సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి పంజిడి చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పేదలు సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు.
బతుకు భయం
గతంలో అటవీ భూములు సీఆర్‌డీఏ పరిధిలో లేవు. ఇటీవల కొన్ని గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకున్నారు. దీనిలోనే మైలవరం అటవీ భూములు కూడా కలిశాయి. ఆ వెంటనే సీఆర్‌డీఏ కొరడా ఝుళిపించింది. రైతులు అటవీ భూములను ఖాళీ చేయాలని ఇటీవల మైలవరం తహశీల్దార్ ఆదేశించారు. దీంతో వారిలో బతుకు భయం మొదలైంది. భూములను వదిలి ఎలా జీవించాలని మదనపడుతున్నారు. తమను వదిలి భూస్వాముల స్వాధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఏలూరుకు చెందిన నాగరాజు ఆధీనంలో 800 ఎకరాల భూమి ఉందని, గతంలో గిరిజనులకు కాస్తో కూస్తో సొమ్ము చెల్లించి అతను ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమకు అండగా నిలబడ్డారని, అటవీశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు ెహ చ్చరికలు జారీ చేస్తూ తమకు భరోసా ఇచ్చారని రైతులు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుంటున్న విషయాన్ని వివరిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారం రోజుల్లో భూములు వదిలి వెళ్లాలంటూ రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారని, పరిహారంపై గ్యారెంటీ ఇవ్వలేనని తహశీల్దార్ పేర్కొంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పేదల భూములే కావాలా?
రాజధాని నిర్మాణానికి పేదలు సాగు చేసుకునే భూములు కావాల్సి వచ్చాయా? మా భూములు లాక్కుంటే మేము ఏం తినాలి? ఎలా బతకాలి? అధికారులు, ప్రజాప్రతినిధులు మా సమస్యను పరిష్కరించాలి.
- మూడుమంతల రాంబాబు,
రైతు, వెదురుబీడెం, మైలవరం మండలం
పారిశ్రామిక వేత్తల కోసం..
పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు పేదల భూములే అవసరమయ్యాయా? ఏళ్ల తరబడి భూములు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము. ఇప్పుడు ఈ విధంగా మా భూములు లాక్కుంటే మేమెలా బతకాలి. ఇది భూస్వాముల రాజ్యంగా ఉంది. పెద్దల కోసం పేదల నోళ్లు కొట్టవద్దు. - మహమ్మద్ జానీ, సీపీఎం నాయకుడు
పెద్దలకు కట్టబెట్టేందుకే..
రాజధాని నిర్మాణం పేరుతో పేదల సాగులోని భూములు తీసుకుని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది భూస్వాముల ప్రభుత్వం. మా ఓట్లతో గెలిచి మమ్మల్నే రోడ్డుకు ఈడుస్తారా? ఇక పోరాటం చేయక తప్పదు.
- జి.చుక్కయ్య, రైతు, వెల్లటూరు