- అటవీ భూములకు కేంద్రం క్లియరెన్స్
- రూ.39.32 కోట్ల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వ జీవో జారీ
- ఎల్‌వోసీ కోసం ఎదురుచూస్తున్న అధికారులు
బి.కొత్తకోట: ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు రెండోదశ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. పనులకు అడ్డుగా నిలిచిన అటవీభూములను ప్రాజెక్టుకు ఇచ్చేందుకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. అయితే అటవీభూములు స్వాధీనం చేసుకోవాలంటే పరిహారం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తర్వాతే అటవీశాఖ నుంచి భూములు ప్రాజెక్టుకు అప్పగిస్తారు.
హంద్రీ-నీవా ప్రాజెక్టు రెండో దశకు సంబంధించి చిత్తూరు జిల్లాలోని 23, 59, 62 ప్యాకేజీల్లో, అనంతపురం జిల్లాలోని 3, 9, 14, 17, 25, 26 ప్యాకేజీల్లో 522 హెక్టార్ల(1,245ఎకరాలు) అటవీ భూమినిసేకరించా ల్సి ఉంది. 2006 నుంచి ప్రాజెక్టు పనులు ప్రా రంభమయ్యాయి. ఈ కాలువలు అటవీ ప్రాంతాల మీదుగా వెళుతున్నాయి. అటవీ భూములకు సంబంధించి క్లియరెన్స్ లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాలంటే కేంద్రపర్యావరణ, అడవులశాఖ అనుమతులు తప్పనిస రి. పనులకోసం ఈ భూములు పొందాలంటే అటవీశాఖ కోల్పోయే భూములకు పరిహార భూములను అప్పగించాలి. ఈ మొత్తం అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమిగా అనంతపురం జిల్లాలోని తలపుల మండలం పెద్దన్నగారిపల్లె గ్రామంలో ప్రభుత్వ భూములను ఇప్పటికే అప్పగించారు.
522 హెక్టార్ల అటవీ భూమికి అదనంగా మరో 10 హెక్టార్లభూమితో కలిపి 532 హెక్టార్ల భూమిని అప్పగించారు. అలాగే పరిహార సొమ్ము చెల్లించేం దుకు ప్రభుత్వం గత నెలాఖరులో జీవో నంబర్ 71 జారీ చేసీంది. అటవీశాఖ పొందిన పరిహారభూముల్లో అడవుల పెంపకం కోసం హెక్టారుకు రూ.8-9 లక్షలు చెల్లించాలి. ఈ సొమ్మును కేంద్రానికి చెల్లించి భూములు స్వాధీనం చేసుకునేందుకు అనుమతి లభించింది. మొత్తం రూ.39.32 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సివుంది.
ఈ నిధులను చెల్లించి భూములను స్వాధీనం చేసుకొని పూర్తిగా నిలిచిపోయిన పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిధుల కొరత లేకపోవడంతో ప్రాజెక్టు అధికారులు చర్యలు పూర్తిచేశారు. అయితే ఈ నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్‌వోసీ జారీ చేయాల్సి ఉంది. దీని కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.