తాగునీరు, చెరువుల అభివృద్ధికి టీటీడీ నిధులు
మఠం భూముల్లో ఆక్రమణలన్నీ తొలగిస్తాం
రెండేళ్లలో బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేస్తాం
రూ.250 కోట్లతో తిరుపతిలో మౌలిక వసతులు కల్పిస్తాం
త్వరలో అసంపూర్తిగా ఉన్న7,500 ఇళ్లను పూర్తి చేస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు
తిరుపతి రూరల్: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు శ్రీవారి నిధులను వినియోగించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాగునీరు, చెరువుల అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని ఈవో, అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. తిరుపతిలో శుక్రవారం ఆయన పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. అవిలాలలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న భవనాలను ఆయన స్వయంగా పరిశీలించారు. కాలనీవాసులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అవిలాల చెరువులో యథేచ్ఛగా ఆక్రమణలు సాగుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అసంపూర్తిగా ఉన్న భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చే యడంతో, పురపాలక శాఖ మంత్రి నారాయణ, అధికారులతో కలిసి ఆయన వాటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన దామినేడు వద్ద బైపాస్ రోడ్డుపైనే విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.25 కోట్లను టీటీడీ ఇవ్వాలని ఈవోను ఆదేశించినట్లు చెప్పారు. తిరుపతితో పాటు, చుట్టునపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేసే బాధ్యతను టీటీడీకి అప్పగించనున్నట్లు వివరించారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, నిత్యం గోవింద నామస్మరణ వినిపించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. రానున్న రెండేళ్లలో బాలాజీ రిజర్వాయర్‌ని పూర్తిచేసి తిరుపతి, తిరుమల వాసుల దాహార్తిని పూర్తిగా తీరుస్తామన్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న పైపులైన్‌ను మరింత బలోపేతం చేసెందుకు తక్షణమే రూ.10 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పనులకు తిరుమల కొండపైన రాయాల్టీ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి అర్బన్ హాసింగ్‌లో అసంపూర్తిగా ఉన్న 7,500 ఇళ్లను పూర్తిచేసి, మౌలిక వసతులు కల్పించే ందుకు రూ.250 కోట్లను విడుదల చేయనున్నట్లు వివరించారు. భద్రత చర్యల్లో భాగంగా నగరంలో రూ.10 కోట్లతో 600 నుంచి 700 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు.
సెంటు భూమి కూడా వదలం
‘‘తిరుపతిలో భూకబ్జాలు పెరుగుతున్నాయి. విలువైన భూముల అన్యాక్రాంతమయ్యాయి. మఠం భూముల్లో ఇష్టారాజ్యంగా అనాధికార భ వ నాలు నిర్మిస్తున్నారు. ఒక్క సెంటు భూమిని కూడా వదలం. అన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవిలాల చెరువు పక్కన హథిరాంజీ మఠం భూముల్లో అనధికారికంగా నిర్మించిన భవనాలను ఆయన దూరంగా ఉండి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, డీఐజీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి అభివృద్ధికి శ్రీవారే దిక్కు
Published Sat, Feb 21 2015 1:29 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement