పరిశ్రమలకు ప్రతిబంధకం
- హీరో, డీఆర్‌డీవో పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు
- మాదనపాళెంలో హీరో పరిశ్రమకు 600 ఎకరాల కేటాయింపు
- ఎకరాకు రూ.ఆరు లక్షల పరిహారమివ్వాలంటున్న రైతులు
- పరిహారం, ఉపాధి కల్పిస్తేనే సహకరిస్తామని గిరిజనుల స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వవైఖరి హీరో మోటార్స్, డీఆర్‌డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిబంధకంగా మారుతోంది. ఎకరాకు రూ.ఆరు లక్షల పరిహారం ఇస్తేనే హీరో మోటార్స్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తామని మాదనపాళెం రైతులు తెగేసి చెబుతున్నారు. పరిహారం, ఉపాధి అందిస్తేనే డీఆర్‌డీవో పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరి స్తామని నిర్వాసితులు స్పష్టీకరిస్తున్నారు.
ఆ మేరకు పరి హారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో నిర్వాసితులు ఉద్యమబాట పట్టారు. సత్యవేడు మండలం మాదనపాళెంలో మోటారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటు చేయడానికి 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్ సంస్థకు కేటాయిస్తూ సెప్టెంబరు 16న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంది.
అయితే కేటాయించిన 600 ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పగించేందుకు మాదనపాళెంకు వెళ్లిన అధికారులను అక్కడి రైతులు అడ్డుకున్నారు. సత్యవేడు మండలంలో శ్రీసిటీ సెజ్ ఏర్పాటైనప్పుడు మాదనపాళెం రైతులకు చెందిన 450 ఎకరాల భూమిని సేకరించారు. అదే గ్రామంలోని 633 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ 2007లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పరిశ్రమలను నెలకొల్పడంలో ఏపీఐఐసీ విఫలమైంది. ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఆ భూమిని హీరో మోటార్స్‌కు కేటాయించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.8 లక్షల మేర పరిహారం ఇస్తేనే పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తామని తెగేసి చెప్పారు. ఎకరాకు రూ.లక్ష మాత్రమే పరిహారం ఇస్తామని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ స్పష్టీకరించారు. రైతులు ఉద్యమబాట పట్టడంతో రూ.1.65 లక్షలకు మించి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇందుకు రైతులు అంగీకరించడం లేదు. ఎకరాకు కనీసం రూ.ఆరు లక్షల పరిహారం ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. మాదనపాళెంలో రైతు కూలీలు తమకూ పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
డీఆర్‌డీవో పరిశ్రమదీ అదే కథ.
ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొండలో సర్వే నెంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నెంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్‌డీవోకు కేటాయిస్తూ ఆగస్టు 13న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 289)ను జారీ చేశారు. ఎకరాకు రూ.1.25 లక్షల చొప్పున డీఆర్డీవోకు ఆ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో రూ.600 కోట్లతో క్షిపణుల తయారీ పరిశ్రమ, రక్షణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సెప్టెంబరు 16న ప్రభుత్వంతో డీఆర్‌డీవో ఎంవోయూ కుదుర్చుకుంది. ఆ పరిశ్రమ ఏర్పాటు చేసే భూమిలో గిరిజనులు నివాసముంటున్నారు. పరిహారంతో పాటు ఉపాధి కల్పిస్తేనే సహకరిస్తామని తెగేసి చెబుతున్నారు.
పరిహారం పెంచాలి
వూదనపాళెంలో హీరో భూవుులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం పెంచాలి. కలెక్టర్ ఎకరాకు రూ.1.65 లక్షలు ఇస్తామన్నారు. మేవుు భూమి సాగుకు రూ.3 లక్షలు ఖర్చు చేశాం. ఎస్‌ఈజెడ్‌కు భూమి ఇచ్చినపుడు వచ్చిన పరిహారమంతా దానికే పెట్టేశాం. ప్రస్తుతం అప్పుల పాలై ఉన్నాం. ప్రభుత్వం కనికరించి రూ.5లక్షలు పైగా ఇస్తే రైతుకు మేలు జరుగుతుంది.
-ఎస్.జగదీశ్వరయ్య, మాదనపాళెం
రైతు కూలీలకూ పరిహారమివ్వాలి
వూదనపాళెంలో సెంటు భూమి లేకుండా రైతు కూలీలుగా ఉన్న పేద కుటుంబాలకూ పరిహారమివ్వాలి. రెండు రోజుల క్రితం కలెక్టర్‌ను కలిశాం. పేద రైతులను ఆదుకోవాలని కోరాం. న్యాయుం చేస్తామన్నారు. ఎంత ఇస్తారో చెప్పలేదు. కనీసం రూ. 2లక్షలు ఇస్తే మేలు.
-ఆదెవ్ము, వూదనపాళెం