Hero Motors
-
ద్విచక్ర వాహన అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఒక్క టీవీఎస్ మోటార్ విక్రయాలు మాత్రం స్వల్పంగా క్షీణతను చవిచూశాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ 5.0 ప్రారంభం కావడం, కోవిడ్ వ్యాప్తి భయాలతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం తదితర కారణాలు అమ్మకాలను పుంజుకునేలా చేశాయి. ఈ సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల మొత్తం విక్రయాలు 17,33,777 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 15,43, 353 యూనిట్లతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. ఇదే ఏడాది ఆగస్ట్ నెల విక్రయాల(14,41041)తో పోలిస్తే 20 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అవుట్‌లుక్: కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత స్తబ్ధుగా ఉంది. పండుగ సీజన్ సందర్భంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంతంలోని విక్రయాల లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. -
స్పీడ్ పెరిగిన... హీరో మోటార్స్
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 925 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. జాతీయ విపత్తు సహాయక నిధి కోసం గతంలో కేటాయించిన రూ. 737 కోట్లు రీఫండ్ కావడం.. తాజాగా లాభాల వృద్ధికి కారణమైందని సంస్థ వెల్లడించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ ఆదాయం రూ. 8,913 కోట్ల నుంచి రూ. 8,186 కోట్లకు తగ్గింది. హరిద్వార్‌లోని ప్లాంటుపై సెస్సుకు సంబంధించి జాతీయ విపత్తు సహాయక నిధికి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలన్న ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని, దీంతో రీఫండ్‌గా వస్తున్న ఆ మొత్తాన్ని ఆర్థిక ఫలితాల్లో ప్రత్యేక అంశంగా పేర్కొనడం జరిగిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో హీరో మోటోకార్ప్ షేరు 6 శాతం క్షీణించి రూ. 2,259.35 వద్ద ముగిసింది. -
నేడు హీరో మోటార్స్‌కు భూమిపూజ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సత్యవేడు మండలం మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో హీరో మోటార్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమి పూజ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంట లకు హీరో మోటార్స్ కంపెనీ ప్రతిపాదిత ప్రాంతానికి చేరుకునే సీఎం అరగంట భూమిపూజలో పాల్గొంటారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కొద్దిసేపు మాట్లాడతారు. తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరతారని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం మధ్యాహ్నం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హీరో మోటార్స్ కంపెనీ వివరాలను వెల్లడించారు. ఈ మధ్యనే శ్రీసిటీ ప్రాంతంలో అపోలో టైర్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు హీరో మోటార్స్ వస్తోందని, చిత్తూరు, నెల్లూరుతో పాటు రాయలసీమలోని జిల్లాలన్నీ హీరో మోటార్స్ వల్ల లాభపడతాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఆటోమొబైల్ హబ్‌లా మారుతుందని తెలిపారు. త్వరలో తిరుపతి దగ్గరలో రిలయన్స్ జియో ఫోన్ల తయారీ యూనిట్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని, ఇందుకోసం 150 ఎకరాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. టూ వీలర్స్,వాటి విడి భాగాల తయారీ.. సత్యవేడు మండలం మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కు పరిధిలోని 632 ఎకరాలను 2007లోనే ఏపీఐఐసీ సేకరించింది. అప్పట్లో ఎకరాకు రూ.లక్ష చొప్పన చెల్లించి ఏపీఐఐసీ భూ సేకరణ పూర్తి చేసింది. హీరో మోటార్స్ కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.1,600 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏపీఐఐసీ స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వంతో కంపెనీ ప్రతినిధులు ఎంవోఓ చేసుకున్నారు. కంపెనీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 15,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలియజేసింది. ప్రభుత్వం 2016లో హీరో మోటార్స్‌కు స్థలం కేటాయింపులు జరిపింది. ఆ తర్వాత ప్లాంట్ చుట్టూ ప్రహరీ గోడ, రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.22.83 కోట్లతో కాంపౌండ్ వాల్‌ను నిర్మించారు. రూ.8.94 కోట్లతో రెండు లేన్ల బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు. రూ.48 లక్షలతో ఇక్కడున్న కోదండ రామాలయాన్ని మరో చోట నిర్మించారు. రూ.42 లక్షలతో 33/11 కేవీ విద్యుత్ లైన్ షిప్ట్ చేశారు. మరో రూ.2.93 కోట్లతో 132 కేవీ టవర్ లైన్లను పక్కకు మార్చారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను కూడా మూడు దశల్లో పూర్తి చేస్తామని హీరో మోటార్స్ ప్రకటించింది. 2023 నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేసి తొలి దశ ఉత్పత్తిని చూపుతామని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. -
హీరో.. మూడు కొత్త బైక్‌లు!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా మూడు కొత్త బైక్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘సూపర్ స్లె్పండర్’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ప్రో’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ఎక్స్‌ప్రొ’ను తీసుకువచ్చింది. ఈ బైక్స్‌ను అధునాతన ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్‌తో రూపొందించామని, వీటి సాయంతో దేశీ మోటార్‌సైకిల్ విభాగంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని కంపెనీ తెలియజేసింది. కాగా 100–125 సీసీ విభాగంలో హీరో కంపెనీదే హవా. ఇందులో స్లె్పండర్, ప్యాషన్, హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, సూపర్ స్లె్పండర్ వంటి బ్రాండ్లతో దూసుకుపోతోంది. కంపెనీ ఈ కొత్త మోడళ్ల ధరలను త్వరలో ప్రకటించనుంది. -
మహిళా పోలీసులకు హీరో స్కూటీలు
హైదరాబాద్: మహిళ సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణ మహిళా పోలీసులకు హీరో మోటార్స్ 159 స్కూటీలను అందజేసింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో హీరో మోటార్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులకు 70, సైబరాబాద్‌కు 50 స్కూటీలను, రాచకొండ కమిషనరేట్‌కు 39 స్కూటీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి షీ టీం ఇన్చార్జ్ స్వాతిలక్రా, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు హాజరయ్యారు. -
పరిశ్రమలకు ప్రతిబంధకం
హీరో, డీఆర్డీవో పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు మాదనపాళెంలో హీరో పరిశ్రమకు 600 ఎకరాల కేటాయింపు ఎకరాకు రూ.ఆరు లక్షల పరిహారమివ్వాలంటున్న రైతులు పరిహారం, ఉపాధి కల్పిస్తేనే సహకరిస్తామని గిరిజనుల స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, తిరుపతి: భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వవైఖరి హీరో మోటార్స్, డీఆర్డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిబంధకంగా మారుతోంది. ఎకరాకు రూ.ఆరు లక్షల పరిహారం ఇస్తేనే హీరో మోటార్స్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తామని మాదనపాళెం రైతులు తెగేసి చెబుతున్నారు. పరిహారం, ఉపాధి అందిస్తేనే డీఆర్డీవో పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరి స్తామని నిర్వాసితులు స్పష్టీకరిస్తున్నారు. ఆ మేరకు పరి హారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో నిర్వాసితులు ఉద్యమబాట పట్టారు. సత్యవేడు మండలం మాదనపాళెంలో మోటారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటు చేయడానికి 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్ సంస్థకు కేటాయిస్తూ సెప్టెంబరు 16న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే కేటాయించిన 600 ఎకరాల భూమిని ఆ సంస్థకు అప్పగించేందుకు మాదనపాళెంకు వెళ్లిన అధికారులను అక్కడి రైతులు అడ్డుకున్నారు. సత్యవేడు మండలంలో శ్రీసిటీ సెజ్ ఏర్పాటైనప్పుడు మాదనపాళెం రైతులకు చెందిన 450 ఎకరాల భూమిని సేకరించారు. అదే గ్రామంలోని 633 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ 2007లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పరిశ్రమలను నెలకొల్పడంలో ఏపీఐఐసీ విఫలమైంది. ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూమిని హీరో మోటార్స్‌కు కేటాయించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.8 లక్షల మేర పరిహారం ఇస్తేనే పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తామని తెగేసి చెప్పారు. ఎకరాకు రూ.లక్ష మాత్రమే పరిహారం ఇస్తామని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ స్పష్టీకరించారు. రైతులు ఉద్యమబాట పట్టడంతో రూ.1.65 లక్షలకు మించి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇందుకు రైతులు అంగీకరించడం లేదు. ఎకరాకు కనీసం రూ.ఆరు లక్షల పరిహారం ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. మాదనపాళెంలో రైతు కూలీలు తమకూ పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. డీఆర్డీవో పరిశ్రమదీ అదే కథ. ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండలో సర్వే నెంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నెంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్డీవోకు కేటాయిస్తూ ఆగస్టు 13న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 289)ను జారీ చేశారు. ఎకరాకు రూ.1.25 లక్షల చొప్పున డీఆర్డీవోకు ఆ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో రూ.600 కోట్లతో క్షిపణుల తయారీ పరిశ్రమ, రక్షణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సెప్టెంబరు 16న ప్రభుత్వంతో డీఆర్డీవో ఎంవోయూ కుదుర్చుకుంది. ఆ పరిశ్రమ ఏర్పాటు చేసే భూమిలో గిరిజనులు నివాసముంటున్నారు. పరిహారంతో పాటు ఉపాధి కల్పిస్తేనే సహకరిస్తామని తెగేసి చెబుతున్నారు. పరిహారం పెంచాలి వూదనపాళెంలో హీరో భూవుులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం పెంచాలి. కలెక్టర్ ఎకరాకు రూ.1.65 లక్షలు ఇస్తామన్నారు. మేవుు భూమి సాగుకు రూ.3 లక్షలు ఖర్చు చేశాం. ఎస్ఈజెడ్కు భూమి ఇచ్చినపుడు వచ్చిన పరిహారమంతా దానికే పెట్టేశాం. ప్రస్తుతం అప్పుల పాలై ఉన్నాం. ప్రభుత్వం కనికరించి రూ.5లక్షలు పైగా ఇస్తే రైతుకు మేలు జరుగుతుంది. -ఎస్.జగదీశ్వరయ్య, మాదనపాళెం రైతు కూలీలకూ పరిహారమివ్వాలి వూదనపాళెంలో సెంటు భూమి లేకుండా రైతు కూలీలుగా ఉన్న పేద కుటుంబాలకూ పరిహారమివ్వాలి. రెండు రోజుల క్రితం కలెక్టర్‌ను కలిశాం. పేద రైతులను ఆదుకోవాలని కోరాం. న్యాయుం చేస్తామన్నారు. ఎంత ఇస్తారో చెప్పలేదు. కనీసం రూ. 2లక్షలు ఇస్తే మేలు. -ఆదెవ్ము, వూదనపాళెం -
హీరో.. డీఆర్డీవో మనకే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : సత్యవేడు మండలం మాదనపాళెంలో హీరో మోటార్స్ వాహనాల తయారీ పరి శ్రమ, ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండలో డీఆర్డీవో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థల యాజమాన్యంతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్థ యాజమాన్యాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఆ రెండు పరిశ్రమలు ఏర్పాటైతే నాలుగువేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..దేశ రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలో తిరుగులేని ఆకాశ్, త్రిశూల్, అగ్ని వంటి అస్త్రాలను రూపొందిం చిన డీఆర్డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) పరిశ్రమను జిల్లాలో ఏర్పాటుచేయడానికి 2008లో ఆ సంస్థ ప్రతిపాదించింది. డీఆర్డీవో ప్రతిపాదన మేరకు ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండ, చిన్నతయ్యూరు గ్రామాల పరిధిలోని 1102.30 ఎకరాల భూ మిని అప్పటి కలెక్టర్ శేషాద్రి గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొం డలో సర్వే నెంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నెంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్డీవోకు కేటాయిస్తూ ఆగస్టు 13న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ఎకరానికి రూ.1.25 లక్షల చొప్పున డీఆర్డీవోకు ఆ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో రూ.600 కోట్లతో క్షిపణుల తయారీ పరిశ్రమ, రక్షణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి డీఆర్డీవో యాజమాన్యంతో మంగళవారం ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సత్యవేడు మండలం మాదనపాళెంలో మో టారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి హీరో మోటార్స్ సంస్థ ముందుకొచ్చిన విషయం విదితమే. ఆ సంస్థకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.1600 కోట్ల వ్యయంతో ఏడాదికి ఎనిమిది మిలియన్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఎస్ఆర్పురంలో ఏర్పాటుచేసే డీఆర్డీవో పరిశ్రమ ద్వారా వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పదేళ్లపాటు వ్యాట్(విలువ ఆధారిత) పన్ను, సీఎస్టీ(సెంట్రల్ సేల్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపు, విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, భూమి ధరల్లో రాయితీ ఇస్తేనే మోటారు వాహనాల సంస్థను ఏర్పాటుచేస్తామని హీరో మోటార్స్ మెలిక పెట్టింది. కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీపై ఆశలు పెంచుకున్న ప్రభుత్వం ఆ మేరకు హీరో మెటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. -
మాదన్నపాలెంలో ‘హీరో’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సత్యవేడు మండలం మాదన్నపాలెంలో మోటారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి హీరో మోటార్స్‌కు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.1500 కోట్ల వ్యయంతో ఏడాదికి 20 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ సీఈవో, ఎండీ పవన్ ముంజాల్ అంగీకరించారు. కానీ.. వ్యాట్(విలువ ఆధారిత పన్ను), విద్యుత్ చార్జీలు, భూమి ధరలు స్టాంప్ డ్యూటీల్లో రాయితీ ఇవ్వాలని మెలిక పెట్టారు. కేంద్రం ఇచ్చే పారిశ్రామిక రాయితీలపై ఆశలు పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. హీరో మోటార్స్ పెట్టిన షరతులకు అంగీకరించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే హీరో మోటార్స్ సంస్థ వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి సిద్ధమైంది. కానీ.. ఇంతలోనే విభజనోద్యమం చెలరేగడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మోటారు వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఇరు ప్రభుత్వాలతోనూ చర్చలు జరిపింది. తెలంగాణలో భూముల ధరలు అధికంగా ఉండడం.. విద్యుత్ సంక్షోభం, ఇతర రాష్ట్రాలు, దేశాలను అనుసంధానం చేసేలా ఉపరితల, జల రవాణా వ్యవస్థలు లేకపోవడంతో అక్కడ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఆ సంస్థ యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఇతర దేశాలతోపాటూ రాష్ట్రాలకు ఉపరితల, జల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమను ఏర్పాటుచేసేందుకు హీరో మోటార్స్ ముందుకొచ్చింది. జిల్లాలో శ్రీసిటీకి సమీపంలో సత్యవేడు మండలం మాదన్నపాలెంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కు చెందిన 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణపట్నం నౌకాశ్రయానికి సమీపంలో ఉండడం.. ఉపరితల రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటం.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దగ్గర ఉండడంతో అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు హీరో మోటార్స్ యాజమాన్యం అంగీకరించింది. దాంతో.. మాదన్నపాలెంలో ఏపీఐఐసీకి చెందిన 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్‌కు కేటాయిస్తూ సోమవారం మంత్రిమండలి తీర్మానించింది. ఈ పరిశ్రమను ఏర్పాటుచేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ.. మాదన్నపాలెంలో హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటుకు ఆ సంస్థ యాజమాన్యం కొన్ని మెలికలు పెట్టింది. పదేళ్లపాటూ వ్యాట్ పన్ను నుంచి మినహాయింపు, విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, భూమి ధరల్లో రాయితీని కోరింది. రాష్ట్ర విభజన సమయంలో పారిశ్రామికాభివృద్ధిపై కేంద్రం హామీ ఇచ్చింది. పరిశ్రమల స్థాపనకు వీలుగా రాయితీలు ఇస్తామని కేంద్రం పేర్కొంది. ఆ హామీపై ఆశలు పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాయితీలపై హీరో మోటార్స్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
పండుగ షి'కారు'!
న్యూఢిల్లీ: వాహన మార్కెట్ మెల్లమెల్లగా పుంజుకుంటోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు కుదేలై అల్లాడుతున్న వాహన మార్కెట్లో సెప్టెంబర్ మంచి అమ్మకాలనే సాధించింది. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, జనరల్ మోటార్స్ కంపెనీల అమ్మకాలు మినహా, మిగిలిన కంపెనీల అమ్మకాలు పుంజుకున్నాయి. వర్షాలు బాగా ఉండడంతో టూవీలర్ల అమ్మకాలు పెరిగాయి. హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, యమహా కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. రానున్న పండుగల సీజన్లో అమ్మకాలు బావుంటాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. ప్యాకేజీ కావాలి... రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పతి వ్యయాలు పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. దీనిని తట్టుకోవడానికి మంగళవారం నుంచే ధరలు పెంచామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడం, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం, తదితర కారణాల వల్ల వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉందని జీఎం ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ వివరించారు. ప్రస్తుత మందగమనం నుంచి వాహన పరిశ్రమ గట్టెక్కాలంటే ప్యాకేజీ కావాల్సిందేనని ప్రవీణ్ షా పేర్కొన్నారు. ఫలితంగా వాహన పరిశ్రమతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా పురోగమిస్తుందని వివరించారు. ఇకోస్పోర్ట్ కారణంగా ఫోర్డ్ అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతీ సుజుకి ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. హ్యుందాయ్ ఎగుమతులు 8 శాతం క్షీణించాయి. గత నెలలో గ్రాండ్ కారును మార్కెట్లోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. హోండా కార్స్ దేశీయ అమ్మకాలు 88 శాతం పెరిగాయి. తమ అమేజ్, బ్రియో కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫోర్ వీల్ వాణిజ్య వాహనాల అమ్మకాలు 2 శాతం, త్రీ వీలర్ల అమ్మకాలు 6 శాతం చొప్పున పెరిగాయి. ఎగుమతులు 12 శాతం క్షీణించాయి. మహీంద్రా ట్రాక్టర్ దేశీయ అమ్మకాలు 37 శాతం వృద్ధి చెందినప్పటికీ, ఎగుమతులు మాత్రం 39 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌లో మంచి అమ్మకాలు సాధించామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా చెప్పారు. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని కుకాస్‌లో రూ.450 కోట్లతో సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డిజైన్ సంస్థ నిర్మాణాన్ని ప్రారంభించామని, ఇది 2015 మార్చికల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని వివరించారు. నిస్సాన్ ధరలు పెరిగాయ్ నిస్సాన్ కంపెనీ మైక్రా, సన్నీ మోడల్ కార్ల ధరలను 1.4 శాతం నుంచి 2.9 శాతం వరకూ పెంచింది. ఈ ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని హోవర్ ఆటోమోటివ్ ఇండియా డెరైక్టర్ (సేల్స్, మార్కెటింగ్) నితీష్ టిప్నిస్ మంగళవారం చెప్పారు. నిస్సాన్ కార్లను హోవర్ కంపెనీయే భారత్‌లో విక్రయిస్తోంది. రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే ధరలు పెంచుతున్నామని నితీష్ వివరించారు. ధరలను స్వల్పంగానే పెంచామని.. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న నిస్సాన్ కార్లను భారత్‌లో చౌక ధరలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయం పెరగడం తట్టుకోలేక మారుతీ , టయోటా, జనరల్ మోటార్స్, మహీంద్రా హ్యుందాయ్ కంపెనీలు ధరలను పెంచాయి.