
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 925 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. జాతీయ విపత్తు సహాయక నిధి కోసం గతంలో కేటాయించిన రూ. 737 కోట్లు రీఫండ్ కావడం.. తాజాగా లాభాల వృద్ధికి కారణమైందని సంస్థ వెల్లడించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ ఆదాయం రూ. 8,913 కోట్ల నుంచి రూ. 8,186 కోట్లకు తగ్గింది. హరిద్వార్‌లోని ప్లాంటుపై సెస్సుకు సంబంధించి జాతీయ విపత్తు సహాయక నిధికి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలన్న ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని, దీంతో రీఫండ్‌గా వస్తున్న ఆ మొత్తాన్ని ఆర్థిక ఫలితాల్లో ప్రత్యేక అంశంగా పేర్కొనడం జరిగిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో హీరో మోటోకార్ప్ షేరు 6 శాతం క్షీణించి రూ. 2,259.35 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment