పండుగ షి'కారు'!
న్యూఢిల్లీ: వాహన మార్కెట్ మెల్లమెల్లగా పుంజుకుంటోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు కుదేలై అల్లాడుతున్న వాహన మార్కెట్లో సెప్టెంబర్ మంచి అమ్మకాలనే సాధించింది. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, జనరల్ మోటార్స్ కంపెనీల అమ్మకాలు మినహా, మిగిలిన కంపెనీల అమ్మకాలు పుంజుకున్నాయి. వర్షాలు బాగా ఉండడంతో టూవీలర్ల అమ్మకాలు పెరిగాయి. హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, యమహా కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. రానున్న పండుగల సీజన్‌లో అమ్మకాలు బావుంటాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి.
ప్యాకేజీ కావాలి...
రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పతి వ్యయాలు పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. దీనిని తట్టుకోవడానికి మంగళవారం నుంచే ధరలు పెంచామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడం, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం, తదితర కారణాల వల్ల వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉందని జీఎం ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ వివరించారు. ప్రస్తుత మందగమనం నుంచి వాహన పరిశ్రమ గట్టెక్కాలంటే ప్యాకేజీ కావాల్సిందేనని ప్రవీణ్ షా పేర్కొన్నారు. ఫలితంగా వాహన పరిశ్రమతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా పురోగమిస్తుందని వివరించారు.
- ఇకోస్పోర్ట్ కారణంగా ఫోర్డ్ అమ్మకాలు బాగా పెరిగాయి.
- మారుతీ సుజుకి ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి.
- హ్యుందాయ్ ఎగుమతులు 8 శాతం క్షీణించాయి. గత నెలలో గ్రాండ్ కారును మార్కెట్లోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది.
- హోండా కార్స్ దేశీయ అమ్మకాలు 88 శాతం పెరిగాయి. తమ అమేజ్, బ్రియో కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ వివరించింది.
- మహీంద్రా అండ్ మహీంద్రా ఫోర్ వీల్ వాణిజ్య వాహనాల అమ్మకాలు 2 శాతం, త్రీ వీలర్ల అమ్మకాలు 6 శాతం చొప్పున పెరిగాయి. ఎగుమతులు 12 శాతం క్షీణించాయి.
- మహీంద్రా ట్రాక్టర్ దేశీయ అమ్మకాలు 37 శాతం వృద్ధి చెందినప్పటికీ, ఎగుమతులు మాత్రం 39 శాతం తగ్గాయి.
- సెప్టెంబర్‌లో మంచి అమ్మకాలు సాధించామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా చెప్పారు. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని కుకాస్‌లో రూ.450 కోట్లతో సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డిజైన్ సంస్థ నిర్మాణాన్ని ప్రారంభించామని, ఇది 2015 మార్చికల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని వివరించారు.
నిస్సాన్ ధరలు పెరిగాయ్
నిస్సాన్ కంపెనీ మైక్రా, సన్నీ మోడల్ కార్ల ధరలను 1.4 శాతం నుంచి 2.9 శాతం వరకూ పెంచింది. ఈ ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని హోవర్ ఆటోమోటివ్ ఇండియా డెరైక్టర్ (సేల్స్, మార్కెటింగ్) నితీష్ టిప్నిస్ మంగళవారం చెప్పారు. నిస్సాన్ కార్లను హోవర్ కంపెనీయే భారత్‌లో విక్రయిస్తోంది. రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే ధరలు పెంచుతున్నామని నితీష్ వివరించారు. ధరలను స్వల్పంగానే పెంచామని.. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న నిస్సాన్ కార్లను భారత్‌లో చౌక ధరలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయం పెరగడం తట్టుకోలేక మారుతీ , టయోటా, జనరల్ మోటార్స్, మహీంద్రా హ్యుందాయ్ కంపెనీలు ధరలను పెంచాయి.