హీరో మోటార్స్‌కి కేటాయించిన స్థలం ఇదే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సత్యవేడు మండలం మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో హీరో మోటార్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమి పూజ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంట లకు హీరో మోటార్స్ కంపెనీ ప్రతిపాదిత ప్రాంతానికి చేరుకునే సీఎం అరగంట భూమిపూజలో పాల్గొంటారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కొద్దిసేపు మాట్లాడతారు. తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరతారని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం మధ్యాహ్నం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హీరో మోటార్స్ కంపెనీ వివరాలను వెల్లడించారు. ఈ మధ్యనే శ్రీసిటీ ప్రాంతంలో అపోలో టైర్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు హీరో మోటార్స్ వస్తోందని, చిత్తూరు, నెల్లూరుతో పాటు రాయలసీమలోని జిల్లాలన్నీ హీరో మోటార్స్ వల్ల లాభపడతాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఆటోమొబైల్ హబ్‌లా మారుతుందని తెలిపారు. త్వరలో తిరుపతి దగ్గరలో రిలయన్స్ జియో ఫోన్ల తయారీ యూనిట్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని, ఇందుకోసం 150 ఎకరాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.
టూ వీలర్స్,వాటి విడి భాగాల తయారీ..
సత్యవేడు మండలం మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కు పరిధిలోని 632 ఎకరాలను 2007లోనే ఏపీఐఐసీ సేకరించింది. అప్పట్లో ఎకరాకు రూ.లక్ష చొప్పన చెల్లించి ఏపీఐఐసీ భూ సేకరణ పూర్తి చేసింది. హీరో మోటార్స్ కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.1,600 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏపీఐఐసీ స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వంతో కంపెనీ ప్రతినిధులు ఎంవోఓ చేసుకున్నారు. కంపెనీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 15,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలియజేసింది. ప్రభుత్వం 2016లో హీరో మోటార్స్‌కు స్థలం కేటాయింపులు జరిపింది. ఆ తర్వాత ప్లాంట్ చుట్టూ ప్రహరీ గోడ, రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.22.83 కోట్లతో కాంపౌండ్ వాల్‌ను నిర్మించారు. రూ.8.94 కోట్లతో రెండు లేన్ల బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు. రూ.48 లక్షలతో ఇక్కడున్న కోదండ రామాలయాన్ని మరో చోట నిర్మించారు. రూ.42 లక్షలతో 33/11 కేవీ విద్యుత్ లైన్ షిప్ట్ చేశారు. మరో రూ.2.93 కోట్లతో 132 కేవీ టవర్ లైన్లను పక్కకు మార్చారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను కూడా మూడు దశల్లో పూర్తి చేస్తామని హీరో మోటార్స్ ప్రకటించింది. 2023 నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేసి తొలి దశ ఉత్పత్తిని చూపుతామని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment