మాదన్నపాలెంలో ‘హీరో’ | The government has allotted 600 acres of land to hero motors | Sakshi
Sakshi News home page

మాదన్నపాలెంలో ‘హీరో’

Published Tue, Sep 16 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

The government has allotted 600 acres of land to hero motors

సాక్షి ప్రతినిధి, తిరుపతి: సత్యవేడు మండలం మాదన్నపాలెంలో మోటారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి హీరో మోటార్స్‌కు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.1500 కోట్ల వ్యయంతో ఏడాదికి 20 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ సీఈవో, ఎండీ పవన్ ముంజాల్ అంగీకరించారు. కానీ.. వ్యాట్(విలువ ఆధారిత పన్ను), విద్యుత్ చార్జీలు, భూమి ధరలు స్టాంప్ డ్యూటీల్లో రాయితీ ఇవ్వాలని మెలిక పెట్టారు. కేంద్రం ఇచ్చే పారిశ్రామిక రాయితీలపై ఆశలు పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. హీరో మోటార్స్ పెట్టిన షరతులకు అంగీకరించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే హీరో మోటార్స్ సంస్థ వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి సిద్ధమైంది. కానీ.. ఇంతలోనే విభజనోద్యమం చెలరేగడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
 
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మోటారు వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఇరు ప్రభుత్వాలతోనూ చర్చలు జరిపింది. తెలంగాణలో భూముల ధరలు అధికంగా ఉండడం.. విద్యుత్ సంక్షోభం, ఇతర రాష్ట్రాలు, దేశాలను అనుసంధానం చేసేలా ఉపరితల, జల రవాణా వ్యవస్థలు లేకపోవడంతో అక్కడ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఆ సంస్థ యాజమాన్యం ఆసక్తి చూపలేదు. ఇతర దేశాలతోపాటూ రాష్ట్రాలకు ఉపరితల, జల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమను ఏర్పాటుచేసేందుకు హీరో మోటార్స్ ముందుకొచ్చింది. జిల్లాలో శ్రీసిటీకి సమీపంలో సత్యవేడు మండలం మాదన్నపాలెంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కు చెందిన 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
 
కృష్ణపట్నం నౌకాశ్రయానికి సమీపంలో ఉండడం.. ఉపరితల రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటం.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దగ్గర ఉండడంతో అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు హీరో మోటార్స్ యాజమాన్యం అంగీకరించింది. దాంతో.. మాదన్నపాలెంలో ఏపీఐఐసీకి చెందిన 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్‌కు కేటాయిస్తూ సోమవారం మంత్రిమండలి తీర్మానించింది. ఈ పరిశ్రమను ఏర్పాటుచేయడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ.. మాదన్నపాలెంలో హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటుకు ఆ సంస్థ యాజమాన్యం కొన్ని మెలికలు పెట్టింది. పదేళ్లపాటూ వ్యాట్ పన్ను నుంచి మినహాయింపు, విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, భూమి ధరల్లో రాయితీని కోరింది. రాష్ట్ర విభజన సమయంలో పారిశ్రామికాభివృద్ధిపై కేంద్రం హామీ ఇచ్చింది. పరిశ్రమల స్థాపనకు వీలుగా రాయితీలు ఇస్తామని కేంద్రం పేర్కొంది. ఆ హామీపై ఆశలు పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాయితీలపై హీరో మోటార్స్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement