వాహన బీమా ఇక మరింత ప్రియం
ఏప్రిల్ 1 నుంచి 40% పెరగనున్న థర్డ్ పార్టీ ప్రీమియంలు
న్యూఢిల్లీ: వాహనదారులకు షాక్ నిచ్చేలా కార్లు, బైకుల బీమా ప్రీమియంలు ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని 40 శాతం పెంచాలని నిర్ణయించినట్లు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. దీని ప్రకారం చిన్న కార్లకు (1,000 సీసీ సామర్థ్యం దాకా) థర్డ్ పార్టీ వాహన బీమా ప్రీమియం రూ. 1,468 నుంచి 39.9 శాతం పెరిగి రూ. 2,055కి చేరనుంది. అలాగే మిడ్ సెగ్మెట్ కార్లకు (1,000-1,500 సీసీ) 40 శాతం పెరుగుతుంది. పెద్ద కార్లు, ఎస్‌యూవీలకు (1,500 సీసీ) ఇది 25 శాతంగానే ఉండనుంది.
దీని ప్రకారం వీటి బీమా ప్రీమియంలు ప్రస్తుతమున్న రూ. 4,931 నుంచి రూ. 6,164కి పెరుగుతాయి. అటు బైకులు, స్కూటర్ల విషయానికొస్తే 75 సీసీ దాకా సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాల ప్రీమియంలు రూ. 519 నుంచి రూ. 569కి, 75-150 సీసీ టూవీలర్లకు 15 శాతం పెరుగుదలతో 619కి చేరతాయి. ఇక 150-350 సీసీ బైక్‌ల ప్రీమియం 25 శాతం మేర ఎగియనుంది. అయితే, 350 సీసీ మించిన బైక్‌ల ప్రీమియంలు మాత్రం రూ. 884కి తగ్గనున్నాయి.
అటు త్రిచక్ర వాహనాల బేసిక్ థర్డ్ పార్టీ ప్రీమియం కూడా పెరుగుతోంది. ఆరుగురు ప్రయాణికుల సామర్థ్యం ఉండే ఈ-రిక్షా కేటగిరినీ ప్రవేశపెట్టిన ఐఆర్‌డీఏఐ వీటికి స్థిరంగా రూ. 1,125 ప్రీమియం నిర్ణయించింది. అటు పబ్లిక్ క్యారియర్ల ప్రీమియంలు 15-30 శాతం పెరగనుండగా, 12 టన్నుల సామర్ధ్యం ఉండే గూడ్స్ వాహనాల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ సూచీ (సీఐఐ) క్రిత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2015-16లో 1024 నుంచి 1081కి పెరిగిందని, దానికి అనుగుణంగానే ప్రీమియంలు మార్చినట్లు కొత్త రేట్లను నోటిఫై చేస్తూ ఐఆర్‌డీఏఐ తెలిపింది.