ముంబై: దేశీయంగా బీమాను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ ఎకోరాప్ ఒక నివేదికలో తెలిపింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నారెగా) వర్కర్లను ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాల్లో తప్పనిసరిగా చేర్చాలని పేర్కొంది. అలాగే బీమా పథకాలపై విధిస్తున్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని క్రమబద్ధీకరించాల్సి ఉంటుందని సూచించింది.
వివిధ రంగాల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన పథకాలను కూడా ప్రవేశపెట్టడం ద్వారా బీమా పరిధిలోకి మరింత మందిని తీసుకువచ్చేందుకు వీలవుతుందని నివేదిక తెలిపింది. ‘నారెగా అనేది జీవనభృతిపరమైన భద్రత కల్పిస్తోంది. ఈ వర్కర్లు .. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవైలోకి చేరడం తప్పనిసరి చేయాలి. ఇందుకోసం అయ్యే రూ. 342 వ్యయాన్ని ప్రభుత్వమే భరించవచ్చు‘ అని ఎస్‌బీఐ ఎకోరాప్ పేర్కొంది. కేవలం 10 శాతం కుటుంబాలు/వ్యక్తులే 100 రోజుల పని దినాలను పూర్తి చేస్తారని, దీన్ని బట్టి చూస్తే తప్పనిసరి ఎన్‌రోల్‌మెంట్‌కు సంబంధించిన భారం రూ. 400–500 కోట్లు మాత్రమే ఉంటుందని .. దీన్ని ప్రభుత్వమే భరించవచ్చని తెలిపింది.
2001 ఆర్థిక సంవత్సరంలో 2.71 శాతంగా ఉన్న బీమా విస్తృతి, స్వేచ్ఛాయుత విధానాల కారణంగా 2009 ఆర్థిక సంవత్సరం నాటికి 5.2 శాతానికి పెరిగింది. కానీ ఆ తర్వాత నుండి తగ్గుముఖం పట్టి 2014 ఆర్థిక సంవత్సరం నాటికి 3.30 శాతం స్థాయికి పడిపోయింది. అయితే, ఆ తర్వాత సార్వజనిక బీమా పథకాలు, ప్రభుత్వ మద్దతుతో మళ్లీ క్రమంగా పుంజుకుని 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 4.20 శాతానికి చేరినట్లు నివేదిక వివరించింది.
ప్రధాన మంత్రి పథకాలివీ..
గ్రామీణ ప్రాంతాల వారికి ఏటా 100 రోజుల పాటు కచ్చితంగా పని, ఆదాయం కల్పించేందుకు నారేగా పథకాన్ని ఉద్దేశించారు. 18–50 ఏళ్ల మధ్య వారికి ఏటా రూ. 330 ప్రీమియంతో పీఎంజేజేబీవై బీమా పథకం అందుబాటులో ఉంది. దీని కింద రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. ఇక 18–70 ఏళ్ల మధ్యవారికి ఏటా రూ. 12 ప్రీమియంతో ప్రమాద బీమా పీఎంఎస్‌బీవై పథకం కూడా అందుబాటులో ఉంది. పాలసీదారు ప్రమాదవశాత్తు మరణించినా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా దీని కింద రూ. 2 లక్షల కవరేజీ ఉంటుంది. పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష వరకూ కవరేజీ లభిస్తుంది.
నివేదికలో మరిన్ని అంశాలు..
► దేశీయంగా బీమా విస్తృతి చాలా తక్కువగా ఉంది. కేవలం 20–30 శాతం మందికి మాత్రమే ఏదో ఒక తరహా ఇన్సూరెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమాపై పన్నులు వేయడమనేది పురోగమన చర్య కాబోదు. ప్రస్తుతం అన్ని బీమా పాలసీలపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. దీన్ని 5 శాతానికి లేదా సున్నా రేటు స్థాయికి తగ్గిస్తే చాలా మంది జనాభాను బీమా పరిధిలోకి తేవచ్చు. అలాగే ప్రీమియంలను కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకునేందుకు ఇది సరైన సమయం.
► జన సురక్షా తరహాలోనే వివిధ రంగాల కోసం కొన్ని ప్రామాణిక పథకాలను ప్రవేశపెట్టాలి.
► కోవిడ్–19 మహమ్మారి పరిస్థితిలోనూ దేశీ బీమా రంగం గట్టిగా ఎదురునిల్చింది. ప్రీమియం వసూళ్ల తగ్గుదల స్వల్ప స్థాయికే పరిమితమైంది. బీమా రంగం వేగంగా రికవర్ అయ్యింది.
► ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య కాలంలో జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం (ఎన్‌బీపీ) 8.4 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరింది.
► ప్రతి మూడు జీవిత బీమా పాలసీల్లో ఒక పాలసీ .. మహిళలకు జారీ అవుతోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మహిళలకు జారీ చేసిన పాలసీల సంఖ్య 93 లక్షలుగా నమోదైంది. జారీ అయిన మొత్తం పాలసీల్లో ఇది దాదాపు 33 శాతం.
చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ.. కేంద్రం వివరణ..!
Comments
Please login to add a commentAdd a comment