English and foreign languages university
-
EFLU Recruitment: ఇఫ్లూలో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటీ(ఇఫ్లూ).. బ్యాక్లాగ్, రెగ్యులర్ ప్రాతిపదికన హైదరాబాద్, దాని రీజినల్ క్యాంపస్‌లు అయిన షిల్లాంగ్, లక్నోల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టులు–14, రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులు–19. బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ పోస్టులు: ► పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: లింగ్విస్టిక్స్–కాంటెంపరరీ ఇంగ్లిష్, మెటీరియల్స్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ఎవల్యూషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఎడ్యుకేషన్, అరబ్ స్టడీస్, ఏస్థెటిక్స్, ఫిలాసఫీ. రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులు: ► పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్. ► విభాగాలు: లింగ్విస్టిక్స్–కాంటెంపరరీ ఇంగ్లిష్, ఫొనెటిక్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లిష్, మెటీరియల్స్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ఎవల్యూషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఎడ్యుకేషన్, అరబ్ స్టడీస్, ఏస్థెటిక్స్, ఫిలాసఫీ. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 18.05.2021 ► వెబ్సైట్: http://www.efluniversity.ac.in/Application%20FormsRecruitment%202021.php హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి! -
వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!) ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించింది. ఎన్ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
లాక్డౌన్ సమయంలో ఇఫ్లూ పరీక్షలు..
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ) చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించింది. లాక్డౌన్ సమయంలో పరీక్షలు నిర్వహించిన మెదటి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ఇఫ్లూ రికార్డు సృష్టించింది. దేశంలోనే విదేశీ భాషల శిక్షణకు ఇఫ్లూ(కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఎంతో పేరు పొందిన విషయం తెలిసిందే. పరీక్షలు విజయవంతం కావడానికి వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఈ.సురేష్ కుమార్, విద్యార్థుల కృషితో సాధ్యమయిందని ఇఫ్లూ తెలిపింది. పరీక్షల నిర్వహణకు అధ్యాపకులు ఎంతో కృషి చేశారని వీసీ కొనియాడారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొని విద్యాసంవత్సరం విజయవంతంగా పూర్తి చేశామని ఇప్లు తెలిపింది. ప్రస్తుతం షిల్లాంగ్‌లోని తమ ప్రాంతీయ క్యాంపస్‌లో ఆన్లైన్ ద్వారా పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది. దేశంలోని పీహెచ్డీ స్కాలర్లకు వైవా పరీక్షలు నిర్వహించిన మొదటి విశ్వవిద్యాలయంగా చరిత్ర సృష్టించామని పేర్కొంది. ఇప్పటి వరకు 15 వైవా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. సామాజిక సేవలలో కూడా ఇఫ్లూ ముందుందని.. కరోనా నియంత్రణకు వివిధ రూపాలలో చర్యలు చేపట్టామని తెలిపింది. ఇఫ్లూలో కరోనా నియంత్రణకు 23 ఏప్రిల్, 2020 న కేంద్ర మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇప్లులో షార్ట్ ఫిల్మ్ సంస్థను ప్రారంభించారు. విదేశీ భాషలకు ప్రత్యేకంగా ఉచిత ఆన్లైన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ద్వారా ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, చైనీస్, పెర్షియన్ భాషలలో అందిస్తోంది. కరోనాను నియంత్రించేందుకు ఎఫ్ఎమ్ రేడియో ద్వారా అవగాహన కలిగించామని తెలిపింది. విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో పెట్టడానికి ఆన్లైన్ శిక్షణను సమర్థవంతంగా కొనసాగించామని పేర్కొంది. హాస్టల్లో నివసించే విదేశీ విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కరోనావైరస్ను ఎదుర్కొని.. విద్యాసంవత్సరం విజయవంతంగా పూర్తి చేయడంలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి వైస్ ఛాన్సలర్ సురేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్ధులు ఎన్నుకున్న రంగంలో రాణించాలని.. వారు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగాలని వీసీ సురేష్ కుమార్ ఆకాంక్షించారు -
మెక్సికోలో వైస్ ఛాన్సలర్ల సదస్సు
మెక్సికో: మెక్సికోలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు వైస్ ఛాన్సలర్ల సదస్సు జరిగింది. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ(ఇఫ్లూ) వైస్ ఛాన్సలర్ సురేష్ కుమార్ ఈ సదస్సుకు ప్రాతినిథ్యం వహించారు. భారత విశ్వవిద్యాలయాల సంఘం (ఎఐయు), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మెక్సికో (ANUIES)ఈ సమావేశాలను సంయుక్తం గా నిర్వహించాయి. ఆవిష్కరణలపై అనుభవాలను పంచుకోవడం, ఈ సదస్సులో పాల్గొంటున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం, ఆలోచనలు విస్తరించడానికి వైస్ ఛాన్సలర్ల ప్రత్యేక బృందానికి ఒక సాధారణ వేదికను అందించడమే ఈ సమావేశ ముఖ్య లక్ష్యం. రెండు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారాన్ని సులభతరం చేయడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ విశ్వవిద్యాలయం మెక్సికోలోని అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ సినాలోవాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విశ్వవిద్యాలయాలు విద్యా, పరిశోధన, విద్యార్థి, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలలో సహకరిస్తాయి. అవగాహన ఒప్పందం, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రసంగాలు, సమావేశాలు, ప్రత్యేక ప్రదర్శనలు, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణకు వీలు కల్పిస్తుంది. తన పర్యటనలో భాగంగా ప్రొఫెసర్ సురేష్ కుమార్ శాన్ జోస్ లోని శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీని సందర్శించారు. బోధన, విద్యా పరిశోధనలలో కొత్త పోకడలను అన్వేషించడానికి యునైటెడ్ స్టేట్స్‌లోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ.. విద్యావేత్తల నాణ్యతను మెరుగు పరచడానికి, విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎక్కువ అవకాశాలను కల్పించడానికి ప్రపంచ భాగస్వామ్యాల అవసరం ఉందన్నారు. -
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ప్రాంగణంలో ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ), రీసెర్చ్ ఫర్ రీసర్జెన్స్ ఫౌండేషన్ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఎఫ్), ఇతర సంస్థల సహకారంతో నిర్వహించిన ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇఫ్లూ వజ్రోత్సవాల సందర్భంగా నిర్మించిన స్మారకాన్ని(పైలాన్) ఆవిష్కరించారు. ప్రకృతితో కలసి జీవించడం భారతీయ సంస్కృతిలో ఉందని, పెద్దలు మన సంప్రదాయాల్లో, ఆరాధనలో ప్రకృతికి ప్రాధాన్యమిచ్చారన్నారు. సామాజిక అభివృద్ధితోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. జనాభాలో ఇప్పటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు దారిద్య్ర నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పేదరిక నిర్మూలనకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాలస్థాయి నుంచే ప్రకృతికి మేలు చేసే విధంగా అభివృద్ధి భావనను విద్యార్థుల్లో కలిగించాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో గ్రామాలను అంతర్భాగం చేయాలన్నారు. ప్రతి అభివృద్ధి ప్రణాళిక పరిపూర్ణం అయ్యేందుకు ఐదు ‘‘పి’’లు అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు. పీపుల్(ప్రజలు), ప్రాస్పరిటీ(శ్రేయస్సు), ప్లానెట్ (భూగ్రహం), పీస్(శాంతి), పార్ట్నర్షిప్(భాగస్వామ్యం) అనే ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిమార్గంలో ముందుకు పోవాలని ఆయన సూచించారు. స్థిరమైన ఆర్థికవృద్ధే సమాజాభివృద్ధి జీడీపీ, వినియోగం, మానవ అభివృద్ధి, ఆదాయ స్థాయి, పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, పాశ్చాత్యీకరణ లాంటి అనేక భావనలతో అభివృద్ధి అనేది ముడిపడి ఉంటుందని వెంకయ్య అన్నారు. స్థిరమైన ఆర్థికవృద్ధి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనలో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించడం, వాతావరణ సమస్యలను పరిష్కరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించడం, మహిళా సాధికారతను సాకారం చేయడం, ఉద్యోగాల కల్పన లాంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాల్లో వేగవంతమైన పురోగతే దేశాభివృద్ధికి సూచిక అని అన్నారు. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, కుల–లింగ వివక్ష, నల్లధనం, ఉగ్రవాదం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు కృషి చేయడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!
‘బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ - ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేధావులు.. ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌరహక్కుల నేతలపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వరవరరావు అల్లుడు, ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) ప్రొఫెసర్ సత్యనారాయణ.. తన ఇంట్లో సోదాలు చేసిన సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అది అరెస్టు వారెంటు కాదు.. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు పవన, అల్లుడు సత్యనారాయణ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ విషయం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ... వరవరరావుకు అల్లుడినైన నేరానికే పోలీసులు తన పట్ల ఈ విధంగా ప్రవర్తించారేమో అంటూ సోదాలు నిర్వహించిన తీరును మీడియాకు వివరించారు. ‘ ఆరోజు(మంగళవారం) ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో.. సుమారు 20 మంది పోలీసులు (10 మంది మహారాష్ట్ర, 10 మంది తెలంగాణ పోలీసులు)ఇఫ్లూ స్టాఫ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మరాఠీ భాషలో ఉన్న ఓ కాగితాన్ని సర్చ్ వారెంట్ అంటూ నా చేతిలో పెట్టి ఇంట్లోకి వచ్చి, సోదాలు మొదలుపెట్టారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. మా దగ్గర ఉన్న మొబైల్స్, ల్యాప్టాప్స్ తీసేసుకున్నారు. ఈ- మెయిల్ ఐడీలు బ్లాక్ చేశారు. అయితే పోలీసులు నాకు ఇచ్చింది సెర్చ్ వారెంట్ కాదని, ఓ పోలీసు ఉన్నతాధికారి రాసి ఇచ్చిన స్టేట్మెంట్ అని తర్వాత తెలిసిందని’ సత్యనారాయణ చెప్పారు. బాత్రూం డోర్ తెరచి ఉంచాలంటూ.. ‘బ్రష్ చేసుకునేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ అంటూ తన భార్య పవనను మనోవేదనకు గురిచేశారని సత్యనారాయణ ఆరోపించారు. ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క మచ్చ కూడా లేదు.. 30 ఏళ్ల సర్వీసులో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కేవలం వరవరరావు అల్లుడనే ఒకే ఒక్క కారణం చేత తనను టార్గెట్ చేశారని విమర్శించారు. తనలాంటి అమాయకుల మీద లేనిపోని నిందలు మోపి, గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుంటే ఏ కోర్టులకు కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు మేధావి అవ్వాలని ఎందుకు అనుకున్నావ్. నీ గదిలో అంబేద్కర్, ఫూలే దంపతుల ఫొటోలు ఎందుకున్నాయి. ప్రొఫెసర్‌గా సంపాదిస్తున్నది సరిపోవడం లేదా? మావో సాహిత్యం ఎందుకు చదువుతున్నావ్? వేరే పనులేమీ లేవా అంటూ ఒక ఉగ్రవాదిని ప్రశ్నించినట్లు తనను కూడా ప్రశ్నించారంటూ’ పోలీసుల తీరుపై సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఘటనతో క్యాంపస్ అంతా ఉలిక్కి పడింది. సత్యనారాయణ ఇంట్లో సోదాలు జరపటానికి పోలీసులు రావడంతో క్యాంపస్‌లోని విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారని ఇఫ్లూ ప్రొఫెసర్ సుజాత ముకిరి అన్నారు. సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. -
సామాజిక సేవకు మేము సైతం..
రాయదుర్గం : గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సులకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 13 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వీరిలో ముగ్గురు గౌలిదొడ్డి ఐఐటీ గురుకుల విద్యార్థులే కావడం విశేషం. మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం వచ్చింది. ఇటీవలే జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చాటి అడ్వాన్స్‌కు అర్హత సాధించిన గురుకుల విద్యార్థులు రమేష్‌చంద్ర, ఎ.మదర్ ఇండియా, జి. శశిశ్వేత జర్నలిజం కోర్సుకు ఎంపికయ్యారు. ఇటీవలే నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటి విద్యార్థులు సీట్లు సాధించడం విశేషం. ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సుకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్ వివేకానందను టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.. గౌలిదొడ్డిలోని గురుకుల కళాశాలలో ఐఐటీ, నీట్ కు శిక్షణ ఇస్తామని, కానీ విద్యార్థులు తమ ఇష్టం తో చదివి జర్నలిజం కోర్సును ఇఫ్లూ యూనివర్సిటీలో చేసేందుకు ఆసక్తి కనబరిస్తే ప్రోత్సహిం చా మని ప్రిన్సిపాల్ వివేకానంద పేర్కొన్నారు. ప్రభు త్వం ద్వారా పూర్తి వ్యయాన్ని భరించి చదివించేందుకు కార్యదర్శి అంగీకరించారన్నారు. గౌలిదొడ్డి ఐఐటీ కళాశాల ద్వారా గత ఏడాది నలుగురు ఐఐటీ సీట్లు, 15 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా 8 మంది విద్యార్థులు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి ఎంపికయ్యారని ఆయన తెలిపారు. -
బీఫ్ తిన్నందుకే..
హైదరాబాద్: గత డిసెంబర్ నెలలో ఉస్మానియాలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ పాల్లొన్న విద్యార్ధికి ఇంగ్లీష్ అండ్ ఫారీన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఎఫ్ఎల్ యూ) షాక్ ఇచ్చింది. జాలీస్ కొడూరు అనే విద్యార్థి యూనివర్సిటీలో అరబిక్ లాంగ్వేజ్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎమ్ఏ) పూర్తి చేశారు. యూనివర్సిటీలోనే పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకుని హాల్ టికెట్ కోసం వెళ్లగా తనపై గత డిసెంబర్ లో పోలీసు నమోదయిందని ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హత లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ లో పాల్లొన్న వారిలో 25 మంది ఈఎఫ్ఎల్ యూ విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొనకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కొంతమంది విద్యార్థుల ఆదేశాలను పాటించకుండా ఫెస్టివల్ పాల్గొన్నట్లు ఈ సందర్భంగా యూనివర్సిటీ తెలిపింది. విశ్వవిద్యాలయ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఆర్డినెన్స్ పాస్ చేసిందని ఈఎఫ్ఎల్ యూ ప్రొఫెసర్ ప్రకాష్ కోనా తెలిపారు. జలీస్ కు మాత్రమే కాకుండా శారీరక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న మరో విద్యార్ధికి, ఫేస్ బుక్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పై అభ్యంతరకరమైన పోస్టు చేసిన విద్యార్థికి కూడా యూనివర్సిటీ హాల్ టికెట్లను జారీ చేయలేదు. తన మీద కేసు నమోదయి ఇప్పటికి ఆరునెలలు కావొస్తోందనీ.. తాను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్లే వరకు యూనివర్సిటీ ఈ విషయం చెప్పలేదని జమీల్ వాపోయాడు. పోలీసు కేసు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. -
అంబేద్కర్ జయంతి రోజే దళిత విద్యార్థిపై వేటు
హైదరాబాద్: హెచ్‌సీయూ వివాదం ఇంకా ముగియకముందే హైదరాబాద్‌లో మరో యూనివర్సిటీ తీసుకున్న చర్య వివాదాస్పదమమైంది. స్థానిక ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన దళిత రీసెర్చ్ స్కాలర్ కునాల్ దుగ్గల్‌ను గురువారం విశ్వవిద్యాలయం నుంచి తొలగించారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలకు హాజరైనందుకే తనపై చర్య తీసుకున్నారని కునాల్ ఆరోపిస్తున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు నిరసనగా జరుగుతున్న ఉద్యమాల్లో పాలుపంచుకోవడం వల్లే అధికారులు తనను టార్గెట్ చేశారని విమర్శించారు. అంబేద్కర్ జయంతిలో తన పాట, ప్రసంగం పూర్తికాగానే సెక్యూరిటీ గార్డులు తనపై దౌర్జన్యం చేసి నెట్టివేశారని ఆరోపించారు. బలవంతంగా చీఫ్ సెక్యూరిటీ అధికారి దగ్గరికి లాక్కుపోయారన్నారు. క్యాంపస్‌లో తన ప్రవేశాన్ని నిషేధించినట్టు సదరు అధికారి తనకు చెప్పాడన్నారు. ఈ వ్యవహారంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కునాల్ కేసు నమోదు చేశారు. అటు విశ్వవిద్యాలయ సెక్యూరిటీ వర్గాలు కూడా విద్రోహ కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కునాల్‌పై ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. కునాల్ యూనివర్సిటీ విద్యార్థి కాదని తమకు ఫిర్యాదు అందిందని పోలీస్ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై స్పందించడానికి యూనివర్సిటీ అధికారులు అందుబాటులో లేరు. కాగా ఢిల్లీకి చెందిన కునాల్ "సమకాలీన పంజాబ్ లో కుల, మత రాజకీయాలు" అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. దళిత, ఆదివాసీ బహుజన, మైనారిటీ సంఘానికి సంబంధించిన కునాల్ దుగ్గల్, హెచ్‌సీయూలో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థుల తొలగింపునకు నిరసనగా జరిగిన ఉద్యమాల్లో చురకుగా పాల్గొన్నట్టు తెలుస్తోంది. -
ఇఫ్లూలో సంస్కృతం సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు
హైదరాబాద్: ఇఫ్లూ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు శనివారం పేర్కొన్నారు. 3 నెలలపాటు వారంలో మూడు రోజులు తరగతులు జరగనున్నట్లు తెలిపారు. రూ. 500 ఫీజు గల ఈ కోర్సు కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు వర్సిటీలో సంప్రదించాలని కోరారు. -
క్షమాపణలు చెప్పిన 'ఇఫ్లూ'
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని 'ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ' (ఇఫ్లూ)లో శనివారం వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణలో గందరగోళం చోటుచేసుకుంది. జరిగిన పొరపాట్లకు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... విదేశీ భాషలతోపాటు, వివిధ డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇఫ్లూ శనివారం పరీక్షలు నిర్వహించింది. అయితే పరీక్ష సమయాన్ని హాల్‌టిక్కెట్లలో తప్పుగా ముద్రించడంతోపాటు, ఎంఈడీ కోర్స్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రవేశ పరీక్ష రోజున ప్రకటించడం విద్యార్థుల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు 'కంపారిటివ్ లింగ్విస్టిక్స్ అండ్ ఇండియా స్టడీస్' పీజీ కోర్సు ప్రవేశ పరీక్ష జరుగుతుండగా... గంట తర్వాత వచ్చిన అధికారులు తప్పు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చామని, కనుక పరీక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ పరీక్షను తిరిగి సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన అధికారులు విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే రోజు పరీక్ష నిర్వహించటం, దేశ వ్యాప్తంగా ఉన్న 16 పరీక్షా కేంద్రాలను ఎనిమిదికి కుదించడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పైగా శ్రీరామనవమి రోజున పరీక్షలు నిర్వహించిన తీరును కూడా తప్పుబట్టారు. -
కేంద్ర సాయుధ బలగాల్లో 62 వేల పోస్టులు
ఇఫ్లూ అడ్మిషన్లు ఇఫ్లూ యూనివర్సిటీకి హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఈ మూడు క్యాంపస్‌లలో ఎక్కడైనా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ క్యాంపస్ బీఏ (ఆనర్స్)- ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్ బీఈడీ (ఇంగ్లిష్) ఎంఏ (ఇంగ్లిష్) ఎంఏ జేఎంసీ (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) ఎంఏ (కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్) ఎంఈడీ పీజీ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ పీహెచ్డీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియా స్టడీస్, ఇంగ్లిష్ లిటరేచర్, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్, ఎడ్యుకేషన్, అస్థెటిక్స్ అండ్ ఫిలాసఫీ, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్) ఎంఏ (హిందీ, అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్) లక్నో క్యాంపస్ బీఏ (ఆనర్స్)-ఇంగ్లిష్ ఎంఏ (ఇంగ్లిష్) పీజీడీటీఈ (ఇంగ్లిష్) షిల్లాంగ్ క్యాంపస్ బీఏ (ఆనర్స్) -ఇంగ్లిష్ బీఏ జేఎంసీ (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) ఎంఏ (ఇంగ్లిష్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) పీహెచ్డీ (లింగ్విస్టిక్స్)ప్రవేశం: దాదాపు అన్ని కోర్సుల్లో రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కొన్ని కోర్సులకు మాత్రం రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి రెండు కోర్సులకు మించి దరఖాస్తు చేసుకునే వీలు లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2015 దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: మార్చి 5, 2015. రాత పరీక్షలు నిర్వహించే తేదీ: మార్చి 28, 2015. వెబ్సైట్: www.efluniversity.ac.in -
'ఇఫ్లూ' రేప్ నిందితులకు వైద్య పరీక్షలు
హైదరాబాద్: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం శనివారం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల మొదట్లో ఇఫ్లూలో విద్యార్థినిపై ఆమె స్నేహితులు ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్నేహితులు నితిన్, రాజసింహలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీకి చెందిన బాధితురాలు ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ రెండవ సంవత్సరం చదువుతుంది. -
ఢిల్లీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: ఢిల్లీకి చెందిన విద్యార్థినిపై హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. తార్నాకలోని ‘ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)’ క్యాంపస్‌లో ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్న ఢిల్లీకి చెందిన విద్యార్థినిపై గత నెల 31న రాత్రి కొందరు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు ఆదివారం ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన సోమసముద్రం నితిన్ (21), పశ్చిమగోదావరి జిల్లా రాజోలుకు చెందిన రాజసింహా కుస్మలను(పూర్వ విద్యార్థి) అరెస్ట్ చేసినట్లు ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఇఫ్లూ క్యాంపస్‌లోని అమృతపీఠం ఇంటర్నేషనల్ వసతిగృహంలో ఉంటున్న పీజీ విద్యార్థిని తన స్నేహితుడిని కలుసుకునేందుకు గత నెల 31 రాత్రి బషీరా బాలుర హాస్టల్‌కు వచ్చింది. స్నేహితుని గదికి తాళం వేసి ఉండడంతో పక్క గది విద్యార్థులను వాకబు చేసింది. అప్పటికే మద్యం సేవిస్తున్న ఆ విద్యార్థులు... సదరు స్నేహితుడు లేడని, అభ్యంతరం లేకుంటే మద్యం తాగేందుకు రావచ్చని ఆమెను ఆహ్వానించారు. విద్యార్థిని వారితో కలిసి మద్యం సేవించింది. అనంతరం ముగ్గురు విద్యార్థులు సహకరించగా వురో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు ఉస్మానియా వర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయుడంతో నిర్భయ కేసు నమోదు (341, 376 సెక్షన్లు) చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం విద్యార్థినిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివారం ఇఫ్లూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రవేశద్వారం ఎదుట బైఠాయించారు. ఇఫ్లూలో జరుగుతున్న దుర్ఘటనలపై వీసీ ప్రొఫెసర్ సునయనసింగ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇఫ్లూ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన రాత్రే అశ్వన్ వివేక్ అనే కేరళ విద్యార్థి ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి కోమాలోకి వెళ్లాడు. ఈ సంఘటనకు, అత్యాచారం చేసిన నిందితులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇఫ్లూ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంలో ఏపీకి చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల కుమారులు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో నిందితులు? ఇఫ్లూ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను నవంబరు 1వ తేదీనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నితిన్ అనే విద్యార్థి, అతని స్నేహితులు ఆమెను తమ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పలువురు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఇఫ్లూ క్యాంటిన్ వద్ద విద్యార్థులు ఈ విషయమై పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుండగా మీడియా ప్రతినిధులు పసిగట్టి బహిర్గతం చేశారు. విద్యార్థుల అరెస్ట్ అంశం, వారి ఫొటోలు, తల్లిదండ్రుల వృత్తి తదితర అంశాలను పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన రాజసింహా తండ్రి సామాజిక కార్యకర్త కాగా, తల్లి హైకోర్టు న్యాయవాది అని సమాచారం. నేడు ఇఫ్లూ బంద్‌కు ఏబీవీపీ పిలుపు విద్యార్థినులపై అత్యాచారాలు, ఇతర లైంగిక వేధింపులను నిరసిస్తూ ఇఫ్లూ బంద్‌కు నేడు (3న) ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాలను అరికట్టాలని, హాస్టల్లో విద్యార్థినీ విద్యార్థులు ఒకరి గదుల్లోకి మరొకరు వెళ్లడాన్ని నిషేధించాలని, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టాలని ఏబీవీపీ నేత కడియం రాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఇఫ్లూ క్యాంపస్ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. -
ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
-
ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన ఓ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సహచర విద్యార్థులే తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్టోబర్ 31న ఇద్దరు సహచర విద్యార్థులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇఫ్లూ విద్యార్థులపై రస్టికేషన్ ను రద్దు చేయాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్ : ఇఫ్లూ విద్యార్థులైన మోహన్ ధరావత్, సతీష్ నయనాల, సుభాష్‌లపై విధించిన రస్టికేషన్‌ను తొలగించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడ్డ ఇఫ్లూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సునయన సింగ్‌ను తొలగించాలని, వర్సిటీల్లో రస్టికేషన్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో స్టూడెంట్స్ ఫోరం ఫర్ జస్టిస్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇఫ్లూ విద్యార్థులపై విధించిన రస్టికేషన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షులు వేదకుమార్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.గోవర్ధన్, టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ సుధాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించా రు. కోదండరామ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో రస్టికేషన్ వంటి చర్య అనేదే ఉండకూడదని, ఇలాంటి చర్యలు అప్రజాస్వామిక వాతావరణానికి దారి తీస్తాయని అన్నారు. ఇఫ్లూ విద్యార్థులపై రస్టికేషన్‌ను విధించడం సరైంది కాదన్నారు. ఒకవేళ ఘర్షణ లాంటి వాతావరణం చోటు చేసుకుంటే సమస్య పరిష్కారానికి అవసరమయ్యే విధంగా చర్చించాలే తప్ప విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోరాదని అన్నారు. యూనివర్సిటీలను అప్రజాస్వామిక వేదికలుగా మార్చరాదని, ఇలాంటి వాతావరణం యూనివర్సిటీల ఎదుగుదలకు దోహదపడదని అన్నారు. సమస్య పరిష్కా రం కాకుంటే ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని సూచించారు. రామయ్య మాట్లాడుతూ.. వర్సిటీల్లో నియంతృత్వ ధోరణులు కొనసాగడం సరైంది కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఆధిపత్య కూడళ్లను కొల్లగొట్టగల శక్తి విద్యార్థులకే ఉందని ఆయన అన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ.. ఇఫ్లూ సమస్యను సామాజిక సమస్యగా గుర్తించాలన్నారు. ఇఫ్లూ విద్యార్థులపై క్రమశిక్ష ణ చర్యలో భాగంగా రస్టికేషన్‌ను విధించడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఇఫ్లూ యూనివర్సి టీ వీసీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదకుమార్ మాట్లాడుతూ రెండు దినాల్లో సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కె.గోవర్దన్ మాట్లాడుతూ వీసీ హిట్లర్‌గా వ్యవహరిస్తున్నారని, నిరంకుశ పోకడలకు కారణమైన వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు. -
కరపత్రాలు పంచితే అరెస్టా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన అనుచరుల అక్రమాలు, అవినీతిపై కరపత్రాలు పంచినందుకు తన భర్త శ్రీరామ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసకు గురిచేశారంటూ ఇఫ్లూ విద్యార్థిని వి.స్వరూప దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కరపత్రాలు పంచితేనే అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. బాధితుడిని పోలీసులు నిజంగానే హింసించారా? అతని శరీరంపై గాయాలు ఉన్నాయా? ఉంటే వాటి తీవ్రత ఏమిటి? తదితర అంశాలను నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో నిమ్స్, అపోలో, కేర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉంటారు. విచారణ జరిపి మంగళవారం నాటికి నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ జిల్లా పోలీసుల నుంచి తన భర్త శ్రీరామ్‌కు ప్రాణహాని ఉందని, అండర్‌ట్రైల్ ఖైదీగా ఉన్న అతనికి తగిన భద్రత కల్పించడంతో పాటు సరైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించేలా అధికారులను ఆదేశించాలంటూ స్వరూప గురువారం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్‌పై జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం విచారించారు. శ్రీరామ్ ఇఫ్లూ ప్రాంగణం బయట ఉండగా, ఈ నెల 9న సివిల్ డ్రస్‌లో వచ్చిన కొందరు వ్యక్తులు బలవంతంగా తీసుకువెళ్లారని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ కోర్టుకు నివేదించారు. మంత్రిపైనే కరపత్రాలు పంచుతావా అంటూ విచారణ సమయంలో శ్రీరామ్‌ను పోలీసులు దారుణంగా హింసించారని తెలిపారు. మంత్రి ప్రోద్భలంతోనే పోలీసులు ఇలా చేస్తున్నారన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, బాధితుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తన ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి విచారణ ప్రారంభం కాగానే... శ్రీరామ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పత్రాలను ప్రభుత్వ సహాయ న్యాయవాది న్యాయమూర్తి ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. బాధితుడిని వెంటనే హైదరాబాద్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించాలని పోలీసులను ఆదేశించారు. -
మంత్రి శ్రీధర్‌బాబు నుంచి నా భర్తకు ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్: తన భర్త గడ్డం శ్రీరామ్‌కు మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ జిల్లా పోలీసుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఇఫ్లూ విద్యార్థిని వి.స్వరూప హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తపై పోలీసులు అక్రమ కేసు బనాయించి చిత్రహింసలకు గురి చేశారని, ప్రస్తుతం జైలులో ఉన్న తన భర్తకు తగిన భద్రత కల్పించడంతో పాటు సరైన వైద్యచికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆమె గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, గోదావరిఖని టూ టౌన్ ఎస్‌హెచ్‌వో, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్‌హెచ్‌వో, కరీంనగర్ ఎస్పీ, డీజీపీలతో పాటు మంత్రి శ్రీధర్‌బాబును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. -
విదేశీ భాషల వేదిక.. ఇఫ్లూ
‘ది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్’ కాలక్రమేణా ‘ద ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)’గా రూపాంతరం చెందింది.. సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఉన్న ఇఫ్లూ.. ఇంగ్లిష్‌తోపాటు మరెన్నో విదేశీ భాషా కోర్సులను అందిస్తోంది. 2014-15కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. దేశంలోనే తొలి భాషా కోర్సుల యూనివర్సిటీ.. ఇఫ్లూ. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక బోధన, పరిశోధన-బోధన అంశాల్లో విదేశీ వర్సిటీలతో ఒప్పందం కారణంగా ఇఫ్లూ కోర్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఇఫ్లూలోని సుమారు 900 సీట్లకు గతేడాది ఎనిమిది వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. కొత్తగా కేరళలో: ఇఫ్లూ యూనివర్సిటీకి ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు లక్నో, షిల్లాంగ్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా కేరళలోని మల్లాపూర్‌లో నూతన క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో తొలుత సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియెన్సీ (సీఓపీ) కోర్సులను మాత్రమే బోధించనున్నారు. ఈ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నాలుగు క్యాంపస్‌లలో ఎక్కడైనా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రశ్నపత్రంలో మార్పులు: రాత పరీక్ష ఆధారంగా ఇఫ్లూ ఆఫర్ చేసే కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. నిర్దేశించిన కోర్సులకు రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ ఏడాది నుంచి ప్రవేశ పరీక్ష విధానంలో కీలకమైన మార్పులు చేశారు. ఈసారి నుంచి ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీటికి జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. పరీక్ష విధానం, సంబంధిత వివరాలను 18603450112 (టోల్ ఫ్రీ నంబర్ 2ను ఎంపిక చేసుకోవాలి), 040-27689447/040-27070046 ఫోన్ నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. పెరుగుతున్న విదేశీ విద్యార్థులు: ఇఫ్లూలో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం రెండు వందల మందికి పైగా ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాదికి ఐదు వందల వరకు పెరిగే అవకాశాలున్నాయి. అయితే విదేశీ విద్యార్థులు ఎటువంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకాకుండానే నేరుగా అనుకున్న కోర్సులో అడ్మిషన్ పొందే సౌలభ్యం ఉంది. ఉపకారవేతనాలు: ఇఫ్లూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఎంచుకున్న కోర్సులను బట్టి ఉపకారవేతనాలు అందుబాటులో ఉన్నాయి. ఈబీసీ/ఫిజికల్లీ చాలెంజ్డ్ కేటగిరీ కింద విద్యార్థులకు నెలకు రూ. 1,000 స్టైపెండ్ లభిస్తుంది. వీరికి హాస్టల్ ఫీజు నుంచి కూడా మినహాయింపునిస్తారు. అంతేకాకుండా ఎంపిక చేసుకున్న కోర్సులాధారంగా యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (నెలకు రూ. 16,000), యూజీసీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (నెలకు రూ. 18,000), రాజీవ్ గాంధీ నేషనల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు), మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (మైనార్టీ విద్యార్థులకు), యూజీసీ టీచర్ ఫెలోషిప్, ఇందిరా గాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ (పీజీ విద్యార్థులకు), ర్యాంక్ హోల్డర్స్ స్కాలర్షిప్ (యూజీ) విద్యార్థులకు, స్కాలర్షిప్ ఫర్ పీజీడీటీఏ వంటి ఎన్నో స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. లభించే ఉద్యోగాలు: ఇఫ్లూ నుంచి కోర్సులు పూర్తి చేసిన వారికి దేశ, విదేశాల రాయబార (అంబాసిడర్) కార్యాలయాల్లో, విదేశీ బహుళజాతి కంపెనీలు, రష్యన్ ఆర్మీ, ప్రత్యేక ట్రాన్స్‌లేటర్ కాల్‌సెంటర్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కళాశాలల్లో అధ్యాపకులుగా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటున్నాయి. అంతేకాకుండా యూనివర్సిటీలోని ప్లేస్మెంట్ సెల్ ద్వారా అధిక శాతం విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. ఆఫర్ చేస్తున్న కోర్సులు: బీఏ (ఆనర్స్-ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్), బీసీజే, బీఈడీ (ఇంగ్లిష్). ఎంఈడీ, ఎంఏ (ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, జపనీస్, రష్యన్, స్పానిష్), ఎంసీజే, మాస్టర్స్ ఇన్ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్. పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ పీహెచ్డీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్స్, కంపేరిటివ్ లిటరేచర్, సోషల్ ఎక్స్‌క్లూజన్ స్టడీస్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఫిల్మ్ స్టడీస్, కల్చరల్ స్టడీస్, హిందీ, అరబిక్ లిటరేచర్), ఫ్రెంచ్ స్టడీస్, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్, రష్యన్ లిటరేచర్. నోటిఫికేషన్ సమాచారం దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి రెండు కోర్సులకు మించి దరఖాస్తు చేసుకునే వీలు లేదు. ఫీజు: రూ.350 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 150). ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 15, 2014 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జనవరి 16, 2014 దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: జనవరి 20, 2014 రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 21, 22, 23-2014. వెబ్సైట్: www.efluniversity.ac.in -సవలం ఉపేందర్, న్యూస్‌లైన్, ఓయూ, హైదరాబాద్. ఇఫ్లూ నిర్వహిస్తున్న ఇంగ్లిష్, విదేశీ భాషల కోర్సులకు ప్రతి సంవత్సరం ఆదరణ పెరుగుతోంది. ఖర్చు లేని విద్యను అందిస్తుండడం, కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడాన్ని దీనికి కారణంగా పేర్కొనవచ్చు. గతంతో పోల్చితే ఈసారి చాలా త్వరగా నోటిఫికేషన్ విడుదల చేశాం. గతేడాది అన్ని కోర్సులకు కలిపి దాదాపు 8,000 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది 10,000 దరఖాస్తులు అందే అవకాశం ఉంది. అందివస్తున్న అవకాశాల దృష్ట్యా ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా లాంగ్వేజెస్ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈసారి పరీక్ష విధానంలో పలు మార్పులు చేశాం. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నాం. ప్రొఫెసర్ సునయన సింగ్, వైస్ చాన్సలర్-ఇఫ్లూ. హెచ్‌సీయూలో ప్రవేశాలు దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) ఒకటి. ఇది 46 విభాగాల ద్వారా ఇంటిగ్రేటెడ్ నుంచి పీహెచ్డీ వరకు 150 కోర్సులను ఆఫర్ చేస్తోంది. 2014-15 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ప్రవేశ విధానం ఎంపిక చేసుకున్న కోర్సులను బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని కోర్సులకు రాత పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. మరికొన్ని కోర్సులకు రాతపరీక్షతోపాటు ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూలు ఉంటే రాత పరీక్షకు 75 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయిస్తారు (ఈ మార్కులు కోర్సును బట్టి కూడా మారుతుంటాయి). ఆబ్జెక్టివ్ విధానంలో: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు (ఎంఎస్సీ ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, హెల్త్ సైకాలజీ, పీజీ డిప్లొమా-కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ మినహా). పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. రాత పరీక్షలో పార్ట్-ఎ, పార్ట్-బి విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో 25 ప్రశ్నలు ఉంటాయి. వీటిని మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో రూపొందిస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కు కోత విధిస్తారు. పార్ట్-బి కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటుంది. ఇందులో 75 ప్రశ్నలు ఉంటాయి. ఎంపీఏ, ఎంఎఫ్ఏ, ఎంఏ కమ్యూనికేషన్, పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కమ్యూనికేషన్, థియేటర్ ఎడ్యుకేషన్ కోర్సులకు రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంఎస్సీ ఫిజిక్స్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్, ఎంబీఏ-హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, హెల్త్ సైకాలజీ, ఎంఫిల్, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్/పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/పీహెచ్డీ-బయోటెక్నాలజీ, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ పీహెచ్డీ కోర్సులకు మాత్రం రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంఫిల్, పీహెచ్డీ, ఎంటెక్‌లకు యూజీసీ-సీఎస్ఐఆర్ నెట్, ఆర్‌జీఎన్‌ఎఫ్/ఎంఏఎన్ఎఫ్, ఎన్బీహెచ్ఎం, ఐసీఎంఆర్, ఐసీఏఆర్ వంటి పరీక్షల్లో జేఆర్ఎఫ్ సాధించిన వారికి రాత పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు. వీరు ఇంటర్వ్యూకు మాత్రమే హాజరు కావాలి. ఎంసీఏ ప్రవేశ పరీక్షలో రీజనింగ్ నుంచి 25 మార్కులు, +2 స్థాయి మ్యాథమెటిక్స్ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎంఏ/ఎంఎస్సీ కోర్సుల కాల వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులను సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. 10 సెమిస్టర్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్ సబ్జెక్ట్‌లను వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఏ విభాగంలో హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు, హ్యుమానిటీస్ కింద తెలుగు, హిందీ, ఉర్దూ భాషా కోర్సులు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ కింద ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్సీ కోర్సులు: పీజీ విభాగంలో ఎంఎస్సీకి సంబంధించి మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ఏనిమల్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్స్, హెల్త్ సైకాలజీ కోర్సులు ఉన్నాయి. ఇందులోని బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం మాత్రం జేఎన్‌యూ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా కల్పిస్తారు. ఎంఏ కోర్సులు: ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, తెలుగు, అప్లైడ్ లింగ్విస్టిక్స్, కంపేరిటివ్ లిటరేచర్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, కమ్యూనికేషన్ (కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్, ప్రింట్ జర్నలిజం అండ్ న్యూమీడియా, టెలివిజన్ అండ్ రేడియో). ఇతర కోర్సులు: ఎంపీఏ డ్యాన్స్, ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఎఫ్ఏ, ఎంపీహెచ్ (మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్), అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్/పీహెచ్డీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీఏ, ఎంఎఫ్ఏ, ఎంఏ-కమ్యూనికేషన్, పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కమ్యూనికేషన్, థియేటర్ ఎడ్యుకేషన్ కోర్సులకు మాత్రం రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి మాత్రమే ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. మిగతా ఎంటెక్ కోర్సుల్లో కూడా గేట్ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్ ఉంటుంది. వీటిల్లో కొన్ని కోర్సులకు ఇంటర్వ్యూను కూడా నిర్వహిస్తారు. అర్హతలు: ఐఎంఎస్సీ/ఐఎంఏ: 60 శాతం మార్కులతో 10+2. ఎంఏ/ఎంఎస్సీ: నిర్దేశించిన మార్కులతో సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ. ఎంసీఏ: మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌గా 60 శాతం మార్కులతో డిగ్రీ. పీహెచ్డీ/ఎంఫిల్: సంబంధిత విభాగంలో పీజీ. అవగాహనకు పరీక్ష: రాత పరీక్షలో జ్ఞాపక శక్తి కంటే విద్యార్థుల అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఆయా సబ్జెక్ట్‌లలోని ప్రాథమిక భావనల ఆధారంగా ప్రశ్నలను రూపొందిస్తారు. ఇవి అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ఉంటాయి. కాబట్టి సంబంధిత కాన్సెప్ట్‌ను అవగాహన చేసుకుంటూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. డిగ్రీ స్థాయిలో అకడమిక్ పుస్తకాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దాన్నుంచి ఎన్ని రకాల ప్రశ్నలు అడగొచ్చో ఊహించి ప్రాక్టీస్ చేయాలి. కటాఫ్ తొలగింపు: ఈ ఏడాది నుంచి హెచ్‌సీయూ తీసుకున్న కీలక నిర్ణయం.. కటాఫ్ మార్కుల తొలగింపు. గతంలో ప్రవేశ పరీక్షల్లో కటాఫ్ మార్కులను నిర్దేశించేవారు. దీంతో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. ఈ కారణంగా దాదాపు 15 శాతం సీట్లు ఖాళీగా మిగిలి పోతున్నాయి. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మేరకు ఎన్ని కోర్సులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 3, 2014 రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 1-7, 2014 వివరాలకు: www.uohyd.ac.in -
ఒడిషా విద్యార్ధిని ఉషా ఆత్మహత్య
-
ఇఫ్లూలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లో బీఈడీ చదువుతున్న ఒడిశాకు చెందిన ఉషా సాహూ (22) అనే విద్యార్థిని సోమవారం రాత్రి 7.30 గంటలకు హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. హాస్టల్లో ఉషాసాహూ సహచర విద్యార్థినులు మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఉషాను కూడా రమ్మని ఆహ్వానించగా ఆమె తాను రాలేనని చెప్పి హాస్టల్లోనే ఉండిపోయినట్లు వారు తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి హాస్టల్‌కు వచ్చిన సహచర విద్యార్థినులకు.. గదిలో ఉషాసాహూ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. విద్యార్థులంతా కలిసి ఆమెను కిందకు దించి, చికిత్స కోసం వెంటనే నల్లకుంటలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇఫ్లూలో గత నాలుగేళ్లుగా ఆరుగురు విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాదిలోనే ఉషాసాహూతో కలిసి ముగ్గురు బలవన్మరణానికి గురయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన వర్సిటీ యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. అధ్యాపకుల వేధింపుల వల్లే..? ఇఫ్లూ అధికారుల తీరువల్లే విద్యార్థులు పిట్ట్టల్లా రాలి పోతున్నారని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నాలుగు నెలల కిందట బీఈడీ కోర్సులో చేరిన ఒడిశాకు చెందిన ఉషా ఎంతో చురుకైన విద్యార్థి అని వారు పేర్కొన్నారు. అధ్యాపకులు వివిధ కారణాలతో ఆమెను వేధించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని వారు ధ్వజమెత్తారు. అధ్యాపకుల వేధింపులు భరించలేక మూడేళ్ళ కిందట ఓ గిరిజన విద్యార్థిని సైతం ఆత్మహత్యకు యత్నించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు, అనవసరపు నిర్బంధాలు, ఎంత చదివినా ఫెయిల్ చేయడం లేదా మార్కులు తక్కువ వేయడం వల్ల మానసిక వేదనతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని శంకర్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఉషాసాహూ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల వేధింపులకు పాల్పడి, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.