![అంబేద్కర్ జయంతి రోజే దళిత విద్యార్థిపై వేటు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71460702201_625x300.jpg.webp?itok=fuZ6e9JN)
అంబేద్కర్ జయంతి రోజే దళిత విద్యార్థిపై వేటు
హైదరాబాద్: హెచ్‌సీయూ వివాదం ఇంకా ముగియకముందే హైదరాబాద్‌లో మరో యూనివర్సిటీ తీసుకున్న చర్య వివాదాస్పదమమైంది. స్థానిక ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన దళిత రీసెర్చ్ స్కాలర్ కునాల్ దుగ్గల్‌ను గురువారం విశ్వవిద్యాలయం నుంచి తొలగించారు.
అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలకు హాజరైనందుకే తనపై చర్య తీసుకున్నారని కునాల్ ఆరోపిస్తున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు నిరసనగా జరుగుతున్న ఉద్యమాల్లో పాలుపంచుకోవడం వల్లే అధికారులు తనను టార్గెట్ చేశారని విమర్శించారు. అంబేద్కర్ జయంతిలో తన పాట, ప్రసంగం పూర్తికాగానే సెక్యూరిటీ గార్డులు తనపై దౌర్జన్యం చేసి నెట్టివేశారని ఆరోపించారు. బలవంతంగా చీఫ్ సెక్యూరిటీ అధికారి దగ్గరికి లాక్కుపోయారన్నారు. క్యాంపస్‌లో తన ప్రవేశాన్ని నిషేధించినట్టు సదరు అధికారి తనకు చెప్పాడన్నారు. ఈ వ్యవహారంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కునాల్ కేసు నమోదు చేశారు.
అటు విశ్వవిద్యాలయ సెక్యూరిటీ వర్గాలు కూడా విద్రోహ కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కునాల్‌పై ఇదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కునాల్ యూనివర్సిటీ విద్యార్థి కాదని తమకు ఫిర్యాదు అందిందని పోలీస్ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై స్పందించడానికి యూనివర్సిటీ అధికారులు అందుబాటులో లేరు.
కాగా ఢిల్లీకి చెందిన కునాల్ "సమకాలీన పంజాబ్ లో కుల, మత రాజకీయాలు" అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. దళిత, ఆదివాసీ బహుజన, మైనారిటీ సంఘానికి సంబంధించిన కునాల్ దుగ్గల్, హెచ్‌సీయూలో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థుల తొలగింపునకు నిరసనగా జరిగిన ఉద్యమాల్లో చురకుగా పాల్గొన్నట్టు తెలుస్తోంది.