ఢిల్లీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: ఢిల్లీకి చెందిన విద్యార్థినిపై హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. తార్నాకలోని ‘ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)’ క్యాంపస్‌లో ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్న ఢిల్లీకి చెందిన విద్యార్థినిపై గత నెల 31న రాత్రి కొందరు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు ఆదివారం ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన సోమసముద్రం నితిన్ (21), పశ్చిమగోదావరి జిల్లా రాజోలుకు చెందిన రాజసింహా కుస్మలను(పూర్వ విద్యార్థి) అరెస్ట్ చేసినట్లు ఓయూ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఇఫ్లూ క్యాంపస్‌లోని అమృతపీఠం ఇంటర్నేషనల్ వసతిగృహంలో ఉంటున్న పీజీ విద్యార్థిని తన స్నేహితుడిని కలుసుకునేందుకు గత నెల 31 రాత్రి బషీరా బాలుర హాస్టల్‌కు వచ్చింది. స్నేహితుని గదికి తాళం వేసి ఉండడంతో పక్క గది విద్యార్థులను వాకబు చేసింది.
అప్పటికే మద్యం సేవిస్తున్న ఆ విద్యార్థులు... సదరు స్నేహితుడు లేడని, అభ్యంతరం లేకుంటే మద్యం తాగేందుకు రావచ్చని ఆమెను ఆహ్వానించారు. విద్యార్థిని వారితో కలిసి మద్యం సేవించింది. అనంతరం ముగ్గురు విద్యార్థులు సహకరించగా వురో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు ఉస్మానియా వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయుడంతో నిర్భయ కేసు నమోదు (341, 376 సెక్షన్లు) చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
చికిత్స నిమిత్తం విద్యార్థినిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివారం ఇఫ్లూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రవేశద్వారం ఎదుట బైఠాయించారు. ఇఫ్లూలో జరుగుతున్న దుర్ఘటనలపై వీసీ ప్రొఫెసర్ సునయనసింగ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇఫ్లూ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన రాత్రే అశ్వన్ వివేక్ అనే కేరళ విద్యార్థి ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి కోమాలోకి వెళ్లాడు. ఈ సంఘటనకు, అత్యాచారం చేసిన నిందితులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇఫ్లూ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంలో ఏపీకి చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల కుమారులు కూడా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో నిందితులు?
ఇఫ్లూ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను నవంబరు 1వ తేదీనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నితిన్ అనే విద్యార్థి, అతని స్నేహితులు ఆమెను తమ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పలువురు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఇఫ్లూ క్యాంటిన్ వద్ద విద్యార్థులు ఈ విషయమై పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుండగా మీడియా ప్రతినిధులు పసిగట్టి బహిర్గతం చేశారు. విద్యార్థుల అరెస్ట్ అంశం, వారి ఫొటోలు, తల్లిదండ్రుల వృత్తి తదితర అంశాలను పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన రాజసింహా తండ్రి సామాజిక కార్యకర్త కాగా, తల్లి హైకోర్టు న్యాయవాది అని సమాచారం.
నేడు ఇఫ్లూ బంద్‌కు ఏబీవీపీ పిలుపు
విద్యార్థినులపై అత్యాచారాలు, ఇతర లైంగిక వేధింపులను నిరసిస్తూ ఇఫ్లూ బంద్‌కు నేడు (3న) ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాలను అరికట్టాలని, హాస్టల్‌లో విద్యార్థినీ విద్యార్థులు ఒకరి గదుల్లోకి మరొకరు వెళ్లడాన్ని నిషేధించాలని, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టాలని ఏబీవీపీ నేత కడియం రాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఇఫ్లూ క్యాంపస్ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు.