Delhi student
-
నంబర్ ప్లేట్‌తో తంటా
న్యూఢిల్లీ: ఆమె ఫ్యాషన్ డిజైన్ చదువుతున్న విద్యార్థిని. ఢిల్లీలోని జనక్‌పురి నుంచి నోయిడాకు రోజూ వెళ్లి రావడం కష్టమవుతోందని... ‘నాన్నా నాకో స్కూటీ కొనిపెట్టవు’ అని తండ్రిని కోరింది. ముద్దుల కూతురి కోరిక తీరుస్తూ ‘దీపావళి’ కానుకగా స్కూటర్ కొనిపెట్టారాయన. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. తర్వాత బండి రిజిస్ట్రేషన్ పూర్తయి ‘నెంబరు రావడం’తో ఆమె బిక్కచచ్చిపోయింది. స్కూటీని బయటకు తీయాలంటేనే సిగ్గుతో చితికిపోతున్నానని, ఇరుగుపొరుగుతో, వీధుల్లో ఎగతాళికి గురవుతున్నానని, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వాపోతోంది. ఎందుకంటారా? నెంబరులో ఉన్న సిరీస్ తెచ్చిన తంటా ఇది. ఢిల్లీలోని వాహనాలకు నెంబరు కేటాయించేటపుడు మొదటి రెండు అక్షరాలు DL అని వస్తాయి. తర్వాత ఒక అంకె సంబంధిత జిల్లాను సూచిస్తుంది. ఆపై ఫోర్ వీలర్ అయితే ‘సి’ అక్షరం, టూ వీలర్ అయితే ‘ఎస్’ అక్షరం వస్తుంది. ఆపై వచ్చే రెండు ఆంగ్ల అక్షరాలు సిరీస్‌ను సూచిస్తాయి. ఈ అమ్మాయిది టూ వీలర్ కాబట్టి DL3 SEX (నాలుగు అంకెల నెంబర్) వచ్చింది. దాంతో బండిని బయటికి తీయాలంటేనే భయపడిపోతోంది. చివరకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. దీంతో ఆమెకు కేటాయించిన సిరీస్‌ను మార్చి కొత్త నెంబరును ఇవ్వాలని మహిళా కమిషన్ సంబంధిత ఆర్టీవోకు నోటీసు జారీచేసింది. -
చదువుపై దృష్టి పెట్టు: ఇంటర్ విద్యార్ధికి సుప్రీం సూచన
న్యూఢిల్లీ: రాజ్యాంగ పరిహారాలు కోరుతూ కోర్టులను ఆశ్రయించడం కన్నా చదువుపై దృష్టి పెట్టాలని ఒక విద్యారిని సుప్రీంకోర్టు సున్నితంగా మందలించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన 17ఏళ్ల ఇంటర్ విద్యార్ధి సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. అయితే పిల్లలు ఇలాంటి అంశాల్లో తలదూర్చడం మంచిది కాదని దీనిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగని ఈ పిల్‌ను తాము పబ్లిసిటీ స్టంటుగా పరిగణించడం లేదని, కానీ ఇది తమవద్దకు రావాల్సిన పిటిషన్ కాదని తెలిపింది. కావాలంటే సదరు విద్యార్ధి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. ‘‘మీ క్లయింట్‌ను చదువుపై శ్రద్ధ పెట్టమనండి. రాజ్యాంగ పరిహారాల్లాంటి అంశాల్లో తలదూర్చవద్దని సూచించండి. ఇదసలు ఎలాంటి అసందర్భ పిటిషనో మీరే గమనించండి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో మాదిరి పరిస్థితులున్నట్లు కేరళలో లేవు. పిల్లలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది’’ అని క్లయింట్ తరఫు న్యాయవాదికి సూచించింది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని బలవంతంగా పిల్లలను బడికి పంపమని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. ఇప్పుడిప్పుడే సెకండ్‌వేవ్ ప్రకంపనాలు తగ్గుతున్నాయని, మరో వేవ్ అవకాశాలు పెరిగాయని, మరోవైపు పిల్లలకు టీకాలు ఇంకా రాలే దని గుర్తు చేసింది. అందువల్ల ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు స్కూల్ ఓపెనింగ్ నిర్ణయాలు తీసుకుంటాయని, తాము బలవంతం గా ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్ ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తెలపడంతో ధర్మాసనం అంగీకరించింది. -
Electric Bike: ఆ పిల్లాడు చెప్పిన అబద్ధం.. అద్భుతాన్ని ఆవిష్కరించింది
అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ.. కాదేది ప్రయోగానికి అనర్హం అనే చందాన, ఓ కుర్రాడు పాత బైక్ స్క్రాప్‌తో ఏకంగా ఎలక్ట్రిక్ బైక్ తయారీ చేసి ఔరా అనిపించాడు. లాక్డౌన్ సమయాన్ని వృథా చేయకూడదనే అతని ఆలోచన.. ఇలా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ ఆవిష్కరణ కోసం ఆ కుర్రాడు.. తన తండ్రికి చెప్పిన ఒక్క అబద్ధం ఏమిటి? ఆ అబద్ధం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఇందుకోసం రాజన్ ఎలా కష్టపడ్డాడో ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీ సుభాష్ నగర్‌కు చెందిన రాజన్.. ఒక్కడే పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. అయితే ఈ బైక్ తయారీ వెనుక పెద్ద స్టోరీయే ఉందని కుర్రాడి తండ్రి దశరథ్ శర్మ చెబుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆటపాటలతో కాకుండా.. రాజన్ ఏదో ఒక ప్రయోగం చేయాలని అనుకున్నాడు. ప్రయోగంలో భాగంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మీద అతని దృష్టి పడింది. ముందు ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి పూనుకోగా.. అదికాస్త విఫలం అయ్యింది. ఆ ప్రయోగంలో రాజన్ గాయపడ్డాడు కూడా. దీంతో రాజన్‌ను తండ్రి అడ్డుకున్నారు. అయితే ఆ కుర్రాడికి ప్రయోగాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ ప్లాన్ వేశాడు. స్కూల్ ప్రాజెక్టు వంకతో.. స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలని టీచర్లు చెప్పినట్లు తండ్రికి అబద్ధం చెప్పాడు రాజన్. అది నిజమని భావించి.. స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ సాయంతో ఆ ‘అబద్ధపు’ ప్రాజెక్టు డబ్బులు సమకూర్చాడు దశరథ్. అటుపై మాయాపురి జంక్ మార్కెట్ నుంచి ఓ పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తెచ్చి ఇచ్చాడు. ఇక రాజన్ ఆ పాత బండిని ఎలక్ట్రికల్ బైక్‌గా మార్చే పనిలో పడ్డాడు. మూడు నెలల పాటు శ్రమించి ఎలక్ట్రిక్ బైక్‌కు ఒక రూపం తీసుకొచ్చాడు. ఈ ప్రయత్నంలో తండ్రి దశరథ్ రోజూ కొడుకును ప్రొత్సహించడం విశేషం. చివరికి తండ్రికి రాజన్ అసలు విషయం చెప్పడం.. కొడుకు సాధించిన ఘనత చూసి ఆ తండ్రి ఉప్పొంగిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ‘‘రాజన్ వయసు పదిహేనేళ్లు. టీచర్లు ఇలాంటి ప్రాజెక్టు ఇవ్వడం ఏంటి? వీడేం ఎలక్ట్రిక్ బైక్ తయారు చేస్తాడని నవ్వుకున్నా. కానీ, తీరా బైక్‌ను చూశాక నా కళ్లారా నేనే నమ్మలేకపోయా’ అంటున్నాడు దశరథ్. విశేషం ఏంటంటే.. గూగుల్, యూట్యూబ్‌లో చూసి ఈ ఈ-బైక్‌ను తయారు చేశాడు రాజన్. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలిగే ఈ ఈ-బైక్‌ను పరిశీలన పంపనున్నట్లు జిల్లా అధికారి సంత్ రామ్ చెప్తున్నారు. ఈ బైక్ తయారీ సఫలం కావడంతో రాజన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును తయారీపై ఫోకస్ పెట్టాడు. చదవండి: Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం! -
బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూనే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానికి చెందిన 16 ఏళ్ల ప్రియేష్ తయాల్ పోరాటపటిమ ఎవరికైనా స్ఫూర్తి కలిగించకమానదు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూనే ప్రియేష్ సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల్లో 96 శాతం మార్కులు సాధించడం విస్తుగొలుపుతోంది. పరీక్షల సమయంలోనూ ప్రియేష్ కీమోథెరఫీ కోసం ఆస్పత్రికి వెళుతూ ఓ వైపు చికిత్స పొందుతూ మరోవైపు పుస్తకాలనూ తిరగేశాడు. ఇంద్రప్రస్థ అపోలో ఆస్ప్రతి ఆంకాలజిస్ట్ డాక్టర్ మానస్ కల్రా ప్రియేష్ చికిత్స వివరాలను తెలుపుతూ..లుకేమియా రోగికి కనీసం రెండున్నర సంవత్సరాల పాటు చికిత్స అందించాలని, కీమోథెరఫీ కోసం ఆస్పత్రికి రావాలని చెప్పారు. వీటికితోడు రోగికి విపరీతమైన నొప్పులు, నిద్రలేమి బాధిస్తాయని అన్నారు. తన కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ సోకిందని తెలియగానే తాను నిలువెల్లా వణికిపోయానని, బోర్డు పరీక్షలపై ఆందోళన చెందానని ప్రియేష్ తల్లి చెప్పారు. అయితే ప్రియేష్ మాత్రం మొక్కవోని ధైర్యంతో పరిస్థితి ధైర్యంగా ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. 2017 డిసెంబర్లో బోర్డు పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ప్రియేష్ హై ఫీవర్‌తో బాధపడుతున్నాడని, శరీరంపై నీలం రంగు మచ్చలు వచ్చాయని చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షల్లో అతడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టు వెల్లడైందన్నారు. అప్పటినుంచి ప్రియేష్‌కు చికిత్స కొనసాగుతోంది. ఐఐటీలో చదువుతా.. తాను భవిష్యత్‌లో ఐఐటీలో చదివి ఇంజనీర్ పట్టా పొందుతానని ప్రియేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ను జయించి దేశంలో తనకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని ఉందని తన ఆకాంక్షను వెల్లడించారు. వీటన్నింటి కన్నా మంచి పౌరుడిగా ఉంటే చాలని అన్నారు. సీబీఎస్ఈ మంగళవారం వెల్లడించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 86.70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలురిపై బాలికలు పైచేయి సాధించారు. -
ఢిల్లీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: ఢిల్లీకి చెందిన విద్యార్థినిపై హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. తార్నాకలోని ‘ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)’ క్యాంపస్‌లో ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్న ఢిల్లీకి చెందిన విద్యార్థినిపై గత నెల 31న రాత్రి కొందరు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు ఆదివారం ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన సోమసముద్రం నితిన్ (21), పశ్చిమగోదావరి జిల్లా రాజోలుకు చెందిన రాజసింహా కుస్మలను(పూర్వ విద్యార్థి) అరెస్ట్ చేసినట్లు ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఇఫ్లూ క్యాంపస్‌లోని అమృతపీఠం ఇంటర్నేషనల్ వసతిగృహంలో ఉంటున్న పీజీ విద్యార్థిని తన స్నేహితుడిని కలుసుకునేందుకు గత నెల 31 రాత్రి బషీరా బాలుర హాస్టల్‌కు వచ్చింది. స్నేహితుని గదికి తాళం వేసి ఉండడంతో పక్క గది విద్యార్థులను వాకబు చేసింది. అప్పటికే మద్యం సేవిస్తున్న ఆ విద్యార్థులు... సదరు స్నేహితుడు లేడని, అభ్యంతరం లేకుంటే మద్యం తాగేందుకు రావచ్చని ఆమెను ఆహ్వానించారు. విద్యార్థిని వారితో కలిసి మద్యం సేవించింది. అనంతరం ముగ్గురు విద్యార్థులు సహకరించగా వురో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు ఉస్మానియా వర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయుడంతో నిర్భయ కేసు నమోదు (341, 376 సెక్షన్లు) చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం విద్యార్థినిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివారం ఇఫ్లూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రవేశద్వారం ఎదుట బైఠాయించారు. ఇఫ్లూలో జరుగుతున్న దుర్ఘటనలపై వీసీ ప్రొఫెసర్ సునయనసింగ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇఫ్లూ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన రాత్రే అశ్వన్ వివేక్ అనే కేరళ విద్యార్థి ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి కోమాలోకి వెళ్లాడు. ఈ సంఘటనకు, అత్యాచారం చేసిన నిందితులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇఫ్లూ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంలో ఏపీకి చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల కుమారులు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో నిందితులు? ఇఫ్లూ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను నవంబరు 1వ తేదీనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నితిన్ అనే విద్యార్థి, అతని స్నేహితులు ఆమెను తమ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పలువురు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఇఫ్లూ క్యాంటిన్ వద్ద విద్యార్థులు ఈ విషయమై పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుండగా మీడియా ప్రతినిధులు పసిగట్టి బహిర్గతం చేశారు. విద్యార్థుల అరెస్ట్ అంశం, వారి ఫొటోలు, తల్లిదండ్రుల వృత్తి తదితర అంశాలను పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన రాజసింహా తండ్రి సామాజిక కార్యకర్త కాగా, తల్లి హైకోర్టు న్యాయవాది అని సమాచారం. నేడు ఇఫ్లూ బంద్‌కు ఏబీవీపీ పిలుపు విద్యార్థినులపై అత్యాచారాలు, ఇతర లైంగిక వేధింపులను నిరసిస్తూ ఇఫ్లూ బంద్‌కు నేడు (3న) ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాలను అరికట్టాలని, హాస్టల్లో విద్యార్థినీ విద్యార్థులు ఒకరి గదుల్లోకి మరొకరు వెళ్లడాన్ని నిషేధించాలని, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టాలని ఏబీవీపీ నేత కడియం రాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఇఫ్లూ క్యాంపస్ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు.