న్యూఢిల్లీ: రాజ్యాంగ పరిహారాలు కోరుతూ కోర్టులను ఆశ్రయించడం కన్నా చదువుపై దృష్టి పెట్టాలని ఒక విద్యారిని సుప్రీంకోర్టు సున్నితంగా మందలించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన 17ఏళ్ల ఇంటర్ విద్యార్ధి సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. అయితే పిల్లలు ఇలాంటి అంశాల్లో తలదూర్చడం మంచిది కాదని దీనిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగని ఈ పిల్‌ను తాము పబ్లిసిటీ స్టంటుగా పరిగణించడం లేదని, కానీ ఇది తమవద్దకు రావాల్సిన పిటిషన్ కాదని తెలిపింది. కావాలంటే సదరు విద్యార్ధి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది.
‘‘మీ క్లయింట్‌ను చదువుపై శ్రద్ధ పెట్టమనండి. రాజ్యాంగ పరిహారాల్లాంటి అంశాల్లో తలదూర్చవద్దని సూచించండి. ఇదసలు ఎలాంటి అసందర్భ పిటిషనో మీరే గమనించండి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో మాదిరి పరిస్థితులున్నట్లు కేరళలో లేవు. పిల్లలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది’’ అని క్లయింట్ తరఫు న్యాయవాదికి సూచించింది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని బలవంతంగా పిల్లలను బడికి పంపమని ఆదేశించలేమని తేల్చిచెప్పింది.
ఇప్పుడిప్పుడే సెకండ్‌వేవ్ ప్రకంపనాలు తగ్గుతున్నాయని, మరో వేవ్ అవకాశాలు పెరిగాయని, మరోవైపు పిల్లలకు టీకాలు ఇంకా రాలే దని గుర్తు చేసింది. అందువల్ల ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు స్కూల్ ఓపెనింగ్ నిర్ణయాలు తీసుకుంటాయని, తాము బలవంతం గా ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్ ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తెలపడంతో ధర్మాసనం అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment