బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతూ సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలో 96 శాతం మార్కులు సాధించిన ఢిల్లీ విద్యార్థి
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానికి చెందిన 16 ఏళ్ల ప్రియేష్ తయాల్ పోరాటపటిమ ఎవరికైనా స్ఫూర్తి కలిగించకమానదు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూనే ప్రియేష్ సీబీఎస్‌ఈ పదవ తరగతి పరీక్షల్లో 96 శాతం మార్కులు సాధించడం విస్తుగొలుపుతోంది. పరీక్షల సమయంలోనూ ప్రియేష్ కీమోథెరఫీ కోసం ఆస్పత్రికి వెళుతూ ఓ వైపు చికిత్స పొందుతూ మరోవైపు పుస్తకాలనూ తిరగేశాడు. ఇంద్రప్రస్థ అపోలో ఆస్ప్రతి ఆంకాలజిస్ట్ డాక్టర్ మానస్ కల్రా ప్రియేష్ చికిత్స వివరాలను తెలుపుతూ..లుకేమియా రోగికి కనీసం రెండున్నర సంవత్సరాల పాటు చికిత్స అందించాలని, కీమోథెరఫీ కోసం ఆస్పత్రికి రావాలని చెప్పారు. వీటికితోడు రోగికి విపరీతమైన నొప్పులు, నిద్రలేమి బాధిస్తాయని అన్నారు.
తన కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ సోకిందని తెలియగానే తాను నిలువెల్లా వణికిపోయానని, బోర్డు పరీక్షలపై ఆందోళన చెందానని ప్రియేష్ తల్లి చెప్పారు. అయితే ప్రియేష్ మాత్రం మొక్కవోని ధైర్యంతో పరిస్థితి ధైర్యంగా ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. 2017 డిసెంబర్‌లో బోర్డు పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ప్రియేష్ హై ఫీవర్‌తో బాధపడుతున్నాడని, శరీరంపై నీలం రంగు మచ్చలు వచ్చాయని చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షల్లో అతడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టు వెల్లడైందన్నారు. అప్పటినుంచి ప్రియేష్‌కు చికిత్స కొనసాగుతోంది.
ఐఐటీలో చదువుతా..
తాను భవిష్యత్‌లో ఐఐటీలో చదివి ఇంజనీర్ పట్టా పొందుతానని ప్రియేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ను జయించి దేశంలో తనకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని ఉందని తన ఆకాంక్షను వెల్లడించారు. వీటన్నింటి కన్నా మంచి పౌరుడిగా ఉంటే చాలని అన్నారు. సీబీఎస్‌ఈ మంగళవారం వెల్లడించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 86.70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలురిపై బాలికలు పైచేయి సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment