న్యూఢిల్లీ: ఆమె ఫ్యాషన్ డిజైన్ చదువుతున్న విద్యార్థిని. ఢిల్లీలోని జనక్‌పురి నుంచి నోయిడాకు రోజూ వెళ్లి రావడం కష్టమవుతోందని... ‘నాన్నా నాకో స్కూటీ కొనిపెట్టవు’ అని తండ్రిని కోరింది. ముద్దుల కూతురి కోరిక తీరుస్తూ ‘దీపావళి’ కానుకగా స్కూటర్ కొనిపెట్టారాయన. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. తర్వాత బండి రిజిస్ట్రేషన్ పూర్తయి ‘నెంబరు రావడం’తో ఆమె బిక్కచచ్చిపోయింది. స్కూటీని బయటకు తీయాలంటేనే సిగ్గుతో చితికిపోతున్నానని, ఇరుగుపొరుగుతో, వీధుల్లో ఎగతాళికి గురవుతున్నానని, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వాపోతోంది.
ఎందుకంటారా? నెంబరులో ఉన్న సిరీస్ తెచ్చిన తంటా ఇది. ఢిల్లీలోని వాహనాలకు నెంబరు కేటాయించేటపుడు మొదటి రెండు అక్షరాలు DL అని వస్తాయి. తర్వాత ఒక అంకె సంబంధిత జిల్లాను సూచిస్తుంది. ఆపై ఫోర్ వీలర్ అయితే ‘సి’ అక్షరం, టూ వీలర్ అయితే ‘ఎస్’ అక్షరం వస్తుంది. ఆపై వచ్చే రెండు ఆంగ్ల అక్షరాలు సిరీస్‌ను సూచిస్తాయి. ఈ అమ్మాయిది టూ వీలర్ కాబట్టి DL3 SEX (నాలుగు అంకెల నెంబర్) వచ్చింది. దాంతో బండిని బయటికి తీయాలంటేనే భయపడిపోతోంది. చివరకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. దీంతో ఆమెకు కేటాయించిన సిరీస్‌ను మార్చి కొత్త నెంబరును ఇవ్వాలని మహిళా కమిషన్ సంబంధిత ఆర్టీవోకు నోటీసు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment