ఇఫ్లూలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లో బీఈడీ చదువుతున్న ఒడిశాకు చెందిన ఉషా సాహూ (22) అనే విద్యార్థిని సోమవారం రాత్రి 7.30 గంటలకు హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది.
హాస్టల్‌లో ఉషాసాహూ సహచర విద్యార్థినులు మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఉషాను కూడా రమ్మని ఆహ్వానించగా ఆమె తాను రాలేనని చెప్పి హాస్టల్‌లోనే ఉండిపోయినట్లు వారు తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి హాస్టల్‌కు వచ్చిన సహచర విద్యార్థినులకు.. గదిలో ఉషాసాహూ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. విద్యార్థులంతా కలిసి ఆమెను కిందకు దించి, చికిత్స కోసం వెంటనే నల్లకుంటలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇఫ్లూలో గత నాలుగేళ్లుగా ఆరుగురు విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాదిలోనే ఉషాసాహూతో కలిసి ముగ్గురు బలవన్మరణానికి గురయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన వర్సిటీ యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు.
అధ్యాపకుల వేధింపుల వల్లే..?
ఇఫ్లూ అధికారుల తీరువల్లే విద్యార్థులు పిట్ట్టల్లా రాలి పోతున్నారని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నాలుగు నెలల కిందట బీఈడీ కోర్సులో చేరిన ఒడిశాకు చెందిన ఉషా ఎంతో చురుకైన విద్యార్థి అని వారు పేర్కొన్నారు. అధ్యాపకులు వివిధ కారణాలతో ఆమెను వేధించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని వారు ధ్వజమెత్తారు. అధ్యాపకుల వేధింపులు భరించలేక మూడేళ్ళ కిందట ఓ గిరిజన విద్యార్థిని సైతం ఆత్మహత్యకు యత్నించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు, అనవసరపు నిర్బంధాలు, ఎంత చదివినా ఫెయిల్ చేయడం లేదా మార్కులు తక్కువ వేయడం వల్ల మానసిక వేదనతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని శంకర్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఉషాసాహూ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల వేధింపులకు పాల్పడి, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.