విద్యార్థులతో ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ
‘బాత్‌రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ - ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేధావులు.. ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌరహక్కుల నేతలపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వరవరరావు అల్లుడు, ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) ప్రొఫెసర్ సత్యనారాయణ.. తన ఇంట్లో సోదాలు చేసిన సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
అది అరెస్టు వారెంటు కాదు..
మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు పవన, అల్లుడు సత్యనారాయణ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ విషయం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ... వరవరరావుకు అల్లుడినైన నేరానికే పోలీసులు తన పట్ల ఈ విధంగా ప్రవర్తించారేమో అంటూ సోదాలు నిర్వహించిన తీరును మీడియాకు వివరించారు.
‘ ఆరోజు(మంగళవారం) ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో.. సుమారు 20 మంది పోలీసులు (10 మంది మహారాష్ట్ర, 10 మంది తెలంగాణ పోలీసులు)ఇఫ్లూ స్టాఫ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మరాఠీ భాషలో ఉన్న ఓ కాగితాన్ని సర్చ్ వారెంట్ అంటూ నా చేతిలో పెట్టి ఇంట్లోకి వచ్చి, సోదాలు మొదలుపెట్టారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక‌్షన్ కట్ చేశారు. మా దగ్గర ఉన్న మొబైల్స్, ల్యాప్‌టాప్స్ తీసేసుకున్నారు. ఈ- మెయిల్ ఐడీలు బ్లాక్ చేశారు. అయితే పోలీసులు నాకు ఇచ్చింది సెర్చ్ వారెంట్ కాదని, ఓ పోలీసు ఉన్నతాధికారి రాసి ఇచ్చిన స్టేట్‌మెంట్ అని తర్వాత తెలిసిందని’ సత్యనారాయణ చెప్పారు.
బాత్‌రూం డోర్ తెరచి ఉంచాలంటూ..
‘బ్రష్ చేసుకునేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బాత్‌రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ అంటూ తన భార్య పవనను మనోవేదనకు గురిచేశారని సత్యనారాయణ ఆరోపించారు.
ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క మచ్చ కూడా లేదు..
30 ఏళ్ల సర్వీసులో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కేవలం వరవరరావు అల్లుడనే ఒకే ఒక్క కారణం చేత తనను టార్గెట్ చేశారని విమర్శించారు. తనలాంటి అమాయకుల మీద లేనిపోని నిందలు మోపి, గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుంటే ఏ కోర్టులకు కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు మేధావి అవ్వాలని ఎందుకు అనుకున్నావ్. నీ గదిలో అంబేద్కర్, ఫూలే దంపతుల ఫొటోలు ఎందుకున్నాయి. ప్రొఫెసర్‌గా సంపాదిస్తున్నది సరిపోవడం లేదా? మావో సాహిత్యం ఎందుకు చదువుతున్నావ్? వేరే పనులేమీ లేవా అంటూ ఒక ఉగ్రవాదిని ప్రశ్నించినట్లు తనను కూడా ప్రశ్నించారంటూ’ పోలీసుల తీరుపై సత్యనారాయణ మండిపడ్డారు.
ఈ ఘటనతో క్యాంపస్ అంతా ఉలిక్కి పడింది.
సత్యనారాయణ ఇంట్లో సోదాలు జరపటానికి పోలీసులు రావడంతో క్యాంపస్‌లోని విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారని ఇఫ్లూ ప్రొఫెసర్ సుజాత ముకిరి అన్నారు. సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment