హైదరాబాద్ : హైదరాబాద్లోని 'ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ' (ఇఫ్లూ)లో శనివారం వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణలో గందరగోళం చోటుచేసుకుంది. జరిగిన పొరపాట్లకు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... విదేశీ భాషలతోపాటు, వివిధ డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇఫ్లూ శనివారం పరీక్షలు నిర్వహించింది. అయితే పరీక్ష సమయాన్ని హాల్‌టిక్కెట్లలో తప్పుగా ముద్రించడంతోపాటు, ఎంఈడీ కోర్స్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రవేశ పరీక్ష రోజున ప్రకటించడం విద్యార్థుల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు 'కంపారిటివ్ లింగ్విస్టిక్స్ అండ్ ఇండియా స్టడీస్' పీజీ కోర్సు ప్రవేశ పరీక్ష జరుగుతుండగా... గంట తర్వాత వచ్చిన అధికారులు తప్పు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చామని, కనుక పరీక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ పరీక్షను తిరిగి సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన అధికారులు విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే రోజు పరీక్ష నిర్వహించటం, దేశ వ్యాప్తంగా ఉన్న 16 పరీక్షా కేంద్రాలను ఎనిమిదికి కుదించడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పైగా శ్రీరామనవమి రోజున పరీక్షలు నిర్వహించిన తీరును కూడా తప్పుబట్టారు.
క్షమాపణలు చెప్పిన 'ఇఫ్లూ'
Published Sun, Mar 29 2015 8:41 AM | Last Updated on Thu, Jul 11 2019 6:23 PM
Advertisement