సాక్షి, హైదరాబాద్: తన భర్త గడ్డం శ్రీరామ్‌కు మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ జిల్లా పోలీసుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఇఫ్లూ విద్యార్థిని వి.స్వరూప హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తపై పోలీసులు అక్రమ కేసు బనాయించి చిత్రహింసలకు గురి చేశారని, ప్రస్తుతం జైలులో ఉన్న తన భర్తకు తగిన భద్రత కల్పించడంతో పాటు సరైన వైద్యచికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆమె గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, గోదావరిఖని టూ టౌన్ ఎస్‌హెచ్‌వో, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్‌హెచ్‌వో, కరీంనగర్ ఎస్‌పీ, డీజీపీలతో పాటు మంత్రి శ్రీధర్‌బాబును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు.