సాక్షి, అమరావతి: సహకార బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ఆప్కాబ్ కృషి చేస్తోంది. పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్థిక చేయూత అందిస్తోంది. ఈ నెల 4వ తేదీన జరగనున్న వజ్రోత్సవ వేడుకలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
రూ.లక్ష కోట్ల వ్యాపారం
1963 ఆగస్టు 4న ఏర్పడిన ఆప్కాబ్ 1966లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి షెడ్యూల్డ్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. దీని పరిధిలో 18 శాఖలు ఉండగా.. ఆప్కాబ్ పర్యవేక్షణలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల పరిధిలో 425 బ్రాంచ్‌లు, 1,995 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఆప్కాబ్ ఆధునిక సాంకేతికతను సంతరించుకుంది.
డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కూడా కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2018–19 నాటికి రూ.13,322 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ఉన్న ఆప్కాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో ఏకంగా రూ.36,732 కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించింది. రూ.251 కోట్ల లాభాలను ఆర్జించింది. సహకార వ్యవస్థ ద్వారా దేశంలోనే తొలిసారి రూ.లక్ష కోట్ల వ్యాపారంతో గ్రామీణ సహకార వ్యవస్థలో స్వర్ణయుగానికి నాంది పలికింది.
నాలుగేళ్లలో వరుసగా రెండు సార్లు నాఫ్‌స్కాబ్ ద్వారా జాతీయ స్థాయిలో నంబర్–1 సహకార బ్యాంక్‌గా గుర్తింపు పొందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఇండియాలోనే బెస్ట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌గా ఆప్కాబ్ బీఎఫ్‌ఎస్‌ఐ ద్వారా అవార్డు అందుకుంది. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బ్యాంక్ నూతన లోగో, పోస్టల్ స్టాంప్‌తో పాటు విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనుంది.
రైతు సేవలో 60 ఏళ్లు
ఆప్కాబ్ రైతుల సేవలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బ్యాంక్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులకు అభినందనలు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సహకార రంగం సీఏం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో బలోపేతమైంది. రికార్డుస్థాయి వ్యాపారంతో నష్టాల నుంచి గట్టెక్కి లాభాలను ఆర్జిస్తోంది.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment