సాక్షి అమరావతి: సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆప్కాబ్‌ను నిలబెట్టిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైద్యనాధన్ సిఫార్సులను ఆమోదించి సహకార పరపతి వ్యవస్థ బలోపేతం కోసం రూ.1,850 కోట్లు ఇచ్చిన తొలి రాష్ట్రంగా ఉమ్మడి ఏపీకి వైఎస్సార్ గుర్తింపు తెచ్చారని చెప్పారు.
ఆప్కాబ్ (ద ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్) ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆప్కాబ్ నూతన లోగో, ఆప్కాబ్ బ్రాండ్ ఐడెంటిటీ గైడ్‌లైన్స్ (బీఐజీ) బిగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. డీసీసీబీలకు రూ.55.93 కోట్ల డివిడెండ్‌ను పంపిణీ చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన డీసీసీబీలు, పీఏసీఎస్, బ్రాంచ్‌లు, ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...
ఆ ఒక్క మార్పుతో..
ఆప్కాబ్ షష్టి పూర్తి సందర్భంగా సహకార రంగ చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. రైతులకు అండగా నిలుస్తూ బ్యాంకింగ్ సేవలతో ఆప్కాబ్ 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన పరిస్థితి చూస్తే చాలా గొప్పగా ఉంది. బ్యాంకును ఈ స్థాయికి తెచ్చేందుకు కృషి చేసిన యాజమాన్యానికి, బ్యాంకు కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.
మన దేశంలో రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే పెరుగుతాడు.. అప్పుల్లోనే చనిపోతారని ఒకప్పుడు నానుడి ఉండేది. దీనికి కారణం విత్తనం నుంచి పంట కోత వరకు అన్నింటికీ పెట్టుబడి అవసరం. అందుకోసం రైతన్నలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక రైతన్నలు అవస్థలు పడుతున్న పరిస్థితుల వల్ల ఈ నానుడి వచ్చింది. అప్పుడు.. విప్లవంలా ఒక మార్పు జరిగింది.
అదేమిటంటే.. ఎప్పుడైతే రైతులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ అడుగులు వేసిందో అప్పుడు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతన్నలు నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పును మరింత ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్రంలో ఆప్కాబ్ అనే కోపరేటివ్ బ్యాంకు వచ్చింది. ఒక చారిత్రక అవసరంతో ఏర్పడ్డ ఈ బ్యాంకు రైతన్నలను చేయి పట్టుకుని నడిపించింది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందికర పరిస్థితులను చవి చూసింది.
సహకార చట్ట సవరణ.. ఆర్థిక చేయూత
ఆప్కాబ్‌ను మెరుగైన స్థితికి చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసే బాధ్యతను 2019 అక్టోబర్‌లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్విస్ నాబ్‌కాన్స్‌కు అప్పగించాం. వారు ప్రతి బ్యాంకుకూ వెళ్లి ఏడాది పాటు క్షుణ్నంగా అధ్యయనం అనంతరం కొన్ని సూచనలు, సలహాలు అందించారు. వాటిని పరిగణలోకి తీసుకుంటూ సహకార సంఘాలు, రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 సహకార చట్టాన్ని సవరించాం.
కో ఆపరేటివ్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో ప్రొఫెషనల్స్ ఉండేలా చర్యలు చేపట్టాం. దీనివల్ల పారదర్శకత, సామర్థ్యం పెరుగుతుంది. ప్రొఫెషనల్స్ డైరెక్టర్లుగా బ్యాంకుల్లో బాధ్యతలు తీసుకోవడంతో రాజకీయ కార్యకలాపాలు తగ్గే పరిస్థితి వచ్చింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ డీసీసీబీ సీఈవోల ఎంపిక కోసం రాష్ట్రస్థాయిలో కామన్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేశాం.
దాని ద్వారా సీఈవోల ఎంపిక, నియామకం చేపట్టడం ద్వారా మరింత ప్రొఫెషనలిజం తెచ్చాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీలకు, ఆప్కాబ్‌కు గతేడాది రూ.295 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఆర్థ్ధిక చేయూతనిచ్చాం. ఇవన్నీ ఆప్కాబ్‌ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడ్డాయి.
పెరిగిన పరపతి.. లాభాల బాట
సహకార వ్యవస్థలో పారదర్శక, సమర్థతను పెంపొందించేందుకు కంప్యూటరైజేషన్ తీసుకొచ్చాం. టీసీఎస్ సహకారంతో కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సహకార పరపతి సంఘాల వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది. 2019 నుంచి నాలుగేళ్ల వ్యవధిలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం.
ఆప్కాబ్ లావాదేవీలు గణనీయంగా విస్తరించాయి. 2019 మార్చి 31 నాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపైన పరిస్థితి కనిపిస్తోంది. 2019లో రూ.13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్ పరపతి 2023 మార్చి నాటికి ఏకంగా రూ.36,700 కోట్లకు పెరిగింది. అంటే మూడు రెట్లు పెరిగింది.
గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా మిగతా డీసీసీబీలన్నీ లాభాల్లో నడుస్తున్నాయని చెప్పేందుకు గర్వపడుతున్నా. అంతేకాదు.. 36 ఏళ్ల తర్వాత కర్నూలు డీసీసీబీ, 28 ఏళ్ల తర్వాత వైఎస్సార్ కడప జిల్లా డీసీసీబీలు లాభాల్లోకి వచ్చిన పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. గొప్పగా అడుగులు వేసిన సిబ్బంది, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.
డిజిటలైజేషన్ పూర్తి కావడం ద్వారా ఆప్కాబ్, డీసీసీబీలు మరింత బలోపేతమై ఈరోజు మనం చూస్తున్న మార్పులే కాకుండా ఇంకా మెరుగైన ఫలితాలు రానున్న రోజుల్లో కనిపిస్తాయి. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించాం. కంప్యూటరైజేషన్ పనులు వేగంగా జరుగు తున్నాయి. రాబోయే రోజుల్లో ఆప్కాబ్ సేవలు రైతులందరికీ విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆర్బీకేల స్థాయిలో అన్నీ..
ఇవాళ సాగైన ప్రతి పంటను నమోదు చేసేందుకు ఆర్బీకేల స్థాయిలో ఈ – క్రాపింగ్ జరుగుతోంది. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ తీసుకొచ్చాం. రైతులు గ్రూప్‌గా ఏర్పడి పది శాతం చెల్లిస్తే చాలు 40 శాతం బ్యాంకు రుణాలు, 50 శాతం సబ్సిడీగా ఇస్తూ తోడుగా నిలుస్తున్నాం. ఆర్బీకే స్థాయిలోనే అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. వీటి కోసం ఆప్కాబ్ రూ.500 కోట్లు రుణాలు మంజూరు చేసింది.
ప్రభుత్వ సహకారం ప్రశంసనీయం: జేపీ
ఆప్కాబ్ మాజీ ఎండీ, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ తాను ఆప్కాబ్ ఎండీగా ఉన్నప్పుడు సహకార రంగంలో సంస్కరణలు తేవాలని ప్రయతి్నంచానని, కానీ అప్పటి ప్రభుత్వాలు సహకరించలేదన్నారు. నాడు కేవలం 8 శాతానికి మించి రికవరీ చేయలేకపోయేవాళ్లమని, నేడు 80 శాతానికి పైగా రికవరీ సాధిస్తున్నారని చెప్పారు. సహకార వ్యవస్థ బలంగా ఉండాలన్న ఆకాంక్షతో ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు నిజంగా ప్రశంసనీయమని అన్నారు.
హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.
మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఆప్కాబ్ చైర్‌పర్సన్ మల్లెల ఝాన్సీ, నాఫ్‌స్కాబ్ ఎండీ బీమా సుబ్రహ్మణ్యం, నాబార్డు సీజీఎం ఆర్‌ఎం గోపాల్, సహకార మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సహకార శాఖ రిజిస్ట్రార్ అహ్మద్‌బాబు, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ, 13 జిల్లాల డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తొలిసారిగా డీసీసీబీలకు డివిడెండ్
‘‘రాష్ట్రంలో సహకార విప్లవంతో బ్యాంకింగ్ వ్యవస్థ రైతన్నలకు చేరువగా అడుగులు వేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో సహకార రంగం బలోపేతమై ఆధునికీకరణ సంతరించుకుంటోంది. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తూ అన్నదాతలకు చేదోడుగా నిలుస్తోంది’’ ‘‘బ్యాంక్ చరిత్రలో తొలిసారిగా డీసీసీబీలకు డివిడెండ్ ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో జరుగుతున్నందుకు గర్వంగా ఉంది. ఆప్కాబ్ ఇంకా గొప్పగా ఎదిగి రైతన్నలకు మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’’ – సీఎం వైఎస్ జగన్
ఆర్బీకేలతో పీఏసీఎస్‌ల అనుసంధానం..
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో (పీఏసీఎస్) అనుసంధానం చేయడంతో మరో గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆ తర్వాత డీసీసీబీలతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతోంది.
మిగతా బ్యాంకుల సహకారంతో ఈరోజు ప్రతి ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అందుబాటులోకి తెచ్చాం. కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఆర్బీకేలతో ‘ప్యాక్స్’ అనుసంధానం.. ఇవన్నీ గ్రామ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు నిదర్శనంగా నిలుస్తాయి. తద్వారా రైతులకు ఆర్బీకేల వద్దే వ్యవసాయ ఇన్‌పుట్స్‌తో పాటు రుణ పరపతి పొందే పరిస్థితి కూడా వస్తుందని గట్టిగా చెబుతున్నా.
రైతు.. గ్రామం బాగుండాలంటే
రైతు, గ్రామం రెండూ బాగుండాలంటే వ్యవసాయంతో పాటు ఆర్థిక స్వావలంబనపై ఆధారపడి ఉంటుంది. మన రైతన్నలు, అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగగలిగితే గ్రామీణ వ్యవస్థ బతుకుతుంది. ఇలా అక్కచెల్లెమ్మలకు మంచి చేసే గొప్ప అడుగు ఆప్కాబ్ ద్వారా పడింది. పాడి, పంట సమృద్ధిగా పెరిగాయి.
మనం అందచేస్తున్న వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ వీటన్నింటిని బ్యాంకులతో అనుసంధానించి ఆ డబ్బులను సరైన పద్ధతిలో వాడుకోవడం, అమూల్ లాంటి సంస్థ గ్రామ స్థాయిలోకి రావడం ద్వారా రైతన్నలు, అక్కచెల్లెమ్మలు మోసపోకుండా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
గతంలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తున్న పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆప్కాబ్ అన్ని రంగాల్లో విస్తరించడంతో గ్రామస్థాయిలో రుణాలు ఇప్పించగలిగే స్థితిలోకి వచ్చింది.
దేశంలోనే భారీ నెట్‌వర్క్
ఆప్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్‌తో అనుసంధానమైన ఆర్బీకేలు.. ఇలాంటి పంపిణీ వ్యవస్థ బహుశా దేశ చరిత్రలో ఏ బ్యాంకుకూ లేని విధంగా రానున్న రోజుల్లో మన ఆప్కాబ్‌కు మాత్రమే ఉంటుంది. వీటన్నింటికి తోడు ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు. దీనివల్ల భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి గ్రామంలో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలోకి ఫైబర్ గ్రిడ్ చేరుకుంటుంది. ఇవన్నీ గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment