ఎంతటివారినైనా ఎదుర్కోండి | Diamond jubilee celebrations of CBI: PM Narendra Modi calls for action against corruption | Sakshi
Sakshi News home page

ఎంతటివారినైనా ఎదుర్కోండి

Published Tue, Apr 4 2023 5:37 AM | Last Updated on Tue, Apr 4 2023 5:37 AM

Diamond jubilee celebrations of CBI: PM Narendra Modi calls for action against corruption - Sakshi

వజ్రోత్సవ వేడుకలో మెడల్స్‌ గ్రహీతలు, అధికారులతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే కర్తవ్య దీక్షలో ముందడుగువేసి పోరాడాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్యబోధ చేశారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సీబీఐ వజ్రోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ కేంద్రప్రభుత్వ స్థాయిలో అవినీతిని ఎదుర్కొనేందుకు రాజకీయ సంకల్పానికి కొదువే లేదు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయస హకారాలు అందుతాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అవినీతిపై పోరాడండి.

అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే తగ్గేదేలేదు’ అంటూ సీబీఐ అధికారులను ఆదేశించారు. ‘ ప్రజాస్వామ్యం, న్యాయాలకు అవినీతే అతిపెద్ద అవరోధం. అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత సీబీఐ పైనే ఉంది. అవినీతిపరులను వదలొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా అవినీతితో లబ్ధిపొందిన నేతలు నేడు ఏకంగా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపైనే విమర్శలు చేసే పరిస్థితులు సృష్టించారు. పక్కదోవ పట్టించే వీళ్లను పట్టించుకోకుండా విధి నిర్వహణపై దృష్టిపెట్టండి. మన ప్రయత్నంలో అలసత్వం, నిర్లక్ష్యం వద్దు. ఇదే దేశం, దేశ ప్రజలు కోరుకునేది. దేశం, చట్టం, రాజ్యాంగం మీ వెన్నంటే ఉన్నాయి’ అని అధికారులకు భరోసా ఇచ్చారు.

ఫోన్‌కాల్‌తో వేలకోట్ల రుణాలు ఇప్పించుకున్నారు
‘స్వాతంత్య్రం వచ్చేనాటికే దేశంలో అవినీతి తిష్టవేసి ఉంది. దీన్ని తొలగించాల్సిన ఆనాటి నేతలు కొందరు దీనిని మరింత పెంచడం దారుణం. ఎవరెంతగా అవినీతి చేయగలరనే పోటీ నడుస్తోందిప్పుడు. దీంతో దేశంలో పలు వ్యవస్థలు ధ్వంసమై ప్రభుత్వ విధానాలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోతోంది. దేశ ఐక్యత, స్నేహభావం, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే అవినీతిని పెకిలించాలి.

ఇప్పుడు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ వంటి పారదర్శకమైన విధానాలొచ్చాయిగానీ గతంలో కొందరు ‘శక్తివంతమైన’ నేతలు కేవలం ఫోన్‌కాల్‌ ద్వారా తమ వారికి వేలకోట్ల రుణాలు దక్కేలా చేశారు. అలా ఆయాచిత లబ్ధిపొందాక దేశం వదిలి పారిపోయారు. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం ద్వారా మేం రూ.20,000 కోట్ల ఆస్తులను జప్తుచేశాం. ఇలాంటి అవినీతిపరులు మరింత తెగించి ప్రభుత్వం ద్వారా నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన రేషన్, ఇళ్లు, స్కాలర్‌షిప్, పెన్షన్లనూ లూటీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే వాస్తవ లబ్ధిదారునికి చేరుతోందని స్వయంగా గత ప్రధానమంత్రే సెలవిచ్చారు’ అని మోదీ గుర్తుచేశారు.

అందరి నోటా సీబీఐ
‘‘ఏదైనా కేసు సంక్షిష్టంగా, సమస్యాత్మకంగా ఉందంటే పరిష్కారం కోసం ప్రజల నోట వినిపించే ఒకే ఒక పేరు సీబీఐ. 60 ఏళ్లుగా న్యాయం, సత్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీబీఐ నిలుస్తోంది. పంచాయతీ స్థాయిలో జరుగుతున్న ముఖ్య నేరాలనూ సీబీఐకి అప్పజెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవినీతి చిన్నదిగా కనిపించొచ్చు. కానీ అది పేదల హక్కులను లాగేసుకుంటుంది. కొత్తగా ఎన్నో నేరాలకు అంటుకడుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్స్‌ను, చక్కని దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులకు బంగారు పతకాలను ప్రధాని ప్రదానం చేశారు. స్మారక తపాలా బిళ్ల, నాణేలను ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement